మానవ హక్కుల వేదిక డిమాండ్
మావోయిస్టులపై ఏకపక్షంగా కాల్పులు
కరకగూడెం, పినపాక మండలాల్లో నిజనిర్ధారణ కమిటీ సర్వే..
భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం బోడగుట్ట అటవీ ప్రాంతంలో గత నెల 5న తెల్లవారు జామున ఆరుగురు మావోయిస్టులను కాల్చి చంపిన పోలీసు అధికార్లపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. ఆ సంఘటనకు సంబంధించి సిబిఐ తో గానీ, తెలంగాణా రాష్ట్ర పోలీసులతో సంబంధం లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత గానీ నేర పరిశోధన జరిపిందాలని ఒక ప్రకటనలో కోరింది. ముగ్గురు సభ్యులతో కూడిన మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం ఈనెల 13న శనివారం కరకగూడెం, పినపాక మండలాల్లోని గ్రామాలను సందర్శించి స్థానికులతో మాట్లాడింది.
పోలీసులు చెబుతున్నట్లు రెండు వైపులా కాల్పులు జరగలేదని తమ నిర్ధారణలో తేలిందని పేర్కొన్నారు. దట్టమైన అడవిలో తెల్లవారుజామున మావోయిస్టు దళంపై ఏకపక్ష కాల్పులు జరిగినట్టు స్పష్టమైందని వెల్లడించారు. పోలీసులు మావోయిస్టుల మీద హత్యా ప్రయత్నం చేసారన్న నేరం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు కాని అది చట్ట ప్రకారం సరిపోదని, ఆరుగురు వ్యక్తులపై కాల్పుల సంఘటనలో పాల్గొన్న పోలీసులందరిపైనా హత్యా నేరం కింద, ఇంకా ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారు చెబుతున్నట్లుగా పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారా లేదా అన్నది నిర్దారించాల్సింది న్యాయస్థానమని పోలీసులు కాదని స్పష్టం చేశారు.
ఇరు వైపులా కాల్పులు జరిగాయని ఏకపక్షంగా నిర్ధారించేసి కేసును మూసివేస్తే అది చట్టాన్ని, రాజ్యాంగాన్నీ అపహాస్యం చేసినట్లు అవుతుందని తెలిపారు. కాల్పులు జరిగిన ప్రదేశానికి మీడియాని అనుమతించకపోవడంపై మానవ హక్కుల వేదిక సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాలకు మీడియాను వెళ్లనీయకపోవడం గతంలో జరగలేదని, పోలీసులు ఏమి దాయదల్చుకున్నారు? నేరం జరిగిన ప్రదేశంలో ఆధారాలు పాడవకుండా చూసుకుంటే సరిపోతుంది కాని మీడియాను అసలు వెళ్ళనీయక పోవటం ఏమిటి? అని సభ్యులు ప్రశ్నించారు. స్థానిక కోయ జాతి ఆదివాసులు భయబ్రాంతుల్లో బతుకుతున్నారని.. ఇది మరింత ఆందోళన కరమైన విషయమని అన్నారు. నిత్యం పహారా కాస్తున్న పోలీసుల సమక్షంలో స్థానిక ఆదివాసులు నోరుమెదపటానికి కూడా భయపడుతున్నారని తెలిపారు. అంతేకాదు, సెప్టెంబర్ రెండో వారంలో నిజనిర్ధారణ కోసం వెళ్లిన పౌర హక్కుల సంఘం బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారని మానవహక్కుల వేదిక ప్రతినిధులు ఆరోపించారు.