నైపుణ్యత యువత విజయానికి ఆలంబన

(జూలై 15, వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా)

– సుంకవల్లి సత్తిరాజు. – (సామాజిక విశ్లేషకులు,మోటివేషనల్ స్పీకర్) తూ.గో.జిల్లా ఆంధ్రప్రదేశ్

చిత్తశుద్ధితో లక్ష్యాన్ని చేధించగలిగే నైపుణ్యం అలవడితే క్లిష్టమైన కార్యాన్ని సైతం పట్టుదలతో సాధించగలం.అసాధ్యం అనుకున్న పనిని సైతం సుసాధ్యం చేయగల ప్రతిభను “నైపుణ్యం” లేదా నేర్పరితనం అంటారు. ఇలాంటి నేర్పరితనాన్ని వర్తమాన విద్యావ్యవస్థకు అన్వయిస్తే, ఫలితాలు అద్భుతంగా ఉంటాయనడంలో సందేహం లేదు. చదువు లేకపోయినా గతంలో ఏదో విధంగా జీవించే పరిస్థితులుండేవి. ప్రస్తుత పరిస్థితుల్లో చదువు లేకపోతే, బ్రతుకు భారం మోయడం కష్టం. చదువుకు, ఉపాధికి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడిన వర్తమాన పరిస్థితుల నేపథ్యంలో నాణ్యమైన ప్రమాణాలతో విద్యనభ్యసించి, నైపుణ్యాలను కలిగి ఉంటేనే ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థి దశ నుండే నైపుణ్యాలను అలవరచుకోవాలి. ఉపాధికి అవసరమైన పాఠ్యాంశాలను క్రమశిక్షణతో కూడిన ప్రణాళికతో నేర్చుకోవాలి.ప్రతీ నిత్యం విద్యను వినూత్నంగా తీర్చిదిద్దాలి.

వర్తమాన ప్రపంచంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా విద్యారంగంలో మార్పులు తీసుకు రావాలి.నవ ప్రపంచ నిర్మాణంలో యువత పాత్ర కీలకమైనది. ప్రతీ వ్యవస్థ నైపుణ్యతతో కూడుకుని ఉండాలి. యువత మంచి ఉద్యోగాలు సంపాదించడానికి, తాము ఆర్ధికంగా ఎదిగి, మరో పది మందికి ఉద్యోగాలు కల్పించడానికి నాణ్యత గల విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ప్రపంచంలో అపర కుబేరులుగా ఎదిగిన అనేక మంది ప్రముఖులు సాధారణ ఉద్యోగాలు చేస్తూనే, తమలో ఉన్న నైపుణ్యాల ఆధారంగా సి. ఇ. ఓ లు గా రాణిస్తున్న సంగతి విదితమే. దీనికి కారణం వారిలోని నైపుణ్యాలే కాబట్టి, నేటి యువతలో స్కిల్స్ పెంపొందించడానికి ఉత్తమమైన శిక్షణ నివ్వాలి. యువతలో నైపుణ్యాలను పెంచడానికి, యువత ప్రాధాన్యత గుర్తించడానికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రతీ ఏటా జూలై 15 వ తేదీన

“ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం” (వరల్డ్ యూత్ స్కిల్స్ డే) గా జరపాలని ప్రకటించింది. 2014 వ సంవత్సరం నుండి ప్రతీ ఏటా కొనసాగుతున్న “యూత్ స్కిల్స్ డే” యువతలో స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నిస్తున్నది. నాణ్యమైన చదువులు మాత్రమే యువత ఉపాధి అవకాశాలను మెరుగు పరుస్తాయి. విద్యా వ్యవస్థలో ఎప్పటి కప్పుడు సంస్కరణలు చేపడితేనే, నాణ్యమైన చదువులు అందుబాటులోకి వస్తాయి.ప్రచారాల వలన విద్యలో నాణ్యత పెరగదు. నేటి పరిస్థితులకు అనుగుణంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యంత ఉన్నత ప్రమాణాలు గల విద్యను నేటి విద్యార్థులకు నేర్పించాలి. చదువుల్లో నాణ్యత పెరగాలి. విద్యార్ధుల్లో చదువు పట్ల అభిరుచిని పెంపొందించాలి. పుస్తకాల బరువు పెంచడం కాదు, మస్తకాలను నిజమైన జ్ఞానంతో నింపే విద్యా వ్యవస్థకు రూప కల్పన చేయాలి.

విద్యావంతమైన,నైపుణ్యం గల యువత వలన అభివృద్ధి వికసిస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ‘ఎఐ’ చాప క్రింద నీరులా చొచ్చుకు వచ్చింది. కృత్రిమ మేథను అందిపుచ్చుకుని, అందులో ప్రావీణ్యత సంపాదించగలిగితేనే సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు నిలబడతాయి. ఇప్పటికే అనేక టెక్ దిగ్గజ కంపెనీలు కృత్రిమ మేథను ప్రవేశపెట్టాయి. మరి కొద్ది సంవత్సరాల్లో కృత్రిమ మేథ సాంకేతిక రంగాన్ని శాసించబోతున్నది. ఇప్పటికే ఎఐ సాఫ్ట్ వేర్ రంగం పై తన ప్రభావాన్ని,ప్రతాపాన్ని చూపించడం మొదలు పెట్టింది.అమెరికాలోని టెక్ కంపెనీలు భారతీయులను ఉద్యోగాల్లో తీసుకోవద్దని ఇప్పటికే ట్రంప్ హుకుం జారీ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఏఐ వలన ఉద్యోగ భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. గూగూల్,మైక్రోసాఫ్ట్,ఒరాకిల్, టి.సి.ఎస్,ఇన్ఫోసిస్, అమెజాన్ వంటి సంస్థలు వేలాది మందిని ఉద్యోగాల నుండి తొలగించాయి. సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగ భద్రత ప్రశ్నార్ధకమైనది. అయినప్పటికీ యువతలో ఇంకా సాఫ్ట్ వేర్ పట్ల మక్కువ పోకపోవడం వాస్తవాన్ని గ్రహించక చేస్తున్న తీవ్రమైన తప్పిదం. రోబో శకం ప్రారంభమైంది.

మానవ శక్తి స్థానంలో యాంత్రిక శక్తి అత్యంత ఖచ్చితత్వంతో,వేగవంతంగా పనులు చేస్తూ సత్ఫలితాలు సాధించే పరిస్థితులు ఏర్పడ్డాయి. పది మంది చేసే పనిని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో కేవలం ఒక్కరితో సుసాధ్యం చేసే విప్లవాత్మక మార్పులు చోటు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఇంకా గతంలో మాదిరిగా బట్టీ చదువులతో, మార్కుల కోసం కుస్తీ పడడం, ఇందు కోసం లక్షలాది రూపాయలను కిండర్ గార్డెన్ స్థాయి నుండే విద్యార్థులపై వెచ్చించడం సహేతుకం కాదు. ఉన్నతమైన, నాణ్యమైన విద్యా ప్రమాణాలతో, మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలి.వివిధ రంగాల్లో నెలకొన్న సంక్లిష్ట సాంకేతిక సమస్యలను పరిష్కరించడం, అధిక ఖర్చులకు కళ్లెం వేయడం, సమయాన్ని ఆదా చేయడం, ఉత్పాదకత పెంచడం, అలసట ఎరుగని రోబోలతో 24 గంటలు పని చేయించడం కృత్రిమ మేథ వలన సుసాధ్యం కాగలదు.కృత్రిమ మేథ వేగవంతమైన ప్రపంచంలో ఉత్తమమైన సేవలను అందిస్తుంది.ఇలాంటి పరిస్థితుల్లో యువత టెక్నాలజీ లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకుంటూ తాము చేసే వృత్తిలో నైపుణ్యం పెంపొందించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *