యుద్ధ మేఘాలు… ఎగుమతులకు సవాళ్లు

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ స్థిరత్వాన్ని పూర్తిగా అందుకోలేదు. కోవిడ్ అనంతర సంక్షోభాలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న రక్షణాత్మక వాణిజ్య విధానాలు, అమెరికా సుంకాల అనిశ్చితి వంటి పరిణామాలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఇప్పుడు పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతుండటం భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఆందోళనగా మారింది. ముఖ్యంగా ఎగుమతులపై ఆధారపడిన రంగాలకు ఇది హెచ్చరికగా పరిగణించాల్సిన పరిస్థితి.

జూన్ నెల వాణిజ్య గణాంకాలు ఈ ఆందోళనను బలపరుస్తున్నాయి. మే నెలలో 45.2 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఎగుమతులు జూన్‌లో 40.4 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దిగుమతులు కూడా 73.4 బిలియన్ డాలర్ల నుంచి 70.8 బిలియన్ డాలర్లకు తగ్గినప్పటికీ, తగ్గుదల ఎగుమతులతో పోలిస్తే తక్కువగా ఉండటంతో వస్తు వాణిజ్య లోటు 28.2 బిలియన్ డాలర్ల నుంచి 30.4 బిలియన్ డాలర్లకు పెరిగింది. సేవల ఎగుమతుల ద్వారా 15.1 బిలియన్ డాలర్ల మిగులు నమోదైనా, అది వస్తు వాణిజ్య లోటును పూర్తిగా పూడ్చలేకపోయింది.

ఈ పరిస్థితికి ప్రధాన కారణాల్లో ప్రపంచ మార్కెట్లలో డిమాండ్ మందగించడం ఒకటి. అమెరికా సహా పలు దేశాలు దిగుమతులపై అధిక సుంకాలు విధించే దిశగా అడుగులు వేస్తుండటంతో అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితి నెలకొంది. భారతీయ వస్త్రాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, రసాయనాలు, రత్నాభరణాలు వంటి ఎగుమతి రంగాలు దీనివల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

అంతకంటే పెద్ద ప్రమాదం పశ్చిమాసియా పరిస్థితి. ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ యుద్ధానికి దారితీస్తే హోర్ముజ్ జలసంధి గుండా జరిగే సముద్ర రవాణా దెబ్బతినే అవకాశం ఉంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే ముడి చమురు ధరలు పెరగడం ఖాయం. ఫలితంగా భారత దిగుమతి వ్యయం పెరగడమే కాకుండా రవాణా ఖర్చులు, బీమా ప్రీమియాలు కూడా అధికమవుతాయి. ఇది ఎగుమతుల పోటీతత్వాన్ని మరింత బలహీనపరుస్తుంది.

భారత్‌కు సేవల ఎగుమతులు ఇప్పటికీ ప్రధాన బలంగా ఉన్నాయి. సమాచార సాంకేతిక సేవలు, వ్యాపార సేవలు, ఆర్థిక సేవల ద్వారా విదేశీ మారకద్రవ్యం సమకూరుతున్నా, కేవలం ఈ రంగంపైనే ఆధారపడటం సరైన వ్యూహం కాదు. తయారీ రంగం, సూక్ష్మ–చిన్న–మధ్య తరహా పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత ఎగుమతులు మరింత బలోపేతం కావాలి. కొత్త మార్కెట్ల అన్వేషణ, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల సద్వినియోగం, ఎగుమతిదారులకు తక్కువ వ్యయంతో రుణాలు, లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించడం వంటి చర్యలు అత్యవసరం.

ప్రపంచ రాజకీయ పరిణామాలను ఏ దేశమూ నియంత్రించలేడు. కానీ వాటి ప్రభావాన్ని తగ్గించే సామర్థ్యాన్ని మాత్రం పెంచుకోవొచ్చు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ముందున్న సవాలు అదే. యుద్ధ మేఘాలు మరింత కమ్ముకునేలోపు ఎగుమతుల స్థిరత్వాన్ని కాపాడే విధానాలు అమలు చేయగలిగితేనే ప్రపంచ అనిశ్చితి మధ్య భారత వృద్ధి గమనం నిలకడగా కొనసాగుతుంది.

-ప్రజాతంత్ర డెస్క్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *