-బమ్మిడి జగదీశ్వరరావు
ఆవు అమాయకంగా చూసింది. అంతకంటే అయోమయంగానూ ఆందోళనగానూ చూసింది. ‘నిన్నటిదాక నా నుదురునుండి ముక్కువరకు పసుపుపూసి, దానిమీద వీరతిలకం దిద్దినట్టు కుంకుమరాసి, కళ్ళకు కాటుక కూడా పెట్టి, చాలక పాదాలకూ పసుపురాసి, ఆగక గంగడోలుకు గంధం అద్ది, మెళ్ళో పూలదండలు వేసి, దండాలు పెట్టి, హారతులిచ్చిన మీరేనా?’ అన్నట్టు చూసింది?! గొంతెండిపోతుంటే యెంగిళ్ళుపోసిన కుడితినీళ్ళు యెప్పటిలానే తాగింది, కాని గొంతుకు యేదో అడ్డంపడ్డట్టే వుంది.
ఆవుకి యేం జరుగుతూవుందో అర్థం కాలేదు. తోకని కొరడాచేసి పోతురాజుని గుర్తుకుతెచ్చుకొని తన కటి భాగంమీద తనే టపీటపీమని కొట్టుకుంది, యీగల్ని తోలుతున్నట్టు కాదు… చర్మం చిట్లిపోయినట్టు. అంతకంటే యేమిచెయ్యాలో చేతకానట్టు.
ఎదురుగావున్న గాడిద తనకేమీ సంబంధం లేనట్టు చెవులాడిస్తూ యెప్పటిలానే చూసింది.
‘అడ్డగాడిదా రా’ యింటాయన కేకేస్తూ యింట్లోంచి షెడ్‌లోకి వచ్చాడు. గాడిద తననేమో అనుకొని ముందుకు అడుగెయ్యబోయి ఆగింది. ఎప్పటిలా ఆవు వెన్ను కాదు, గాడిద వెన్ను నిమిరాడు. ఆపై ఆవు మెడలో వేసిన మువ్వల గొలుసుతీసి గాడిద మెడలో వేశాడు. అది చూసిన అతగాని ముసలితల్లి ‘గోమాతరా?’ అంది. ‘కాదు, గాడిదమాత!’ అన్నాడు.
‘అమ్మా… నువ్వెప్పుడూ యేమనేదానివే?’ అడిగిన యింటాయన తనే చెప్పాడు. ‘చదువెందుకు సంకనాకినందుకు?, పది గోవుల్ వున్న పాలున్ పెరుగున్’ అంటున్నప్పుడే- చదువు అబ్బినా చెడిపోయిన కొడుకు సాక్ష్యంగా ముందుకొచ్చి నిలబడ్డాడు.
‘ఒరే అడ్డగాడిదా, గాడిదని నమ్ముకోరా’ అన్నాడు కొడుకుతో యింటాయన. ‘గాడిదలు కాసుకోరా’ అన్నట్టు వినిపించింది కొడుక్కి. సిగ్గుతో తలదించుకున్నాడు. ‘ఇది సిగ్గుతో తలదించుకొనే విషయం కాదు, గర్వంగా తలెత్తుకొనే విషయం’ అన్నాడు మళ్ళీ యింటాయన.
వింటున్న గాడిదకు కూడా యేమీ అర్థం కాలేదు. వెనకటికి వాసుదేవుడి అంతటివాడే తమ జాతి పూర్వీకుల కాళ్ళు పట్టుకున్నాడు. అది అవసరార్థం. మరి యిది?- నెమరు వేసుకుంది.
ఆవు తన ప్రత్యేక హోదాకి భంగం కలిగినట్టు ‘అంబా’ అని అరిచింది. ఇంటాయన వినలేనట్టు చెవులు మూసుకున్నాడు. ఓండ్ర పెట్టిన గాడిద గాత్రం విని పరవశించిపోయాడు.
‘ఏమయిందిరా?’ గింజుకుంటూ అరిచింది అతని తల్లి.
‘లీటరు ఆవు పాలు అరవై రూపాయలు. అదే గాడిద పాలు రెండువేలు నుండి యేడువేలు దాకా వుంది. సప్లయ్‌ని బట్టి రేటు. ఆవు పాలు శ్రేష్ఠము. గాడిద పాలు ఔషదము…’ యింటాయన యింకా చెప్పేవాడే. ‘గంగి గోవు పాలు గరిటడైనను చాలు, కడవడైన నేమి ఖరము పాలు’ అని చెప్పి అతగాని కొడుకు చెప్పబోయాడు.
‘దేనికైనా ఎక్స్‌పైరీ వుంటుంది’ అన్న యింటాయన మాట కొడుక్కి బోధపడలేదు. తండ్రి అంటున్నది తన చదువు గురించో లేక పాల గురించో తేల్చుకోలేకపోయాడు.
అప్పటికి తేరుకొని తేటపరచుకొని ‘గాడిదమాత… గాడిదమాత…’ అని స్మరించింది యింటాయన తల్లి.
‘ఆవుకి కాదు, గాడిదకు కొమ్ములు వుంటే బావుణ్ణు’ అని వొకింత బాధపడ్డాడు యింటాయన.





