రాజ్య‌స‌భ ఎంపీ ప‌ద‌వికి ఆర్‌ కృష్ణ‌య్య రాజీనామా

వైకాపాకు బిగ్‌ షాక్ ఇచ్చిన బీసీ నేత‌

వైకాపాకు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్‌.కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు సోమ‌వారం అందజేయ‌గా, కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్‌ మంగళవారం ప్రకటించారు. పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే ఆర్‌.కృష్ణయ్య రాజీనామా చేయ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని,  అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు ఆర్‌. కృష్ణయ్య తెలిపారు. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వాలకు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

బీసీ ఉద్యమం బలోపేతానికే రాజీనామా: కృష్ణయ్య

ఇంకా త‌న‌ పదవీ కాలం నాలుగేళ్లు ఉంద‌ని,  అయినప్పటికీ బీసీ ఉద్యమం కోసం త్యాగం చేశాన‌ని ఆర్ .కృష్ణ‌య్య తెలిపారు.  తెలంగాణలో బీసీల ఉద్యమం బలోపేతం చేయాలని కొద్ది నెలలుగా అనేక కార్యక్రమాలు చేపట్టామ‌ని,  బీసీ రిజర్వేషన్‌లు పెంచుతామని కాంగ్రెస్‌ పార్టీ చెప్పింద‌ని, కానీ  9 నెలలు గడిచినా పెంచలేద‌ని, ఇప్పుడు ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంద‌న్నారు.   స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతం పెంచాల‌ని, అలాగే చట్ట సభల్లో కూడా రిజర్వేషన్‌ పెంచాల‌ని డిమాండ్ చేశారు.  రాజకీయాలకు అతీతంగా ఉంటాన‌ని,  బీసీ డిమాండ్లతో ఏ పార్టీ మద్దతు ఇస్తే.. ఆ పార్టీ మద్దతు తీసుకుంటాన‌ని కృష్ణ‌య్య స్ప‌ష్టం చేశారు.

మరోవైపు ఆర్. కృష్ణయ్య గతంలో టీడీపీ నుంచి ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే 2018 ఎన్నికల్లో టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన కృష్ణయ్య.. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే బీసీ నేత కావడం, బీసీ హక్కుల కోసం పోరాడుతూ ఉండటంతో 2022 లో వైఎస్ జగన్.. ఆర్. కృష్ణయ్యకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చారు. అయితే పదవీకాలం మరో నాలుగేళ్లు ఉండగానే ఆయన తన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరోవైపు ఆర్. కృష్ణయ్య తెలంగాణ బీజేపీలో చేరతారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *