– ఆపై అత్యాచారం
– నిందితుడికి బెయిల్ నిరాకరణ
– ఏపీ హైకోర్టులో కీలక కేసు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 19: అన్నం పెట్టిన యజమాని భార్యపై అత్యాచారయత్నం బెడిసికొట్టడంతో ఆమెను హతమార్చి ఆపై మృతదేహంపై లైంగికవాంఛను తీర్చుకున్న (నెక్రోఫిలియా) మృగం వైనమిది. ఈ కిరాతక నిందితుడికి బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఇలాంటి కేసుల్లో నిందితుడికి బెయిల్ మంజూరు చేయబోం.. ఈ ఘోరం గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు.. ఇలాంటి కేసుల్లో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారని చెప్పి బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదు.. ఒకవేళ బెయిల్ ఇచ్చినా అతడు బయటకు వస్తే సమాజానికే చేటు.. అని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ఇటీవల తీర్పు వెలువరించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ఒక వ్యక్తి గత 15 ఏండ్లుగా హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. అందులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన నయాన్ బిస్వాస్ కాంపౌండర్‌గా చేస్తూ యజమాని ఇంట్లోనే నివాసం ఉంటున్నాడు. యజమాని భార్యపై కన్నేసిన బిస్వాస్ 2024 డిసెంబర్ 31న (తెల్లారితే జవవరి 1, 2025) ఆమె నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో తలపై దారుణంగా కొట్టి హతమార్చాడు. ఆమె మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి మృతదేహంపై కామపిశాచి వాంఛను తీర్చుకున్నాడు. హతురాలి భర్త ఫిర్యాదు మేరకు కావలి వన్ టౌన్ పోలీసులు బిస్వాస్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. పోలీసులు చార్జిషీటు దాఖలు చేసినప్పటికీ జైల్లోనే ఉంచారని, తనకు బెయిల్ ఇవ్వాలని అతడు హైకోర్టులో వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టేస్తూ తీర్పు చెప్పారు. ఇలాంటి కేసుల్లో నిందితులకు బెయిల్ ఇస్తే దాని దుష్పప్రభావం సమాజంపై పడుతుందని న్యాయమూర్తి తన తీర్పులో ఆందోళన వ్యక్తం చేశారు.





