- మోసం చేసినా కాంగ్రెస్ ను ఊరుకుందామా.. ఉరికిద్దామా..
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర : కేసీఆర్ ప్రభుత్వం పోయాక అన్నీ పోయాయని, పథకాల కాలం పోయి ఫొటోలకు ఫోజులు ఇచ్చే కాలం వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. నేడు 10వేలు, రేపయితే 15వేల రైతు భరోసా అన్నరు. ప్రజలు నమ్మితే నట్టేట ముంచారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ గారు రైతు బంధు ఆపలేదు మంత్రుల, ఎమ్మెల్యేల జీతాలు ఆపి మరీ రైతులకు రైతు బంధు ఇచ్చారని హరీష్ రావు గుర్తుచేశారు. ఇప్పుడు కరోనా లేదు ఎందుకు రైతు బంధు పడలేదు.. 15వేలు పడలేదు, కేసీఆర్ ఇచ్చే పది వేలు పడలేదని, రైతులను రేవంత్ రెడ్డి ఘోరంగా మోసం చేశారని విమర్శించారు.
అందుకే రేవంత్ రెడ్డి మీద అందరం కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మోసం చేసినా కాంగ్రెస్ ను ఊరుకుందామా.. ఉరికిద్దామా.. అంటూ మానకొండురు నియోజకవర్గ బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం అలయ్ బలయ్ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు ఉద్వేగంగా ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశం చూస్తే 2001 నాటి రోజులు గుర్తు వస్తోందని, ఆ స్పూర్తి కనిపిస్తున్నదని తెలిపారు. రసమయి బాలకిషన్ కూడా అలయ్ బలయ్ పేరిట తన పాట పేరిట కాంగ్రెస్ మీద పోరాటానికి ఆయుధం విసిరాడు. రసమయి. ఉద్యమ సయమంలో ధూం..ధాం.. పేరిట ఎంతో జాగృతం చేశారని కొనియాడారు. మరోసారి రైతులను, ప్రజలను అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ మీద పోరాటానికి మరో ధూం..ధాం.. మొదలుపెట్టే రోజులు వచ్చినయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తీసుకు వచ్చి రేవంత్ రెడ్డి హామీలు ఇప్పించాడు. కాంగ్రెస్ హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఇక పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. కేసీఆర్ బతుకమ్మ పండుగ వేల చీరలు ఇచ్చారు. కేసీఆర్ కిట్లు, న్యూట్రీషన్ కిట్లు ఇచ్చిండు, చెరువుల్లో చేపలు వేసిండు. గొర్రెలు ఇచ్చారని తెలిపారు. రైతు బంధు కింద 11 విడతల్లో రూ.72వేల కోట్లు కేసీఆర్ ఇచ్చారని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి ఉన్న పథకాలను బంద్ చేశాడని విమర్శించారు. మహిళలకు రూ.2500 సాయం, ప్రతి మహిళకు రూ.25వేల బాకీ పడ్డాడని, బతుకమ్మ చీరెలు, రూ. 500 ఇస్తానని చెప్పి ఎగ్గొట్టాడని తెలిపారు. వృద్ధులకు 4వేల పింఛన్ ఇస్తానని మాట తప్పాడని అన్నారు. పింఛన్లు దగా, రైతులకు బోనస్, రుణమాఫీ. తులం బంగారం, విద్యార్థులకు జాబ్స్, మహిళలకు 2500 అన్నీ దగా చేశారని అన్నారు.
ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రెడ్డి..
సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రెడ్డి.. అని, ఆయన చీఫ్ మినిస్టర్ కాదు, చీటింగ్ మ్యాన్ అని ఎద్దేవా చేశారు. పంటలకు బోనస్ అని మోసం చేసిండు. సన్నాలకు అని మాట మార్చి, ప్రభుత్వ సెంటర్ల వద్ద అమ్మితేనే ఆ బోనస్ ఇస్తా అంటున్నాడని అన్నారు. వర్షాలకు పత్తి దెబ్బ తిన్నది. ఇప్పటి వరకు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఒక్కో పంచాయతీ సెక్రెటరీ లక్షకు పైగా అప్పుల పాలయ్యారు. కాంగ్రెస్ వచ్చింది ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని, రుణమాఫీ సగం కూడా కాలేదు.. రాజీనామా చేస్తవా అన్నడు. మానకొండూరులో ఏ ఊరుకు వస్తవో రా రేవంత్ రెడ్డి.. ఒక్క ఊర్లో అయినా రుణమాఫీ అయ్యందా
వోట్ల ముందు డిసెంబర్ 9 తారీఖు రుణమాఫీ అన్నాడు.. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆగస్టు 15నాటికి పూర్తి చేస్తా అన్నాడు. దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. నేను యాదాద్రికి వెళ్లి ఈ పాపాత్ముడిని క్షమించు. మా తెలంగాణ ప్రజలను కాపాడు అని వేడుకున్నా. అక్కడా నా మీద కేసులు పెట్టాడు. రుణమాఫీ డిసెంబర్ 9, 2024 వరకు చేస్తానని ఇప్పుడు అంటున్నారు. అది కూడా 3 లక్షల మందికే అట. ఈ రుణమాఫీ పైసలన్నా పడ్డాయంటే బీఆర్ఎస్ పార్టీ నిలదీయడం వల్లనే జరిగింది. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అనేది పెద్ద మోసం. నిరుద్యోగ యువత పై అరాచకం చేస్తున్నారు. బందిపోట్లు, కిరాతకులు, దొంగలను కొట్టినట్లు నిరుద్యోగులను ఇష్టం ఉన్నట్లు కొడుతున్నారు. రాహుల్ గాంధీ లైబ్రరీ పోయి వోట్లప్పుడు విద్యార్థులను బతిమిలాడారు. ఇప్పుడు ఎక్కడికి పోయారు. కేసీఆర్ లక్షా 30వేల ఉద్యోగాలు ఇచ్చాడు. ఉద్యోగాల కోసం అడిగితే కిరాతకంగా కొడుతున్నారు
రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా లైబ్రరీ వెళ్లు జీవో 29 రద్దు చేయాలంటే ఎందుకు చేయడం లేదు. రాజ్యాంగం ప్రకారం రావాల్సిన అవకాశాలను ఎందుకు అడ్డుకుంటున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులకు రాజ్యంగా ఫలాలు దక్కకూడదా.. రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, రేవంత్ మాత్రం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నడు. రాహుల్ గాంధీ ఎక్కడున్నావు, ఆరు గ్యారెంటీల బాధ్యత నాది అని చెప్పిన సోనియా గాంధీ ఎక్కడున్నారు.? లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా మానకొండూరులో బీఆర్ఎస్ వాళ్లే గెలుస్తారు.
కాంగ్రెస్ వికృత వైఖరి పట్ల గ్రామ గ్రామాన చర్చలు పెట్టాలి. ప్రజలు, రైతులు, యువత అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. కాళేశ్వరం ద్వారా 38లక్షల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి.లక్ష కోట్లు కాని కాళేశ్వరంపై అవినీతి జరిగిందని బురద జల్లారు. మూసీ సుందరీకరణకు లక్షా 50వేల కోట్లు ఖర్చు చేస్తారట. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే పైసలు లేవంటాడు, మూసీకి లక్షా 50వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తారు. ప్రజల తరుపున పోరాటం చేస్తాం అంటే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు.
నామీద కేటీఆర్ మీద బుల్‌డోజర్లు ఎక్కిస్తా అంటున్నడు. చంపుతా అంటున్నాడు. కేసులు పెడతానన్న అరెస్టులు చేస్తామన్నా బయపడేది లేదని స్పష్టం చేశారు. పేదల హామీలు అమలు చేసే దాకా వదిలిపెట్టం నీ వెంట పడుతామని చెప్పారు. ప్రభుత్వం చట్టం ప్రకారం నడుచుకోవాలని, అతిగా ప్రవర్తించే పోలీసులు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని, హరీష్ రావు అన్నారు. మా పోరాటంలో ధర్మం, న్యాయం ఉందని, మళ్లీ కేసీఆర్ పాలన తెచ్చే వరకు అందరం కలిసి పోరాటం చేద్దామని హరీష్ రావు పిలుపుచ్చారు.





