–వడ్డెబోయిన శ్రీనివాస్
పదకొండు రోజుల ఉపవాసం గాడా!
నీ నాటకాలన్నీ
తెర మీద సిన్మా చూస్తం
వేల ఏషగాళ్ళల్లో నీ వెర్రి వేరే!
కొబ్బరి చెట్లకు దిష్టి తగిలే నేలకు
గొడ్డలిభాష మార్భలంతో
నిజంతెర మీదకొచ్చి
నీలిగే నటనకు నిప్పంటిస్తాం
తెలంగాణెప్పుడూ
కణకణమండే నిప్పు కణికే!
ఏఊళ్ళెబడితే ఆ ఊళ్ళెపుట్టినట్టు
భగత్సింగ్ ఏషమేశావు
మనోడనుకున్నం
నక్సలైట్ సినిమా తుపాకి తిప్పావు
మావోడనుకున్నం
చెగువేరాలో ముఖం దాచుకున్నావు
మందోడనుకుంటే
గాలిబుగ్గ ఠఫ్ న పలిగినట్టు
కొండంత విద్వేష రాగంతో
మందిని వేరుబడేసే రంగు కింద కూసొని
లడ్డుబాబు ఏషం కట్టావు
నీ ఏషాల గంతలు కట్టుకొని
ఏ నేల తనుసుతాందో చూస్తూనే ఉన్నాం
ఇది ఏషాలకు ఊగిపోయే నేల గాదు
నెత్తురు బోసి ఎత్తుకున్న
వెయ్యిగండ్ల బోనం!
నిప్పుల్ల దునికి జాగీర్ధార్ల జమీను మీద
పోరుపంటలు దీసి
ప్రపంచం కళ్ళనిండా పండుగ జేసిన నేల!
ఇంక నయం కాళోజీ ఏషం గట్టలే!
జాగీరు ముచ్చటెత్తితే
జమీన్ల దొక్కమన్నడు మా కాళోజీ
ఆకలి కడుపు చెమట చుక్కలకు
చేతులెత్తి మొక్కి ఆకలెరగని వలస నక్కలను
హద్దులు దాటించింది
ఇది చెమట చుక్కల జోర్ధారు జాగీరు!
ఏం సక్కదనం నాయనా!
సబ్బండ కులాలు కూటమెత్తి
అరిగోసబడ్తాంటే
ఆయిమన్న పోరగాళ్ళు
ఆవుసు దీసుకుంటాంటే
నోట్లే లడ్డు బెట్టుకొని
పప్పుసుద్ధ లెక్క పన్నవు గని
ఈ నేల దుఃఖం మీద
మాటలన్నిమూటగట్టుకొని
మూతి గుట్టు కొని
ఇయ్యాల నేనూ
తెలంగాణ పాటకు కారు గొనిచ్చినని
అమరులత్యాగాల్ల
ఇయ్యాల మర్రిత్తంత
జెరంత పచ్చబడంగనే
కండ్లల్ల కన్కపు సింహాసనమైందా తెలంగాణ
ఇప్పుడు తెలంగాణల
నీ జెండెత్తి ఉన్మాద రంకెలేస్తావా
విస్నూరు రామచంద్రారెడ్డిని మించినోడివా
ఖాసీంరజ్వంతోడివా
నిజాంను తలదన్ని నోడివా
బిడ్డా! ఇది తెలంగాణ!!
చైతన్య సముద్రంలో తిరిగే
చేపకళ్ళ ఖజాన!!





