విభజన హామీల అమలులో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు,మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారి కలయిక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ‘విభజన హామీల’ అమలు విషయంలో అన్యాయంగా ఆగమైన తెలంగాణ వైపుగా ధృడమైన వాణిని వినిపిస్తాడని,తెలంగాణ పౌర సమాజం బలంగా విశ్వసిస్తుంది.

సుదీర్ఘ పోరాటాలు,త్యాగాల తర్వాత తెలంగాణ సాధించుకునే క్రమంలో రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం’ మరియు విభజన హామీలు,అనేక లోటు పాటులు,అమలులో అడ్డంకులు ఏర్పడినాయి.ఈ చట్టం వాస్తవ రీతిలో ఉమ్మడి రాష్ట్రం నుండి వేరు చేసినప్పటికీ సీమాంధ్ర రాజకీయ,సామాజిక,ఆధిపత్య శక్తుల ప్రయోజనాలే ధ్యేయంగా చట్టం రూపొందించబడినది.వాస్తవ బాధితుల పక్షాన ఈ చట్టం రూపొందించబడలేదనేది వాస్తవం.రాజ్యాంగ వ్యతిరేకమైన అంశాలు అనేకం చోటుచేసుకున్నాయి.ఈ పదేళ్ల కాల ప్రవాహంలో ఉమ్మడి రాజధాని,ఉమ్మడి గవర్నర్,ఉమ్మడి హైకోర్టు, హైదరాబాదులో సీమాంధ్ర రక్షణ పేరిట ఏర్పడిన వ్యవస్థలు కాలం తీరిపోయినాయి.కాని తెలంగాణకు వ్యతిరేక అంశాలు,విభజన హామీలు ఇరువు రాష్ట్రాల విషయంలో అమలకు నోచుకోకుండా ఇంకా సజీవంగానే ఉన్నవి. ఈ పరిస్థితులలో నూతనంగా తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నూతన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా తొలిసారిగా విభజన హామీల మీద ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చకు కూర్చోవడం ఆహ్వానించదగ్గ విషయం.

కేంద్రంలో అధికారాన్ని చెలాయిస్తున్న ఎన్.డి.ఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు క్రియాశీలకంగా ఉన్నారు. ఈ సందర్భంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారిక హోదా లో కలుసుకుంటున్నారు.ఈ కలయిక ప్రతికూల చర్చకు తావులేకుండా ఈ క్రింది విభజన హమీల అమలు విషయంలో పదేళ్ల విధ్వంసపు పాలన పునరావృతం కాకుండా పరిష్కారం దిశగా చొరవ చూపాలని తెలంగాణ పౌర సమాజం బలంగా ఆకాంక్షిస్తుం‌ది.

కృష్ణా-గోదావరి నదులను స్వాధీనపరుచుకొనేందుకు జులై-15, 2021 వ కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గెజిట్ ను ఉపసంహరించుకునేలా కేంద్రం పై ఒత్తిడి తేవాలి

నీటి పంపకాలలో జరిగిన తీవ్ర వివక్ష తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణమని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడ ఎరుకున్నదే.బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ నీటి పంపిణీలో తెలంగాణ ఆక్షాంక్షలను పూర్తిగా నిరాకరించింది.ఇది ఏ.పి. పునర్వవ్యవస్థీకరణ చట్టం 2014 సాకుతో బేసిన్ భయటి ప్రాజెక్టులకు అన్యాయంగా,రాజ్యాంగ స్పూర్తికి, సహజన్యాయ సూత్రాలకు విరుద్ధంగా, సీమాంధ్ర కోసం కేటాయించబూనింది.ఈ పరిస్థితులలో ఈ రెండు నదులను కేంద్రం ఆక్రమించడం ద్వారా,తెలంగాణ ప్రాజెక్టుల ఆయకట్టు దిక్కులేనిదిగా మారుతుంది.తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేయబడ్డ మహబూబ్ నగర్, నల్లగొండ,రంగారెడ్డి జిల్లాలు తీవ్ర కరువు కోరల్లో చిక్కుకుంటాయి.

హైద్రాబాద్ తో పాటు తెలంగాణ గొంతు ఎండిపోతుంది. తెలంగాణ ప్రజలు తిరిగి వలస కూలీలుగా మారుతారు. వీటి మీద పెట్టబడిన ఖర్చు నిరుపయోగంగా మారుతుంది.అంతకుమించి రాజ్యాంగం ఇచ్చిన ఏఒక్క హామీ తెలంగాణకు దక్కదు. ఇలా నదులను కేంద్రం ఆధీనంలోకి తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు కూడా నష్టదాయకమైనదే.మిగులు జలాలను, నికర జలాలను,అదనపు జలాలను ఎగువ రాష్ట్రాల నుంచి పొందడంలో ఈ గెజిట్ ఇరువు రాష్ట్రాలకు అడ్డు వస్తుంది. రాజ్యాంగం లోని సహకార సమాఖ్య కు ఇది విరుద్ధం.మరియు రాష్ట్రాల హక్కులకు భంగకరం.కావునా ఈ గెజిట్ ని ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి రద్దు చేయించాలి.

అక్రమ నీటి తరలింపుకు అడ్డుకట్ట పడాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అక్రమ పద్దతిలో 670 టి.ఎం.సీల క్రిష్ణా నది జలాలను తరలించుకొని పోయింది. అందుకు నిల్వు చేసుకోవడానికి కావాలిసిన రిజర్వాయర్లను కూడా పూర్తి చేసుకుంది.తాత్కాలిక లెక్క ప్రకారం ఆంధ్రాకు 512 టీఎంసీలు,తెలంగాణ కు 299 టీఎంసీలు వాడుకోవాలిసి ఉండే.కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు 240 టీఎంసీల మించి వాడుకోలేదు. కాని ఈ పదేళ్లలో అటు కేంద్ర ప్రభుత్వంగాని, ఇటు కేసీఆర్ గాని ఆ రిజర్వాయర్ల అక్రమ నిర్మాణాన్ని గాని,అక్రమ నీటి తరలింపులను గాని అడ్డుకోలేదు.పైగా కేసీఆర్ బేసిన్ లు,బేషజాలాలు లేవు అని దుర్మార్గంగా మాట్లాడిండు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీలలో సహజ న్యాయ సూత్రాల ప్రకారం తెలంగాణకు 50 శాతం వాటా దక్కించుకునే దిశగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేయాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అక్రమనీటి తరలింపుకు వ్యతిరేకంగా నిలబడాలి.ఈ విషయంలో ముఖ్యమంత్రులు సంకుచితత్వాన్ని వదలాల్సి ఉంటుంది.

పోలవరం పేరుతో ఆదివాసులను బలిపెట్టడం అన్యాయం. కావునా ఆ ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలుపుకునేలా ఆదివాసులను పరిరక్షించేలా చర్చలు సాగాలి

నెం.19/2014 పేరుతో 17 జులై 2014న బయటకు వచ్చిన 29 మే 2014న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టసవరణ ఆర్డినెన్స్ ని తీసుకవచ్చి పోలవరం ప్రాజెక్టు కొరకు ఏడుమండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనంచేయటం అన్యాయం రాజ్యాంగ అధికరణ-3 ద్వారా చేయవలసిన సరిహద్దుల మార్పులను ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావటం తీవ్ర అన్యాయం ఇది. ప్రకృతిపట్ల,ఆదివాసులపట్ల,తెలంగాణపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రతీకార ధోరణి కి ఇది నిదర్శనం.బిజెపి మొదటి క్యాబినెట్ తీరు కూడా ఇంధుకు నిదర్శనం.

ఇది ఆంధ్రా ప్రాంతీయ, కుల ఆధిపత్య శక్తులకు తెలంగాణను బలిపెట్టేందుకు తీసుకున్న తీవ్రమైనచర్యగా భావిస్తున్నాం.బిజెపి పాలనలో రాజ్యాంగాన్ని తూట్లు పొడిచిన మొట్టమొదటి చట్టం ఇదేనని పౌర సమాజం గుర్తు చేస్తున్నది. ఏడు మండలాలోని మూడు లక్షల మంది తెలంగాణ ప్రాంత ప్రజలను బలిపెట్టి తెలంగాణను ఏర్పాటు చేయడం జరిగింది.ఆ ఏడు మన మండలాలను తిరిగి తెలంగాణ ప్రాంతంలో కలుపుకునే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు చొరవ చూపాలని కోరుకుంటున్నాం. అందుకు చంద్రబాబు నాయుడు కూడా సహకరించాలి.

చట్టం ఆమోదించిన హామీల అమలులో కేంద్రం అనుసరించిన తీరును ఎండగట్టి,నిర్లక్ష్యాన్ని వీడేలా యుద్ధ ప్రాతిపదికన హామీలను అమలు పర్చేలా చర్చించండి

పార్లమెంట్ చట్టం ద్వారా తెలంగాణకు హామిలు ఇచ్చిన 9, 10 షెడ్యూల్ లోని విభజన అంశాలను ఈ పదేళ్ల బిజెపి పాలనలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల పేరుతో కాలయాపన చేశారే తప్ప హామీల అమలు నెరవేర్చటానికి కనీసం ప్రయత్నం కూడా చేయలేదు.ఆ హామీల అమలుకై ఘర్షణలకు తావు లేకుండా పరస్పర సహకారంతో ముందుకు సాగుతూ ప్రజాస్వామిక స్ఫూర్తిని నిలబెడతారని ఇరు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు.

ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కు సహకరించాలి
విభజన హామీలలో భాగంగా ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది కానీ నేటికీ అతిగతి లేదు.ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ కోసం 331 ఎకరాలు కేటాయించినప్పటికీ, తెలంగాణ వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో ఒక్క అడుగు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వేయలేదు.కావునా కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బలమైన వాదనలు వినిపించాల్సిన సహకారాన్ని తీసుకోవాలి.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు చొరవ చూపాలి
పునర్విభజన చట్టంలో భాగంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ని ఏర్పాటు చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.అందుకోసం ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకై గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా తెలంగాణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయని తెలంగాణ పౌర సమాజం ఆకాంక్షించింది.కాని గత పదేళ్లలో కేంద్రం కనీసం అటు వైపుగా అడుగులు కూడా వేయలేదు. పైగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడానికి కావాలసిన తగినంత ఉక్కు అక్కడ లభ్యమయ్యే అవకాశం లేదు అనే సాకుతో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐన జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా తో చెప్పిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఆ ఫ్యాక్టరీ ని ఏర్పాటు చేయకుండా మరొకవైపు ఆదాని అంబానీ కార్పొరేట్ సంస్థలతో ఏర్పాటు చేపిస్తామని పరోక్షంగా వెల్లడిస్తుంది.ఇది తెలంగాణకు జరుగుతున్న అన్యాయం.దీనిపట్ల పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం తన కృషిని అందజేయాల్సి ఉంది.విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి మద్దతు తెలపాలి.

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పై చర్చించాలి
కాజీపేటలో రైల్వే కోచ్, ఏర్పాటు చేస్తామని విభజన హామీలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. 9 ఏళ్లు నానిచిన కేంద్ర ప్రభుత్వం పదవ ఏట రైల్వే కోచింగ్ ఏర్పాటు చేయకుండా, రైల్వే వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి నరేంద్ర మోడీ కాజీపేటలో శంకుస్థాపన చేశారు. అది నేటికి శిలపలాకానికి మాత్రమే పరిమితమై ఉన్నది. ఇక్కడ కూడా తెలంగాణ వివక్షతకు గురైనది. ఈ రైల్వే కోచ్ ఏర్పాటు కోసం ఎన్డీఏలో బాగస్వామి ఐన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తమ సహకారాన్ని అందించాలి.దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ కు చెందాల్సిన విశాఖ రైల్వే జోన్ కోసం కూడా తెలంగాణ ముఖ్యమంత్రి మద్దతు తెలపాలి.

పోలవరం లాగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కు జాతీయ హోదా కై సహకరించాలి
తెలంగాణలో ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని విభజన హామీలలో చెప్పబడింది.ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణలో ఈ దశాబ్ద కాలంలో ఏ ప్రాజెక్టుకు కూడా కేంద్రం జాతీయ హోదాను ప్రకటించలేదు. ఇది తెలంగాణ అభివృద్ధి కి అడ్డుకట్ట వేయడంలో కుట్రలో భాగమేనని తెలంగాణ పౌర సమాజం భావిస్తుంది కావునా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించేలా ఎన్డీఏలో ముఖ్య భూమిక అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చొరవ చూపాలి.

వెనుకబడిన తెలంగాణ జిల్లాల అభివృద్ధి కై రేవంత్ ప్రయత్నించాలి
వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రతి ఏటా 450 కోట్ల రూపాయల చొప్పున నిధులు ఇస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు.కానీ రెండు మూడు ఏళ్లు మాత్రమే ఇచ్చి తదనంతరం నిధులు ఇవ్వకుండా కేంద్రం నిర్లక్ష్యం చేసింది.ఇది తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరు. ఇరువురు ముఖ్యమంత్రులు పరస్పర సహకారంతో నిధులు మంజూరు అయ్యేలా చూడాలి.

ఇరు రాష్ట్రాల ఉద్యోగుల పరస్పర మార్పిడి జరగాలి.
పదేళ్లుగా తెలంగాణ భూమి పుత్రులు ఆంధ్ర ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో భాగంగా అక్కడే ఉండిపోయారు. దశాబ్ద కాలంగా ఆ కుటుంబాలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాయి.వారిని ఇక్కడికి తీసుకొచ్చేలా, అదేవిధంగా తెలంగాణలో ఉన్న ఆంధ్రా ఉద్యోగులను ఆంధ్రకు తరలించే విధంగా చర్చలు కొనసాగాలి. వేగవంతంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి.

వివిధ సంస్థల పంపిణిని పరిష్కరించాలి
2014 నుండి వివిధ సంస్థల పంపిణీ అపరిస్కృతం గానే మిగిలి ఉన్నది. 9వ షెడ్యూల్ లోని 91 సంస్థలు, పదవ షెడ్యూల్ లోని 142 సంస్థలు నేటికి వాటి పంపిణి అసంపూర్ణంగానే ఉన్నది. గత రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు ఏనాడు సీరియస్ గా పరిష్కారానికి ప్రయత్నం చూపలేదు కేంద్ర ప్రభుత్వం సైతం నిర్లక్ష్యం చేసింది. విద్యుత్‌రంగ సమస్యల పరిష్కారానికై ‘నీరజా మాథుర్‌’ అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన కమిటి రిపోర్ట్‌ లో ఇప్పటికి స్పష్టత లేదు.

ఢిల్లీలోని ఏ.పీ భవన్‌ విభజన,స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌,పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వంటి వాటి విభజన అసంపూర్తిగానే ఉంది. ఆస్తుల పంపకాలపైనా గందరగోళం నెలకొని ఉన్నది. కొన్ని సంస్థలలో జాయింట్‌ అకౌంట్ల కింద ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కొన్ని వంధల కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఆ వివాదం అలాగానే ఉన్నది. 2014 నుండి విభజన చట్టంలోని వివిధ నిబంధనల అమలు పురోగతిని అటు కేంద్ర ప్రభుత్వం,ఇటు రెండు రాష్ట్రాల పెద్దలు ఎన్ని సమీక్షలు సమావేశాలు నిర్వహించినప్పటికీ సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి.ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల పెద్దలు పరస్పరం ఆమోదమైన పరిష్కారానికి ప్రయత్నాపూర్వకమైన చర్చలు సాగించాలి.

ఐటిఐఆర్ ప్రాజెక్టు ఇవ్వాల్సిందే
చట్టంలో పేర్కొన్న ప్రకారం తెలంగాణకు రావాలసిన ఐటిఐఆర్ ప్రాజెక్టు ను కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా గుజరాత్ కు తరలించుకొని పోయింది. తిరిగి ఈ ప్రాజెక్టు తెలంగాణకు కేటాయించే విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చొరవ చూపాలి.

సింగరేణిని కాపాడండి
తెలంగాణ ఉద్యమానికి వేగుచుక్క సింగరేణి సింగరేణి లేని తెలంగాణ సిరి సంపదలను గుర్తించలేము.సింగరేణి కోసమే అనేక త్యాగాలను చేసింది తెలంగాణ. కానీ సింగరేణిపై కార్పొరేట్ దృష్టి పడడంతో ఈ బొగ్గు గనులను ప్రైవేటికరించే దిశగా కేంద్రం అడుగులు ప్రారంభమైనవి. ఇప్పటికే సింగరేణి ఉద్యోగాల సంఖ్య సగానికి సగం పడిపోయింది.ఈ పరిస్థితుల్లో కేంద్రం చర్యలు తెలంగాణకు గొడ్డలిపెట్టుగా మారినాయి. ఇదే విషయం అక్కడ విశాఖ ఉక్కు విషయంలోనూ కేజీ బేసిన్ సహజవాయువు హక్కుల విషయంలోనూ ఉన్నది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం చర్యలను ప్రతిఘటించే విధంగా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు గట్టిగా కృషి చేయాల్సి ఉంది.

రాజ్యాంగబద్ద పాలన కొనసాగించాలి
ఇరువురు ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషికి,ఆధిపత్యానికి గురి కాకుండా స్వేచ్ఛగా రాజ్యాంగబద్ధంగా పాలన కొనసాగించాలి.గత ముఖ్యమంత్రుల వలే కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారి ఊపాలాంటి టెర్రరిస్టు చట్టాలను బుద్ధి జీవుల మీద,బలహీనుల మీద ప్రతీకార ధోరణితో అమలు చేసిన తీరును దృష్టిలో పెట్టుకొని ఆ తరహా చట్టాలను నిర్బంధాలను తెలుగు సమాజంలో అక్కడ గాని,ఇక్కడ గాని అమలు చేయకూడదు.అది మాత్రమే ఈ ప్రాంతాల సార్వభౌమాధికారానికి గుర్తింపుగా ఉంటుంది అనేది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గుర్తించాలి. అదేవిధంగా నేడు ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గతంలోని హిందుత్వ ఎజెండాతో రాజకీయాలు నడిపిన చరిత్ర కళ్ళ ముందు ఉంది.

మళ్లి తిరిగి అలాంటి ఎజెండాని పూర్తిగా కార్పొరేటికరించే ప్రజా వ్యతిరేక ఎజెండా కు తిరిగి ఈ ప్రాంతాలలో చోటు ఇవ్వకూడదు.ఇదే జరిగితే తెలంగాణ వందల ఎండ్లుగా సాధించుకున్న వైవిధ్య భరితమైన సంస్కృతి కుప్పకూలుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల సమాజం పతనమైపోతుంది.కావునా మీ ఇరువురు ద్వారా నడుస్తున్న ప్రభుత్వాలు జనజీవన స్రవంతిలోకి రావాలసి ఉంది. మీరు అనుభవిస్తున్న హోదాలు మీకు మీరుగా సాధించుకొని తెచ్చుకున్న పదవులు కావు. నియంతలకు,నిర్బంధాలకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు అనేక త్యాగాలు చేసి సామాజిక పరివర్తనలో జరిగిన మార్పుగా ఈ నూతన ప్రభుత్వాలు వచ్చినాయి.ఈ ప్రజల ఆకాంక్షలను గుర్తు చేసుకుంటూ గడిచిన చరిత్రను ఒక పాఠంగా ఒక అనుభవంగా తీసుకొని ప్రజానుకూలమైన ఈ చర్చలు కొనసాగాలి.ఈ చర్చలలో మీ ఇరువురి వ్యక్తిగత ఎజెండాకు చోటు ఇవ్వకుండా ఇరు రాష్ట్రాల ప్రజల అభిప్రాయాలు ప్రతిబింబించేలా చర్చలు కొనసాగాలి.

సామాజిక ఉద్యమాభివందనాలతో..
పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page