వరంగల్‌లోని ప్రసిద్ద భద్రకాళి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గాయత్రి మాతగా భద్రకాళి చంద్రఘంటా క్రమంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మూడో రోజు శనివారం భద్రకాళి అమ్మవారిని గాయత్రి మాతగా అలంకరించారు. సమస్త మంత్రసిద్ధి మంత్రాల కలయికగా దీనిని చెప్తారు. కాగా అమ్మవారు చంద్రగంటా క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు.
అదేవిధంగా సింహం వాహనంపై భద్రకాళి అమ్మవారిని వేలాది భక్తుల సమక్షంలో ఊరేగించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు విశేష పూజలు జరిగాయి. భక్తులతో దేవాలయం కిటకిటలాడింది. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులలో ఐఏఎస్ అధికారి గిరిజ శంకర్ తదితరులున్నారు. వారికి దేవాలయ సహాయ కమిషనర్ శేషుభారతి ఆలయం మర్యాదలతో స్వాగతం పలికి సత్కరించారు.