
మనిషి పుట్టుకనే కోరికల పుట్ట..ఆర్థిక అసమానతల సమాజంలో కోరికలు ఉండటం సహజం.కోరికలను నెరవేర్చుకోవడానికి,వైయక్తిక నేరాలను నియంత్రించడానికి సాంఘిక కట్టుబాట్లు,సాంప్రదాయాలు,సామాజిక పరివర్తన,విలువలు మరియు రాజ్యాంగం,చట్టాలు ఉన్నవి.అదే పాలకుడు అనే అధికారం తప్పు చేస్తే నిలువరించే అధికారం ఎవరికి లేదు.లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ చెప్పినట్లు “”ప్రభుత్వ శక్తికి ప్రజాశక్తి అనునిత్యమూ అంకుశంగా ఉండి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం అంత సులభం కాదు “‘.అన్ని అంగ బలాలు,శక్తి సంపన్నత కలిగిన ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో, ప్రజాస్వామికంగా పాలించమని నోటితో కోరడం మినహా నొసలుతో ఏమి చేయలేము.అయిదేండ్లకు వచ్చే సార్వత్రిక వోటుతో గద్దె దించాలనుకుంటే ప్రజల క్షేమాన్ని కోరుకునే నాయకులు పోటీలో ఉండటం లేదు.ఒక వేళ పోటీలో ఉన్న డబ్బు, ఈవిఎం మిషన్,పెట్టుబడి ప్రక్రియల సాధనాల ముందు సామాన్యులు వోటుతో గెలవలేక పోతున్నారు.
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 74 ఏండ్ల వయస్సులో 1964 మే 27 న గుండెపోటుతో మరణించారు . చనిపోయిన 62 ఏండ్లకు ప్రధాని నరేంద్ర మోదీ , అతని విశ్వాసాలను ఏకీభవించే వారు నెహ్రూపై అక్కసుతో విమర్శలు చేస్తున్నారు.చివరకు నెహ్రూ మరణానికి వ్యాధిని అంటగడుతున్నారు.భూ ప్రపంచంలో అందరికీ ఇష్టమైన పరిపూర్ణమైన మానవుడు ఉండరంటే అతిశయోక్తి కాదు.వ్యక్తిగా అయితే కుటుంబ సంరక్షణ,బంధు మిత్రులతో,తోటివారితో సఖ్యతగా ఉన్నవారిని సగటు మనిషిగా చూస్తాం.ప్రజాస్వామిక పాలకుడైతే పాలనాదక్షత,మెజారిటీ ప్రజల విద్య,వైద్య,ఉపాధి,వసతి,భద్రత లాంటి మౌళిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేసిన వారిని మంచి పాలకుడిగా గౌరవిస్తాము.కాని నెహ్రూను ,ఆయన వారసులపై మతం,ప్రాంతం,సామాజిక, రాజకీయమైన ఆరోపణలను చేస్తున్నారు.నెహ్రూ కుటుంబ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే దేశభక్తి స్ఫురిస్తుంది.
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14 న జన్మించాడు. మోతీలాల్ నెహ్రూ,స్వరూపరాణి తుస్సు సంతానంగా ఆగర్భ శ్రీమంతుడిగా,అల్లారుముద్దుగా పెరిగాడు.లండన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో బారిస్టర్(న్యాయవాది)పట్టా పొందాడు.కుటుంబ సంపాదనకు ప్రాముఖ్యం ఇవ్వకుండా భారత స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీతో పాల్గొని 1920 నాటికి ప్రగతిశీల నాయకుడిగా ఎదిగాడు.ఉత్తర ప్రదేశ్ కార్యదర్శిగా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఆరోపణలపై డిసెంబర్ 6న జైల్లో పెట్టారు.1921 నుండి 1945 మధ్య ఎనిమిది సార్లు జైల్లో ఉన్న వాటిలో మొదటిది.మొత్తం తొమ్మిది సంవత్సరాలకు పైగా జైల్లో పెట్టారు.కౌలు రైతులకు మద్దతుగా జరిగిన పోరాటానికి నాయకత్వం వహించినందుకు అలహాబాద్ విడిచి వెళ్లవద్దని కోర్టు విధించిన ఆంక్షలను ఉల్లంఘించి 1931 డిసెంబర్ 26 నుండి 1933 అగస్ట్ 30 వరకు జైలులో ఉన్నాడు.
కాని మరల వెంటనే డిసెంబర్ 22 న నిర్బంధంలోకి తీసుకుని అత్యంత ప్రమాదకర వ్యక్తిగా ప్రజా ఉద్యమాలను రెచ్చగొట్టే నాయకుడిగా పరిగణించి 1934 జనవరి 12 న అలహాబాద్ లో అరెస్ట్ చేశారు. అనారోగ్యంతో ఉన్న భార్య కమల నెహ్రూను చూసుకోవడానికి 1934 అగస్ట్ లో 11 రోజులు బెయిల్ ఇచ్చారు.ముందస్తు బెయిల్ కై రాజకీయాల నుండి వైదొలిగాలనే షరతును నెహ్రూ తిరస్కరించాడు.వైద్య చికిత్సకై స్విట్జర్లాండ్ లో లౌసాన్ లో ఉన్న సానిటోరియంకు తరలిస్తుండగా 1936 ఫిబ్రవరి 28 న కమల నెహ్రూ చనిపోయింది. మార్చిలో భారత్ కు తిరిగి వచ్చి కాంగ్రెస్ నాయకత్వంలో ముస్లిం లీగ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. ముస్లింలను ప్రత్యేక దేశంగా పరిగణించలేమని వాదించాడు.నెహ్రూకు ఉన్న సామ్యవాద దృక్పథం వలన ప్రజలలో ఆదరణ పెరిగింది.1937 లో ప్రాంతీయ ఎన్నికలలో “లౌకిక జాతీయ రాజ్యం”అనే భావనను ప్రచారం చేసి అనేక ప్రావిన్సులలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
1942 జులై 14 న వార్దాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది.బ్రిటీష్ వారు భారత్ ను ప్రజలకు అప్పగించాలని తీర్మానించారు.మరల అగస్ట్ 7 న బొంబాయిలో సమావేశమైంది.భారత్ స్వాతంత్య్ర పోరాట కార్యాచరణపై ప్రధానంగా చర్చ జరిగింది.అందులో “గెట్ అవుట్ “అనే సూచనను ,సర్దార్ పటేల్ చేసిన “రిట్రీట్ ఇండియా – విత్ డ్రా ఇండియా”! నినాదాలను కాకుండా సోషలిస్ట్ భావాలు కలిగిన బొంబాయి మేయర్ అయిన “యూసఫ్ మహర్ అలీ” సూచించిన “”క్విట్ ఇండియా ” అనే ఉద్యమ నినాదం ఖరారు అయింది.అగస్ట్ 8న ముంబాయిలోని “గోవాలియ టెంక్ ” మైదానంలో లక్షలాది ప్రజలు పాల్గొన్న సభలో మౌలానా అబుల్ కలాం ఆజాద్,జవహర్ లాల్ నెహ్రూ,సర్దార్ వల్లభాయ్ పటేల్,మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ “కరో యామరో”,సాధించండి”చనిపోండి'”,డూ ఆర్ డై , “క్విట్ ఇండియా “!! నినాదాలతో మారుమోగి క్విట్ ఇండియా ఉద్యమం కొనసాగింది.
“భారతదేశ తొలి ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన వల్లభాయ్ పటేల్ జవహర్ లాల్ నెహ్రూను “స్వేచ్ఛా భారత దేశ అమూల్యమైన ఆస్తిగా కొనియాడాడు.స్వాతంత్య్ర ఉదయానికి ముందు సంధ్యా సమయంలో ఆయన మనకు మార్గదర్శిగా ఉండటం,స్వాతంత్య్రం సాధించిన తరువాత కూడా సంక్షోభాలను ఎదుర్కొన్నప్పుడు మన విశ్వాసానికి రక్షకుడిగా, మన సైనికులకు నాయకుడిగా ఉండటం సముచితమే.ఆయన దేశం కోసం ఎంతగా శ్రమించాడో నాకంటే బాగా మరెవరికి తెలియదని చెప్పాడు..”
మేరుగు రాజయ్య
భారత ప్రజల స్వాతంత్య్ర ఆకాంక్షల తీవ్రతను బ్రిటీష్ వలస పాలకుల ప్రధాని క్లెమెంట్ రిచర్డ్ అట్లీ స్వాతంత్య్రం ఇవ్వడానికి ముందుకు వచ్చాడు.అందుకు లూయిస్ మౌంట్ బాటెన్ 1947 మార్చి 22 న భారత్ కు పంపించాడు.జవహర్ లాల్ నెహ్రు,వల్లభాయ్ పటేల్,ఆచార్య కృపాలనీ కాంగ్రెస్ పార్టీ ప్రతి నిధులుగా,మహమ్మద్ అలీ జిన్నా,లియాఖత్ అలీఖాన్,అబ్దుల్ రబ్ నిస్తార్ ముస్లిం లీగ్,సిక్కుల ప్రతినిధిగా సర్దార్ బల్దేవ్ సింగ్ తో ఏర్పడిన కమిటీతో లార్డ్ మౌంట్ బాటెన్ చర్చలు జరిపాడు.కాంగ్రెస్ పార్టీ, ముస్లీం లీగ్ పార్టీల మధ్య ఉన్న విభేదాలు సమీప భవిష్యత్తులో పరిష్కారం కావని గ్రహించాడు.దానికి దేశ విభజననే అనువైన మార్గమని 1947 జూన్ 3 న ప్రకటించాడు.దానితో బ్రిటన్ పార్లమెంటు కూడా జూలై 18 న “1947 భారత దేశ స్వాతంత్య్ర చట్టాన్ని” ఆమోదించింది.అగస్ట్ 15 న స్వాతంత్య్రం ఇవ్వడానికి కూడా నిర్ణయమైంది.భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దులను నిర్ణయించడానికి “సరి హద్దు కమిషన్ అధ్యక్షుడిగా “సర్ సిరిల్ రాడ్ క్లిప్” బ్రిటీష్ లాయర్ వచ్చి మ్యాప్ ఆధారంగా గీశాడు.1947 అగస్ట్ 15 నాటి అర్ధ రాత్రి భారత దేశం స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంది.అధికార బదిలీ వేడుకల్లో బ్రిటీష్ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ దిల్లీలో ఉంటారనే ఉద్దేశ్యంతో పాకిస్తాన్ 1947 అగస్ట్ 14 ననే స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంది. 1757 జూన్ 23 న బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్ దౌలాకు మరియు రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ మధ్య ప్లాసీలో జరిగిన యుద్ధంలో బ్రిటీష్ నెగ్గడంతో భారత్ లో బ్రిటీష్ పాలనకు నాంది పలికింది.
దాదాపు 190 సంవత్సరాల పాలన అంతమై 1947 అగస్ట్ 15 న డొమినియన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి తొలి ప్రధానిగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ,ఉప ప్రధానిగా వల్లభాయ్ పటేల్ బాధ్యతలు తీసుకున్నారు. నెహ్రూ గుండెపోటుతో మరణించిన 1964 మే 27 నాటికి 16 సంవత్సరాల 286 రోజులు ప్రధాన మంత్రిగా ఉన్నారు.తన 200 కోట్ల ఆస్తిలో 98 శాతం రూ.196 కోట్లను దేశ అభివృద్ధికి విరాళంగా ఇచ్చాడు.1947 నవంబర్ 26 న ఆర్థిక మంత్రి ఆర్.కె షణ్ముఖం చెట్టి మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టాడు.అందులో బడ్జెట్ మొత్తం వ్యయం రూ.197.29 కోట్లు,అంచనా రాబడి రూ.171.15 కోట్లు.ద్రవ్యలోటు రూ.26 కోట్లు.ఏడున్నర నెలల కాలం పరివర్తన బడ్జెట్ లో దాదాపు 47 శాతం రక్షణ వ్యయానికి కేటాయించారు.1947 లో 300 లోపు పెద్ద నీటి ఆనకట్టలు ఉన్నవి.2000 సంవత్సరం నాటికి 4,000 పైగా ఆనకట్టలు నిర్మించగా ఇప్పుడు 5,300 లకు పైగా ఉన్నవి.1971 నుండి 1989 మధ్య కాలంలో సగానికి పైగా ఆనకట్టల నిర్మాణం జరిగింది.అత్యధిక ఆనకట్టలు కలిగిన దేశాలలో భారత్ మూడవ స్థానంలో ఉంది.1951–2000 మధ్య ఆహార ధాన్యాల ఉత్పత్తి 51 మిలియన్ టన్నుల నుండి 200 మిలియన్ టన్నులకు పెరిగి ఆహార ధాన్యాల దిగుమతి బంద్ అయింది.దానితో విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది.
నాటి విద్యార్జనలో 20 విశ్వవిద్యాలయాలు,496 కళాశాలలు,2,41,369 మంది విద్యార్థులు ఉన్నారు.నేడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో 1,338 విశ్వ విద్యాలయాలు,53,000 కు పైగా అనుబంధ కళాశాలలు ఉన్నవి.ఇంకా జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఐఐటీలు,ఎయిమ్స్, ఐఐఎంలు, ఎన్ ఐటీలతో సహా 159 విద్య సంస్థలు ఉన్నవి.1947 లో సుమారుగా 7,400 హాస్పిటల్స్ , 1,13,000 పడకలు ఉన్నవి.ఇది ప్రతి 1,000 జనాభాకు సుమారు 0.24 శాతం ప్రతిబింబిస్తుంది. వైద్య సిబ్బంది 47,000,వైద్యులు 7,000 మంది,19 వైద్య పాఠశాలలు,28 వైద్య కళాశాలలు ఉన్నవి. ఇప్పుడు 818 ప్రభుత్వ వైద్య కళాశాలలు,గుర్తింపు,అనుమతి పొందిన వైద్య కళాశాలలు 1,28,000 పైగా అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ లను అందిస్తున్నవి. 70,000 పైగా ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ ఉన్నవి. అప్పుడు బ్రిటీష్ వారి నుండి వారసత్వంగా పొందిన ఆయుధ కర్మాగారాలు 18 ఉండగా,నమోదిత 14,500 కర్మాగారాల్లో సుమారుగా 22 లక్షల మంది పనిచేశారు.ఇప్పుడు 2,00,000 నమోదిత కర్మాగారాల్లో 6.34 కోట్ల మంది పని చేస్తున్నారు. పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలో జీడీపీకి సుమారు $ 888 బిలియన్లతో 25 శాతం వాటాను అందిస్తుంది. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆధునిక శాస్త్రీయ దృక్పథం కలిగిన రాజనీతిజ్ఞుడు.సామ్యవాద విధానాలపై ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ కొత్తగా స్వాతంత్య్రం పొంది అభివృద్ధి చెందవలసిన దేశానికి ప్రైవేటు మూలధనం,వ్యాపార ఆవిష్కరణలు మరియు ప్రైవేటు రంగం వ్యవస్థాపక శక్తి అవసరమని అలాగే సంపదను వికేంద్రీకరించడం ద్వారా సామాజిక అభివృద్ధి జరుగుతుందని,సమర్ధవంతంగా వనరుల కేటాయింపు మరియు ఉపయోగించుకోవడంతోపాటుగా ప్రణాళిక కొరతలను నివారించుచూ, మార్కెట్ హెచ్చు తగ్గులను తగ్గించుకుని ఉత్పాదకతకు తోడ్పడే “మిశ్రమ ఆర్థిక వ్యవస్థను” అవలంబింప చేశాడు.
ప్రణాళిక సంఘం ద్వారా ఆర్థిక ప్రణాళికలు,పంచవర్ష ప్రణాళికలు రూపొందించుకోవడం మరియు ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల విభజన ప్రక్రియలతో అభివృద్ధికి కృషి చేశాడు. బిజెపి ప్రభుత్వం వల్లభాయ్ పటేల్ ను పాలనాధ్యక్షుడిగా,మార్గదర్శకుడిగా ఆదరిస్తుంది. అందుకు అభిమానంగా గుజరాత్, నర్మదా నదీ తీరంలో ప్రపంచంలోనే ఎత్తైన 182 మీటర్లతో ,రూ.3,000 కోట్లతో స్టాచ్యు ఆఫ్ యూనిటీకి ప్రతీకగా వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించారు. భారతదేశ తొలి ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన వల్లభాయ్ పటేల్ జవహర్ లాల్ నెహ్రూను “స్వేచ్ఛా భారత దేశ అమూల్యమైన ఆస్తిగా కొనియాడాడు.స్వాతంత్య్ర ఉదయానికి ముందు సంధ్యా సమయంలో ఆయన మనకు మార్గదర్శిగా ఉండటం,స్వాతంత్య్రం సాధించిన తరువాత కూడా సంక్షోభాలను ఎదుర్కొన్నప్పుడు మన విశ్వాసానికి రక్షకుడిగా, మన సైనికులకు నాయకుడిగా ఉండటం సముచితమే.
ఆయన దేశం కోసం ఎంతగా శ్రమించాడో నాకంటే బాగా మరెవరికి తెలియదని చెప్పాడు. బీజేపీ ప్రధాన పార్టీగా ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా 12 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2026 మే 26 కేంద్ర కేబినెట్ సమావేశమై పండిట్ జవహర్ లాల్ నెహ్రూ రికార్డ్ ను అధిగమించామని పేర్కొన్నారు.పార్లమెంటులో, ప్రెస్ లో నెహ్రూపై అక్కసుతో మాట్లాడటం పరిపాటైంది.దానికి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ పార్లమెంటులో నెహ్రూపై చర్చ పెట్టీ ఆరోపణలకు,అక్కసులకు ముగింపు పలకాలని కోరింది.బిజెపి ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థిగా ఇప్పుడు మనుగడలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానాలను పరిగణనలోకి తీసుకోవాలి. కాని 62 ఏండ్ల కింద చనిపోయిన నెహ్రూపై అక్కసు చెందడం రాజకీయ పరిణతికి విరుద్ధం.ప్రజల విశ్వాసాలకు,అభిప్రాయాలకు అనుగుణంగా చట్ట సభలలో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలి.ప్రజలకు ఉపాధిని, శ్రమకు తగ్గట్టుగా ప్రతిఫలాలను, విద్య, వైద్యం,గృహ వసతి, భద్రత, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, స్వాతంత్య్రం కల్పించే విషయంలో పాలక,ప్రతిపక్షాలు వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.


మేరుగు రాజయ్య


