అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వానలు
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : తీవ్ర అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో ఒడిశాలో తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొంది. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని, తెలంగాణపై దీని ప్రభావం ఇవాళ, రేపు ఎక్కువగా ఉంటుందని ప్రకటించింది. విస్తారంగా వర్షాలతో పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈశాన్య, తూర్పు జిల్లాలైన కరీంనగర్‌, ‌పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం జిల్లాల్లో  శుక్రవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. కుమురంభీం ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌జగిత్యాల, ఖమ్మం, వరంగల్‌, ‌హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
శనివారం ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్‌, ‌కుమురంభీం ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవొచ్చు. నిజామాబాద్‌, ‌జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, ‌జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *