పాలకవర్గాలు చేస్తున్న అసత్య ప్రచారాలకు ఖండన
లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్‌జోనల్ బ్యూరో సమత
గత నాలుగు రోజులుగా మావోయిస్టు అగ్రనేత సుజాతను అరెస్టు చేసినట్లుగా వస్తున్న వార్తలను మావోయిస్టు పార్టీ బూటకం అని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన లేఖను దక్షిణ సబ్‌జోనల్ బ్యూరో సమత శనివారం విడుదల చేశారు. పార్టీలపై దుష్ప్రచారం , అబద్దాలు, వక్రీకరణాలు ప్రచారం చేస్తున్నారని, ఇందులో భాగంగానే ప్రజలలో మానసిక దాడులు , భయాందోళనలు సృష్టించడానికి సుజాత అరెస్ట్ అయినట్లు బూటకపు ప్రచారం చేశారని లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి కేంద్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బిజెపి, తెలంగాణలో కాంగ్రెస్ ఒక్కటై ఆపరేషన్ కగార్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నాయకత్వంలో 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం జరిపి 2026 మార్చి వరకు మావోయిస్టులను నామరూపాలు లేకుండా చేస్తామని డేట్ ప్రకటించుకున్నారని లేఖలో తెలిపారు. అందుకుగాను ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటున్న వారిపై , పార్టీలపై దుష్ప్రచారం చేస్తున్నారని లేఖలో అన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బిజెపి ప్రభుత్వంతో కుమ్మక్కై కార్పొరేట్ ప్రయోజనాలకు కొమ్ముకాస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఛత్తీస్‌గఢ్ లో కార్పొరేటర్ల కోసమే పనిచేస్తున్నామని బాహాటంగా చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌సాయి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
బస్తర్‌లో వనరులను కొల్లగొట్టడానికి క్యాంపులు పెట్టి ఆదివాసీ ప్రజలపై దాడులకు పాల్పడుతూ వారిని అడవుల నుంచి తరిమివేయాలని అనుకుంటున్నారని అన్నారు. నేషనల్ పార్క్ ప్రాంతంలో పులుల పెంపకం పేరుతో టైగర్ జోన్ నిర్మాణం చేపట్టి ముందు 22 గ్రామాలను తరువాత 56 గ్రామాల ప్రజలను ఖాలీ చేయిస్తున్నారని లేఖలో తెలిపారు. జనవరి 1 నాడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ముదివెండిలో ఆరునెలల చిన్నారి హత్యతో మొదలై నేటి వరుస ఘటనలు 10 రోజులకు ఒక ఊచకోత హత్యాకాండ సృష్టిస్తున్నారని లేఖలో తెలిపారు. ఆదివాసీ ప్రజలు తమ సంప్రదాయం ప్రకారం అడవుల్లోకి జీవనం కోసం అడవి మృగాల బారిన పడకుండా ఆత్మరక్షణ కోసం సాయుధంగా వ్యవహరిస్తుంటారని తెలిపారు. కానీ కగార్ ప్రారంభమైన దగ్గర నుంచి అడవులలో వారి సంసారంపై అప్రకటిత నిషేధం అమలవుతోందని లేఖలో పేర్కొన్నారు. దేశ ప్రజలు ప్రభుత్వ కార్పొరేటీకరణకు సైనికులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని ప్రజలు తమ న్యాయమైన పోరాటాలతో పాసిస్టు కగార్‌లను నడిపిన ఎంతటి ఊచకోతలకు పూనుకున్న చివరకు పాసిస్టులు ఎవరికైనా ఇలాంటి గతే పడుతందని ప్రజలే విజయం సాధిస్తారనే చరిత్ర మరోసారి రుజువు అవుతుందని లేఖలో తెలిపారు. దండకారణ్య ఆదివాసీ పీడిత ప్రజలపై కొనసాగుతున్న నిర్ధాక్షణమైన కార్పొరేట్ కగార్ సైనిక దాడులను ఊచకోతలను ఖండించాలని ప్రజా యుద్దాన్ని కాపాడుకోవాలని దండకారణ్య శాంతిని నెలకొల్పాలని లేఖలో పేర్కొన్నారు.