సినిమా.. సార్వత్రిక దృశ్య తత్త్వశాస్త్రం

సాహిత్య చరిత్రను లోతుగా పరిశీలిస్తే, మనుషులు ఎల్లప్పుడూ భాష ద్వారా సాధ్యమైనంత ఎక్కువ అనుభూతిని వ్యక్తపరచడానికే ప్రయత్నించారు. అయితే అక్షరానికి సహజమైన పరిమితి ఉంది. అది కాలానికి అనుగుణంగా మాత్రమే ప్రవహిస్తుంది. అంటే ఒక వాక్యం తర్వాతే మరో వాక్యం చదవాలి. కానీ మానవ మేధస్సు, భావోద్వేగాలు ఒకేక్షణంలో ఎన్నోకోణాలను స్పృశిస్తాయి. సినిమా ఈ అక్షర పరిమితిని “మోంటేజ్” (దృశ్యాల కూర్పు) అనే అద్భుత ప్రక్రియ ద్వారా అధిగమించింది. ఒకే క్షణంలో తెరపై ఒక పక్క తల్లికళ్లలోని ఆవేదనను, మరోపక్క గడియారపు ముల్లు కదలికను, నేపథ్యంలోని నిశ్శబ్దాన్ని కలిపి చూపించడం ద్వారా సినిమా కాలాల గమనాన్ని, మనోభావాల సాంద్రతను ఏకకాలంలో పండించగలదు. అందుకే సినిమా అనేది కావ్య, చిత్రలేఖన, శిల్ప, సంగీత కళలన్నింటినీ తనలో లీనం చేసుకున్న ఒక సార్వత్రిక సాహిత్య ప్రక్రియగా అవతరించింది.

పాత్రచిత్రణలో అక్షర సాహిత్యానికి ఉన్న ఆత్మశోధన శైలిని, సినిమా తనదైన “దృశ్య మనస్తత్వశాస్త్రం” ద్వారా పునర్నిర్మిస్తుంది. నవలల్లో చేతనాస్రవంతి లాంటి ప్రక్రియలద్వారా పాత్రల అంతరంగ తరంగాలను రచయితలు పట్టుకుంటే, సినిమాలో అది కెమెరా లెన్స్, కాంతి ద్వారా సాధ్యమవుతుంది. ఉదాహరణకు ఒకపాత్ర పడుతున్న నైతిక సంఘర్షణను వివరించడానికి పుటల కొద్దీ స్వగతాలు అవసరం లేదు. ఆ పాత్ర ముఖంపై పడే సగం చీకటి, సగం వెలుతురు (రెండు స్వభావాలకు ప్రతీకగా) చాలు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ‘మరోచరిత్ర’ లేదా ‘సాగరసంగమం’ వంటి చిత్రాలలో పాత్రల పతనాన్ని, ఉద్వేగాన్ని కేవలం మాటల ద్వారా కాకుండా, ఆ పాత్రలు నిలబడే శూన్య ప్రదేశాలు, వారి శరీర భాష ద్వారా వ్యక్తపరిచారు. ఇది అక్షరం కంటే లోతైన మానసిక విశ్లేషణను ప్రేక్షకులకి అందిస్తుంది.

రస సిద్ధాంతం ప్రకారం గొప్ప కావ్యం చదువుతున్నప్పుడు పాఠకులు ‘సాధారణీకరణ’ స్థితిని పొందుతారు. అనగా కథలోని పాత్రల దుఃఖం తన దుఃఖంగా, వారి సంతోషం తన సంతోషంగా భావిస్తారు. సినిమా ఈ రసాస్వాదనను మరింత గాఢంగా, సామూహిక అనుభూతిగా మారుస్తుంది. చీకటి థియేటర్లో వందల మంది అపరిచితులు ఏకకాలంలో ఒకే దృశ్యానికి కన్నీరు పెట్టడం, ఒకే సంభాషణకు చప్పట్లు కొట్టడం అనేది సాహిత్యానికి ఉన్న సామాజిక ఆత్మకు పరమావధి. కె. విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ చిత్రంలో అమాయకత్వ పవిత్రతను, ‘రుద్రవీణ’లో సామాజిక సమానత్వం కోసం జరిగే ఆరాటాన్ని రసపోషణ ద్వారా చూపించినప్పుడు అది ప్రేక్షకుల హృదయాలను శుద్ధిచేసే తాత్విక ప్రక్రియగా మారుతుంది. ఇక్కడ నేపథ్య సంగీతం అనేది కేవలం ధ్వనికాదు, అక్షరాలు రాయలేని భావాల అంతరార్థాన్ని వివరించే అదృశ్యవ్యాఖ్యాత.

భాషాసౌందర్యం, కవిత్వం విషయానికి వస్తే, సినిమా కేవలం పదాలకే పరిమితం కాకుండా “దృశ్యకవిత్వం”  అనే కొత్తశైలిని సృష్టించింది. కవులు తమ భావనను వ్యక్తీకరించడానికి ఉపమాన, ఉత్ప్రేక్ష అలంకారాలను వాడితే చిత్రదర్శకులు కెమెరా మూవ్‌మెంట్స్, ఫ్రేమింగ్ ద్వారా దృశ్యరూపకాలను సృష్టిస్తారు. ‘మాయాబజార్’లో శశిరేఖ లక్ష్మణకుమారుల వివాహ నిశ్చయ తాంబూలాల సన్నివేశంలో ఘటోత్కచుడి మాయ వల్ల ఆ పాత్రల నిజస్వరూపాలు ప్రతిబింబించే తీరు అద్భుతమైన వ్యంగ్యకావ్యం. అలాగే సిరివెన్నెల సీతారామశాస్త్రి కవిత్వాన్ని తీసుకుంటే సినిమాల కోసం రాసిన “విధాత తలపున..” లేదా “జగమంత కుటుంబం నాది..” వంటి గీతాలు ఉపనిషత్ సారాలను సామాన్యులకి చేరవేసిన ఆధునిక కీర్తనలు. సినిమా లేకపోతే ఈ అద్భుత సాహిత్య ప్రవాహం కేవలం మేధావుల సదస్సులకే పరిమితమై ఉండేదేమో!

సామాజిక విమర్శ, చైతన్యం అనేకోణంలో చూస్తే, సినిమా- సమాజంపై నిరంతరం సాగే విమర్శనాత్మక పరిశోధనా వ్యాసం. గురజాడ అప్పారావు నాటకం ద్వారా సామాజిక రుగ్మతలను ప్రశ్నిస్తే, సినిమా ఆ పరిధిని కోట్లమందికి విస్తరించింది. ఉదాహరణకు సమాజంలోని అంతరాలను, వ్యవస్థీకృత అన్యాయాలను ప్రశ్నిస్తూ వచ్చే తాతినేని ప్రకాశరావు పాతతరం చిత్రాలనుండి, నేటితరం దర్శకుల సామాజిక దృక్పథం వరకు అన్నీ సాహిత్య ప్రతిబింబాలే. శంకర్ ‘భారతీయుడు’ చిత్రంలో లంచగొండితనం వల్ల దేశం ఎలా శిథిలమవుతుందో చూపిన తీరు, ప్లేటో చెప్పిన ఆదర్శరాజ్యంలోని నైతిక విలువలకు జరిగిన చ్యుతిని ప్రశ్నించే రాజకీయ తత్త్వశాస్త్ర చర్చ లాంటిది.

చివరగా సినిమాకు ఉండే అత్యున్నత సాహిత్య లక్షణం దాని ‘ అంతర్లీన అర్థం’ గొప్ప కవిత్వంలో వాక్యాల వెనుక ఉండే గూఢార్థాన్ని వెలికితీసేందుకు పాఠకుడు ఎలాగైతే శ్రమిస్తాడో, సినిమాలో ప్రతి ఫ్రేమ్ వెనుక ఉన్న అంతరార్థాన్ని ప్రేక్షకులు తమ మేధస్సుతో గ్రహిస్తారు. ఒక పాత్ర వెనుక ఉండే గోడ రంగు, నిశ్శబ్దంగా కురిసే వర్షం, లేదా పాత్రలు ధరించే దుస్తుల పరిణామం (కలర్ సైకాలజీ) కూడా కథను అంతర్గతంగా నడిపిస్తాయి.

ముగింపుగా చెప్పాలంటే, సాహిత్యం అంటే కేవలం కాగితంపై నిశ్చలంగా ఉండే నల్లటి అక్షరాలు మాత్రమే కాదు. అది మానవ చైతన్యపు నిరంతర ఆవిష్కరణ. అక్షరం తన పరిమితులను ఒప్పుకొని, శబ్దానికి, కాంతికి, వర్ణానికి సింహాసనాన్ని అప్పగించినప్పుడే సినిమా అనే పరమ అద్భుతమైన “ఆధునిక దృశ్య సాహిత్యం” సాక్షాత్కరిస్తుంది. కథ, కథనం, తాత్వికత, రసపోషణల సమాహారమైన సినిమా మానవజాతి సృష్టించిన అత్యంత సంక్లిష్టమైన, శక్తివంతమైన సజీవ కావ్యం.

  డి జైరాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *