ప్రజా విజయోత్సవాలు కాదు.. ప్రజా వంచన ఉత్సవాలు చేసుకోండి

  • మీ కమీషన్ల కోసం రైతులను బలి పెడతారా?
  • బోనస్’ తప్పించుకోవడానికే కొనుగోళ్లలో జాప్యం
  • సుతిలి, రవాణా, వడ్ల డబ్బు కేంద్రమే అందిస్తుంది
  • ధాన్యం కొనడానికి మీకున్న నొప్పేంది?
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి ఫైర్

శంకరపట్నం, ప్రజాతంత్ర, నవంబర్ 10: కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ పైసలివ్వకుండా తప్పించుకోవడానికి ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బ్రోకర్ల నుంచి కమీషన్లు దండుకునేందుకు రాష్ట్ర‌ రైతుల ప్రయోజనాలను బలి పెడుతున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం పైసలన్నీ మిత్తీతోసహా కేంద్రమే చెల్లిస్తోందన్నారు. అయినప్పటికీ వొడ్లు కొనివ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వొచ్చిన నొప్పి ఏందని ప్రశ్నించారు. ఏడాది పాలనపై కాంగ్రెస్ పార్టీ ప్రజా విజయోత్సవాలు నిర్వహణ పై విమర్శలు గుప్పించారు ఏం సాధించారని ప్రజా విజయోత్సవాలు ? 6 గ్యారంటీలు అమలు చేశారా? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలనెలా రూ.2500 ఇచ్చారని విజయోత్సవాలు చేసుకుంటారా? వృద్దులకు రూ.4 వేల ఆసరా పెన్షన్ ఇచ్చారా? పేదలకు ఇండ్లు ఇచ్చారా? దేనికోసం విజయోత్సవాలు అని ప్రశ్నించారు. ఓట్లేయించుకుని మోసం చేసినందుకు ప్రజా వంచన ఉత్సవాలు చేసుకోండంటూ దుయ్యబట్టారు..
ఆదివారం కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం కొత్తగట్టులో బీజేపీ నాయకులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలులో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. నెలరోజులైనా వడ్లు కొనడం లేదని, అడ్డికి పావుశేరు బ్రోకర్లకు అమ్ముకోవాల్సి వస్తుందని వాపోయారు. ప్రతి ఏటా నష్టపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. వడ్ల కొనుగోలులో ప్రభుత్వం రూపొందించిన యాక్షన్ ప్లాన్ కు, ఆచరణకు పొంతనే లేదన్నారు. కొనుగోలు కేంద్రాలు కూడా నేటికీ పూర్తిగా ప్రారంభించలేదని పేర్కొంటూ సర్కార్ గణాంకాలను చూపారు.

ఈ వానా కాలం సీజన్ లో 95 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత నెల 1 నుండే వడ్లు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. 7,572 వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినం, అక్టోబర్ నెలలోనే 8 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేస్తామని అన్నారు. యాక్షన్ ప్లాన్ రూపొందించారు. నేటికీ ప్రభుత్వ లెక్కల ప్రకారమే వడ్ల కొనుగోలు ప్రారంభమై 40 రోజులైంది. ఎక్క‌డ‌ చూసినా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు రాశులుగా ఉన్నాయి. అక్కడ జాగాలేక, టార్పాలిన్ కవర్లు లేక రోడ్లపై రాశులు పోస్తున్నారు. ఈ 50 రోజుల్లో ఎన్ని వొడ్లు కొన్నారు అని ప్రశ్నించి ప్రభుత్వ గణాంకాలను ఎత్తిచూపారు.
అక్టోబర్ లో 8 లక్షలు, నవంబర్ లో 33 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం కొంటామని ప్రకటించి, ఈరోజు వ‌ర‌కు 40 రోజులైనా, 20 లక్షల మెట్రిక్ టన్నులు కొనలేదన్నారు.అందులో 20 వంతు కూడా కొనలేకపోయింది. ఈ నెల 5 నాటికి 95, 140 ల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొన్నారు. 220.72 కోట్లు చెల్లించాల్సి ఉండగా 6 కోట్ల 44 లక్షలు మాత్రమే చెల్లించారు. రైతులు ఇంత గోస పడుతుంటే ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెన్ చేయలేదంటే ఏమనాలి? రాష్ట్రవ్యాప్తంగా 7,572 వొడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పుడు 6017 కేంద్రాలు మాత్రమే ప్రారంబించారు. ఇంకా 1724 కేంద్రాలు ఇంకా ప్రారంబించాలి. ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? గతేడాదితో పోలిస్తే ఈసారి చాలా తక్కువ వడ్లు కొన్నరు. గతేడాది ఇదే సమయానికి 2 లక్షల మెట్రిక్ టన్నుల వొడ్లు కొన్నారు. ఈసారి లక్ష మెట్రిక్ టన్నులు కూడా కొనలే. అందుకే నేను పదేపదే చెబుతున్న రైతులు, తెలంగాణ ప్రజల పరిస్థితి ‘పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లయిందని’. వడ్లు రాలేదా? ఇప్పటికే 30 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వడ్లు వచ్చినయ్. రైతులంతా వడ్లతో నెలరోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే ఎదురు చూసిర్రు. రోడ్లపైన రాశులు పోసిర్రు.. అయినా ప్రభుత్వం వడ్లు కొనకుండా అరిగోస పెట్టడంతో విసిగిపోయిన రైతులు అడ్డికి పావుశేరుకు మిల్లర్లకు అమ్ముకుంటున్నరు.

కేంద్రం వడ్లకు కనీస మద్దతు క్వింటాకు రూ. 2,300 కుపైగా చెల్లిస్తోంది. వీటికి తోడు రూ.500 బోనస్ అదనంగా చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ సీజన్ లో 50 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వొడ్లకు 500 చొప్పున రూ. 2, 500 కోట్లు బోనస్ చెల్లిస్తామని ప్రగల్భాలు పలికి నేటి వరకు బోనస్ రూపంలో నయా పైసా కూడా రైతులకు ఇవ్వ‌లేదు. క‌నీసం కొనుగోళ్లు లేక విసిగిపోయిన రైతన్నలు ఇప్పటికే 20 లక్షల మెట్రిక్ టన్నుల వొడ్లను మిల్లర్లకు అడ్డికి పావుశేరుకు అమ్ముకున్నరు. సగటున 2 వేల లోపే అమ్మేసుకున్నారు. పైగా తాలు, తరుగు పేరుతో క్వింటాలుకు 5 నుంచి 10 కిలోలు నష్టపోయారు. ఈ లెక్కన ఇప్పటికే రూ.1000 కోట్లకుపైగా నష్టపోయారు. రైతులను అరిగోసపెట్టి దోచుకోవడమేనా కాంగ్రెస్ పాలనంటే? అని మండిపడ్డారు. రైతుల నుంచి ఎన్ని వడ్లు కొంటే అన్ని పైసలు కేంద్రమే ఇస్తోంది. గత పదేళ్లలో వడ్ల కొనుగోలు కోసమే లక్ష కోట్లకు పైగా తెలంగాణకు చెల్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గత యాసంగిలో 48 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేసి రైతులకు రూ.10,547 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే, కేంద్రం వడ్డీతో సహా 10, 549 కోట్లు చెల్లించింది. ఈ వానాకాలంలో 95 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తే… బహిరంగ మార్కెట్ అవసరాలకు 40 లక్షల పోతే, మిగిలిన 55 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలుకు పైసలన్నీ చెల్లించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. చివరకు వడ్ల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం బయట అప్పు తీసుకుంటే… ఆ డబ్బులకు మిత్తీ కూడా కేంద్రమే వడ్డీ చెల్లిస్తోంది. అయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం మాయరోగం? ఎందుకు సకాలంలో వడ్లు కొనకుండా రైతులను అరిగోస పెడుతోంది? అని దుయ్యబట్టారు.

సకాలంలో వడ్లు కొంటే బోనస్ ఇవ్వాలి. దానికి 2,500 కోట్లు కావాలి. ఇక మిగిలేదేమీ ఉండదు. అలా కాకుండా కొనుగోలు కేంద్రాలకు వొచ్చిన వడ్లను బ్రోకర్లు కొనేదాకా ఎదురు చూస్తే కోట్లకు కోట్లు కమీషన్లు దండుకోవచ్చు. బోనస్ భారం తగ్గించుకోవచ్చనేది కాంగ్రెస్ కుట్ర. బోనస్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి, కమీషన్లు దండుకోవడానికి రైతుల ప్రయోజనాలను బలి పెడుతున్నారుని తీవ్రంగా విమర్శించారు. ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. మీ దరిద్రపు పాలన వల్ల కొత్త లోన్లు రాక, బయట అప్పులు పుట్టక అరిగోస పడుతున్నరు. రైతు భరోసా మొన్న యాసంగితో పాటు ఈ వానా కాలం పంటలకు కూడా ఎగ్గొట్టారు. రైతు భరోసా ఎకరాకు 15 వేలు ఇస్తామని చెప్పి… గతంలో ఇచ్చే 10 వేలను కూడా ఎగ్గొట్టారని ఆరోపించారు.

ఆలయాలపై దాడులపై స్పందించ‌రేం..?

రాష్ట్రంలోని ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని శంషాబాద్ హనుమాన్ ఆలయంలో నవగ్రహాలను ధ్వంసం చేశారని , ఆ ఘటన మరవక ముందే శంషాబాద్ లోనే మళ్లీ గుడిని సల్మాన్ అనే వ్య‌క్తి టోడు దాడి చేశాడ‌ని బండి సంజ‌య్ తెలిపారు.
వరుస ఘటనలను చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చాక ఆలయాలను ధ్వంసం చేసేందుకు ప్రత్యేక దళాలు ఏమైనా వొచ్చాయా? అనే అనుమానం కలుగుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చూసీ చూడనట్లు పోతోంది. కాబట్టి ఏం చేసినా పట్టించుకోరని దాడులకు తెగబడుతున్నారని తెలిపారు. .

కాల్వలు బ్రిడ్జి పై వినతి

కేశవపట్నం నుంచి చెల్లూరు వరకు కేంద్రం నిధులతో నిర్మించిన రహదారిలో కలవల గ్రామంలో వాగుపై గల కాజ్ వే బ్రిడ్జ్ స్థానంలో ఎత్తైన బ్రిడ్జిని నిర్మించాలని గ్రామ నాయకులు చర్ల శ్రీనివాస్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని కోరారు. గ్రామస్తులు, ప్రయాణికులు, పాడి పశువులు, వాహనాలు ప్రమాదాలకు గురై నష్టపోతున్నారన్నారు. గ్రామస్తుల తో పాటుగా ప్రయాణికులను ప్రమాదాల బారి నుంచి రక్షించాలని, ఈ వాగు పై వంతెన నిర్మాణం తో నాలుగు జిల్లాలకు ప్రయాణం దూరం తగ్గుతుంది. గతంలో మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మంత్రికి విన్నవించారు. స్పందించిన మంత్రి పరిశీలనలో ఉందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *