డిజిటల్‌ రంగంలో సాధికారతకు కృషి..

రాష్ట్రంలో 400 గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లకు విస్త‌రిస్తాం..
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు సైతం ఐటీ కంపెనీలు
ఐటి, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు

రానున్న రోజుల్లో తెలంగాణ‌లో 400 గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ)ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 220కిపైగా జీసీసీలు ఉండగా సమీప భవిష్యత్‌లో వీటిని 400లకు పెంచడం ద్వారా బెంగుళూరును అధిగమించాలని సంకల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ, ఇంజినీరింగ్‌ సొల్యూషన్స్‍ సంస్థ ‘టెక్‌వేవ్‌’ హైదరాబాద్‌లోని తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటుచేసిన అత్యాధునిక గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌(జీడీసీ)ను శనివారం మంత్రి శ్రీధర్‌ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటల్‌ రంగంలో సాధికారత సాధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అంతేకాకుండా నూతన కంపెనీలను ఆకర్షించేందుకు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తోడ్పాటు అందిస్తుందని చెప్పారు.

హైదరాబాద్‌తోపాటు ద్వితీయ, తృతీయశ్రేణి నగరాలకు సైతం ఐటీ కంపెనీలను విస్తరించడం ద్వారా రాష్ట్ర సమతుల అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు, ఇందులో టెక్‌వేవ్‌ ఏర్పాటుచేసిన జీడీపీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిపై పెట్టుబడి పెట్టడం ద్వారా సమగ్ర, సుస్థిర, సమతులాభివృద్ధితో కూడిన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌ బాబు వివరించారు. కాగా అమెరికాలోని హ్యూస్టన్‌లో ప్రధాన కార్యాలయం కగిలివున్న టెక్‌వేవ్‌.. హంగరీ, యూకే, దక్షిణాఫ్రికా, భారత్‌ తదితర 11దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. కంపెనీకి చెందిన హైదరాబాద్‌లో కార్యాలయంలో ప్రస్తుతం 2,400 మంది, అలాగే ఖమ్మంలో మరో 500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజాగా లక్ష చదరపు అడుగుల వైశాల్యంలో ఏర్పాటుచేసిన టెక్‌వేవ్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో మరో 1200 మందికి ఉద్యోగాలు లభిస్తాయని సంస్థ వెల్లడించింది. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, టెక్‌వేవ్‌ సహ వ్యవస్థాపకులు, ఛైర్మన్‌ జీ. దామోదర్‌ రావు, కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌ చంద్రారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page