పోలీస్ స్టేషన్ల నిర్వహణకు నిధులివ్వాలి..
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం ఆందోళనకరం..
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : పోలీస్ కానిస్టేబుల్ లకు జరుగుతున్న శ్రమదోపిడీపై నాడు అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వొచ్చాక ఊసరవెల్లిలా మారి శ్రమదోపిడీ విధానాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. టీఎస్ఎస్పీ కానిస్టేబుల్స్ కు 15 రోజులకు ఒకసారి బదులు నెలకు ఒకసారి ఇంటికి వెళ్లేలా లీవ్ మాన్యువల్ మార్చడం దుర్మార్గమని అన్నారు. వారాల పాటు కుటుంబాలకు దూరం చేయడమేనా పోలీసులకు మీరు ఇచ్చిన దసరా, దీపావళి కానుక అని ప్రశ్నించారు. టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లకు నెలకొకసారి లీవు విధానం అమలు చేయకుండా, ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వం సివిల్, ఏఆర్ ఇతర విభాగాల పోలీసులకు 15 రోజుల టీఏ ఇచ్చేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక ఏడు రోజులకు కుదించిందని తెలిపారు.
వారి పొట్టకొట్టకుండా పాత విధానం ప్రకారమే 15 రోజుల టీఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న టీఏ, ఎస్ఎల్, జిపిఎఫ్ లను వెంటనే విడుదల చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల సరెండర్ లీవ్ ఎన్ క్యాష్మెంట్ పెండింగ్ డబ్బులు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే క్లియర్ చేయాని డిమాండ్ చేశారు. సివిల్ పోలీసులు వినియోగించే వాహనాల డీజిల్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. కెసిఆర్ ప్రభుత్వం మండల పోలీసు స్టేషన్ కు రూ.25,000 పట్టణానికి రూ.50,000 హైదరాబాద్లో అయితే రూ.75,000 ఇచ్చేవారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చినప్పటి నుంచి పోలీస్ స్టేషన్ నిర్వాణ కోసం నిధులు విడుదల చేయడం లేదని ఆరోపించారు. దీంతో పోలీసులు, పోలీస్ స్టేషన్ వెళ్లే ఫిర్యాదుదారులపై భారం పడుతోందని తెలిపారు. ఈ నిధుల విడుదల కోసం సీఐలు ప్రభుత్వం వద్ద పైరవీలు చేసే దుస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి పోలీస్ స్టేషన్ల నిర్వహణ కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి..
హై సెక్యూరిటీ ప్రాంతంగా చెప్పుకునే గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరగడం ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని, కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం అయ్యాయని, నేరాల రేటు గణనీయంగా పెరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకి క్షీణిస్తున్నా ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదని, హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఒక్క నాడు కూడా సమీక్ష చేయడం లేదన్నారు. మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగటం ఆందోళనకరమని అన్నారు అత్యాచార బాధితురాలికి భరోసా కల్పించాలని, నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళా భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు.





