ఇంటా,బయటా,దారులెంటా…..
మాటువేసి దారి కాచే
తారసిల్లెటి మృగాలెవో
పలుకరించెటి ప్రమాదాల
విషపు కాటుల రూపులేవో
కొత్త పాఠం చెప్పి చూడండి..
మనుస్మృతి ధర్మాల చాటున
అమానవీయ అధర్మమేమిటొ
అడబతుకుల దాస్యమెందుకొ
ఎవరి పెత్తనం ఎందుకోసమో
కుహన బోధల గుట్టు విప్పే
కొత్తపాఠం చెప్పి చూడండి
రక్తబంధపు ప్రేమ పాశము
మించి యేదీ లేనె లేదని
ఏవి స్నేహం,ఏవి ప్రేమలొ
వేటి వెనుకన ఏమి దాగెనో
తప్పటడుగుల తలపు విరిచి
కొత్త పాఠం చెప్పి చూడండి
బానిసత్వపు బతుకు లొద్దని
తలలు వంచే వెతలు రద్దని
కొత్త యోచన ,కొత్త నడతలు
చదువుతోటే చేరువవునని
లోకపోకడల ముల్లె లిప్పి
కొత్తపాఠం చెప్పి చూడండి
ముఖం పై సహనాలు పులిమి
పెదాలకు నవ్వులను తురిమే
సర్దుబాటుల వెకిలి వలదని
జంకిగొంకే నడక తగదని
ఆడదంటే అబల కాదని
కొత్తపాఠం చెప్పి చూడండి.
హెచ్చుతగ్గుల లోకనీతిని
ఆటబొమ్మగ చూసె రీతిని
పిడికిలెత్తి పీచమనెచెడి
నిలిచి గెలిచే పోరు బరిలో
కొత్త బతుకుల తీరుతెన్నుల
కొత్తపాఠం చెప్పి చూడండి
బంధాల బాధ్యతల నడుమ
వెల్లువెత్తే చాకిరుల వెతలూ
చమట కక్కిన నొసలు తుడిచీ
తడిసి పోయెటి చీర కొంగు ను
నడుము చుట్టీ ఉరిమి చూసెడి
కొత్తపాఠం చెప్పి చూడండి
ఆకసాన సగం మనమని
తెగువ చూపెడి నడక మేలని
అరుణ కాంతుల నొడిసిపట్టి
తమను తాము తెలుసుకునెడి
అరుణకాంతుల దారులివి యని
కొత్తపాఠం చెప్పి చూడండి.
– అజయ్.
టీచర్.వరంగల్.