రెక్కలు తెగిన పక్షిలా
వంట గదిలో బంధీయై..
ఒంటికి తగిలిన గాయాలను
భూదేవిలా ఓర్పుతో భరిస్తూ..
నివురు గప్పిన నిప్పులా
బాధనంతా మనసులో దాచుకొని..
వంట గది కిటికీలోంచి
ప్రపంచాన్ని చూస్తూ..
జీవితాన్ని సాగిస్తున్న ఓ నారీ మణులరా..
నెత్తిన బోలెను పెట్టుకొని
ఇటుక పెల్లల్ని మోస్తూ..
భుజాన జోలెను కట్టుకొని
చంకలో పసి పిల్లల్ని మోస్తూ..
నెత్తిన జీవితాన్ని భరిస్తూ
భుజాన భవిష్యత్తును ఇస్తున్న
ఓ మహిళా కార్మికులారా..
రక్షణ లేని ఈ సమాజంలో
మొహానికి ముసుగులేసుకొని
భయానికి చీకట్లను పులుముకొని
స్వేచ్ఛకు సంకెళ్ళను వేసుకొని
రాబందుల కళ్ళకి చిక్కకుండా
జీవితాలని చీకట్లలో గడిపేస్తున్న
ఓ యువతుల్లారా..
ఇంకెన్నాళ్ళిలా పంజరంలో చిలుకల్లా
నాలుగు గోడల మధ్య బ్రతుకుదాం
రండి.. ముందడుగెయ్యండి..
అడ్డుగోడల్ని పెకిలించండి
ప్రపంచ యవ్వనికపై మన గళాన్ని వినిపిద్దాం..
లింగ సమానత్వాన్ని రూపు మాపుదాం..
సమ సమానత్వాన్ని సాధిద్దాం…
– కోనేటి నరేష్,
శ్రీ సత్యసాయి జిల్లా,
8499847863, konetinaresh77@gmail.com