- ఈనెల 28న నిరుపేద రైతు కూలీలకు మొదటి విడత డబ్బులు
- సన్నాలకు బోనస్ చెల్లింపుతో అన్నదాతల్లో ఆనందం
- రాష్ట్ర అప్పులపై బిఆర్ఎస్ నాయకులు పచ్చి అబద్ధాలు
- గత పదేళ్ల కాలంలో 7,11,911 కోట్లు అప్పులు
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్ 15 : వొచ్చే సంక్రాంతి పండుగ నుంచి అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. భూమిలేని నిరుపేద కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్న హామీని ఈనెల 28 నుంచి ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. దేశ స్వాతంత్రం కోసం ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు డిసెంబర్ 28న నిరుపేద కూలీలకు మొదటి విడత డబ్బులు 6 వేలు ఇస్తామని, వొచ్చే సంక్రాంతి నుంచి రైతులకు రైతు భరోసా డబ్బులను అందజేస్తామని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వ అధికారంలోకి వొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయానికి, రైతుల కోసం నేరుగా 50,953 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. బిఆర్ఎస్ నాయకులకు గాలి మాటలు చెప్పడం అలవాటేనని, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు కలిగించి ప్రజలను మోసం చేయడమే వారికి తెలుసునని భట్టి విక్రమార్క చెప్పారు.
అప్పులపై చర్చకు సిద్ధమా?
గత 10 సంవత్సరాల కాలంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 7,11,911 కోట్ల రూపాయల అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు. నేడు తాము అప్పులు చేసినట్లుగా ఆ పార్టీ ప్రచారం చేయడం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ తినడానికి అప్పులు చేస్తే.. వారు చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసిందని క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.54, 118 కోట్లు అప్పులు చేయగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలకు మొత్తం 66,782 కోట్ల రూపాయలు బ్యాంకులకు కట్టామన్నారు. అసెంబ్లీ లో ఎవరు ఎన్ని అప్పులు చేశారో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నాటికి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు 72,658 కోట్లు రూపాయలు ఉండగా, 2024 నాటికి 3,89,673 కోట్ల రూపాయలు గత బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందని వివరించారు. కార్పొరేషన్ల పేరిట ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి తీసుకున్న అప్పులు 2014 నాటికి 5,893 కోట్ల రూపాయలు ఉండగా, 2024 నాటికి 95,462 కోట్లు, ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా వివిధ కార్పొరేషన్లు నేరుగా చేసిన అప్పులు 2014 నాటికి ఏమీ లేకపోగా, 2024 నాటికి 59,414 కోట్లు రూపాయలు అప్పు గత పాలకులు చేశారన్నారు. ఇవే కాకుండా గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పాలకులు ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, హాస్పిటల్, ఉద్యోగుల జిపిఎఫ్, మిడ్ డే మీల్స్, ఫీజు రియంబర్స్మెంట్ తదితర వాటికి అప్పుగా పెట్టినవి 40,154 కోట్ల రూపాయలు ఉన్నాయని, వీటన్నిటిని కలిపితే మొత్తం రూ.7,11,911 కోట్ల అప్పుల భారాన్ని గత బిఆర్ఎస్ పాలకులు ప్రజలపై మోపి తగుదునమ్మ అంటూ కేటీఆర్, హరీష్ రావులు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా రాష్ట్ర అప్పుల గురించి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ప్రతీ గింజను కొంటాం..
రాష్ట్రంలో పండిన ప్రతి గింజను ప్రజా ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. వారం రోజుల్లో కొనుగోలు చేసిన డబ్బులు చెల్లిస్తున్నామని, సన్నాలకు బోనస్ ఇస్తున్నామని తెలిపారు. 1.20 లక్షల కోట్లతోగొప్పగా అద్భుతంగా కాళేశ్వరం కట్టామని బిఆర్ఎస్ నాయకులు గొప్పగా చెప్పుకున్నారు. కాళేశ్వరంతో సంబంధం లేకుండా ఈ ఏడాది వారి ఉత్పత్తి గణనీయంగా ఎందుకు పెరిగింది అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. సన్నాలపై రైతులకు క్వింటాకు ఇస్తున్న రూ.500 బోనస్ ద్వారా ప్రతి ఎకరాకు 10 నుంచి 15వేల రూపాయలను అదనంగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ప్రజా ప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తున్నది. ఏడాది కాలంలో వ్యవసాయానికి రైతులకు నేరుగా రూ.50,953 కోట్ల మేర ఖర్చు చేసింది
రైతు భరోసా కు 7625 కోట్లు, రైతు రుణమాఫీకి రూ.21 వేల కోట్లు, రైతు బీమా ప్రీమియం చెల్లింపునకు రూ.1514 కోట్లు, ఫర్ డ్రాప్ మోర్ క్రాప్ కోసం రూ. 40 కోట్లు, రైతులకు విత్తనాల సరఫరాకు రూ.36 కోట్లు, వ్యవసాయ పంపు సెట్లకు ఇస్తున్న సబ్సిడీకి రూ.11270 కోట్లు, వ్యవసాయానికి కావలసిన సాగునీరు పనుల కోసం 9795 కోట్లు, మొత్తం 50, 953 కోట్ల రూపాయలను ప్రజా ప్రభుత్వం కేవలం రైతులకు వ్యవసాయం కోసం ఖర్చు చేసిందని భట్టి విక్రమార్క వివరించారు.
తెలంగాణలో నాలుగు కొత్త విమానాశ్రయాలు
రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల విస్తరణ కోసం ప్రజా ప్రభుత్వం కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క వెల్లTelangana News,Telangana News Updates,Telugu News,Telugu News online
డించారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని, అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో ఫ్యూచర్ సిటీని నిర్మాణం చేస్తున్నామన్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం గుండా 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీని ప్రక్షాళన చేసి పునర్జీవం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని వెల్లడించారు. అన్ని జిల్లాలను కలుపుతూ రీజినల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తాం. ఔటర్ రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ మధ్యన ఇండస్ట్రియల్, హౌసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేసి భవిష్యత్తు తరాలకు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.