ఆధునిక శాస్త్రీయ సాంకేతిక మాయలో, కాలఇంద్రజాలంలో గ్లోబలైజేషన్ రాకతో నేటి ఆధునిక విద్య ఆన్ లైన్,ఆఫ్ లైన్ తో చాలా వేగంగా అడుగులు వేస్తుంది.ఈ నాగరిక సమాజంలో కూడా ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు,మానవ సంబంధాలపై జరుగుతున్న ఆయుధపు దాడుల వంటి అమానవీయ సంఘటనలతో పాటు,మానవతను మరిచి స్వార్థంతో పరుగులెడుతున్న నేటి నవతరంలో శాస్త్రీయత,ఆధ్యాత్మిక, పర్యావరణ, నైతిక విలువలతో కూడిన ప్రాథమిక విద్య చాలా అవసరం.పేద, ధనిక తేడా లేకుండా కేవలం అందరికీ సమాన విద్యావకాశాలు గల అంతర్జాతీయ స్థాయి విద్య ద్వారానే నేటి ఆధునిక సవాళ్ళను,సమస్యలను మనం ఎదుర్కోగలం.అది అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయుల ద్వారానే సాధ్యమవుతుంది.
నేటి మాడ్రన్ డిజిటల్ ఎడ్యుకేషన్‌లో సరైన సదుపాయాలు లేక పాత బోధన పద్ధతులు, ఉపాధ్యాయ ఖాళీల వంటి పలు సమస్యలతో ప్రభుత్వ విద్యాసంస్థలు సతమవుతున్నాయి. ఇక కొన్ని ప్రయివేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చాయి.ఇక ప్రయివేటు బడ్జెట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న బోధన మరియు బోధనేతర సిబ్బంది చాలీచాలని జీతంతో, ర్యాంకులు, మార్కుల పేరిట వెట్టిచాకిరి చేస్తూ శారీరకంగా మానసికంగా క్రుంగిపోతున్నారు. సమాజంలో కూడా నేడు ఉపాధ్యాయ,అధ్యాపకుల గౌరవ స్థాయి అనేది ప్రతిభ, నైపుణ్యం,సేవ పరంగా కాకుండా కేవలం సంపాదన కొలమానం అయ్యింది. ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తూ, మేధావులు, విద్యావేత్తలు ఆలోచించి చర్చించాల్సిన విషయం.ప్రయివేట్ రంగంలో విద్యా బోధన చేయడానికి నేటి యువతరంలో అర్హులైన ఉన్నత విద్యావంతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీనికి కారణాలు అనేకమని చెప్పవచ్చు.ఇది భవిష్యత్తు విద్యారంగానికి ప్రమాదమైన హెచ్చరికగా మనం గుర్తించాలి.
చదువు చెప్పడాన్ని చాలా గొప్పగా భావిస్తూ, తమ సంపాదన కంటే తమ విద్యార్థుల ఎదుగుదలే ముఖ్యం అనుకునే ఉపాధ్యాయ, అధ్యాపకులు నేటి సమాజంలో కూడా ప్రభుత్వం, ప్రయివేట్ అని తేడాలేకుండా ఎంతోమంది మనకు ఆదర్శంగా తారస పడుతున్నారు. తమ సొంత పిల్లల కంటే తమ విద్యార్థుల భవిష్యత్తునే ఎక్కువగా ఆలోచిస్తున్నారు.విభిన్నరంగాల్లోని అలాంటివారిని కాపాడుకోవడం,గౌరవించడం మన బాధ్యత.శ్రీనివాస రామానుజన్,సివిరామన్, వివేకానంద, అబ్దుల్ కలాం, కల్పనా చావ్లా వంటివారు తరగతి గదుల్లోనే నిర్మించబడ్డారు.సావిత్రీ బాయ్ పూలే, జ్యోతిబాపూలే, గాంధీజి, రవీంద్రనాథ్ ఠాగూర్, అంబేద్కర్, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం వంటి ప్రముఖులు విద్య ద్వారానే ఈ సమాజంపై తమ ఆశయాలు నెరవేరుతాయని బలంగా నమ్మారు.
2047 కల్లా అభివృద్ధి భారత నిర్మాణమే మన లక్ష్యం అంటున్న మన ప్రధానమంత్రి మాటలు నిజం కావాలంటే సరైన విద్యా ప్రణాళికే మన మార్గం కావాలి.అమెరికా మాజీ అధ్యక్షుడు తన పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయునికి రాసిన ఉత్తరం సమాజం పట్ల ఉపాధ్యాయుని బాధ్యతను తెలియజేబుతుంది. నేటితరంలోని ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకులుగా, స్ఫూర్తి ప్రదాతలుగా వుంటూనే మంచి స్నేహితులుగా వాళ్ళ మధ్య చిరునవ్వుల వెన్నెలను కురిపించాలి. నూతన సాంకేతికత పోకడలతో వాళ్ళకు చాలా జాగ్రత్తగా జీవితపాఠాలను బోధించాలి.
-ఫిజిక్స్ అరుణ్‌కుమార్





