విమానయాన పటంలో మరోమారు ‘మామునూరు’

పునరుద్ధ్దరించే ఎయిర్‌పోర్టు క్రెడిట్‌ ‌కోసం రాజకీయ కుమ్ములాట
విమానాల రాకతో వరంగల్‌ ‌దశాదిశ మారనుందా ?

( మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర,  ప్రత్యేక ప్రతినిధి )

వాయు యాన చిత్రపటంలో ‘మామునూరు’ ఎయిర్‌పోర్టుకు మరోసారి చోటు లభిం చింది. ఈ విమానాశ్రయ పునరుద్దరణను అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో దశాబ్దాలుగా విమానయాన చిత్రపటంలో మరుగునపడిన మామునూరుకు తిరిగి చోటు దక్కినట్ల యింది. సుమారు అర్ధ శతాబ్ధం క్రితం వరకు పౌరులకు సేవలందించిన ఈ విమనాశ్రయం గత నలభై నాలుగేళ్ళుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. దశాబ్దాలుగా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు మారినా ఇక్కడ విమానా శ్రయాన్ని పునరిద్దరించేందుకు ఒక్క అడుగు కూడా పడలేదు. ఒకనాడు ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాకు ఈ ఎయిర్‌ ‌స్ట్రిప్‌ ‌తలమానికగా నిలిచింది. స్వాతంత్య్రానికి పూర్వం హైదరాబాద్‌ ‌స్టేట్‌ను పాలించిన ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1930‌లో దీన్ని ఏర్పాటుచేశారు.

మామునూరు విమానా శ్రయంతోపాటు నిజాం నిర్మించిన ఆజం జాహి టెక్స్‌టైల్‌ ‌మిల్‌ ఇక్కడ మకుటా యమానంగా నిలిచాయి. ఆనాడు సిర్పూర్‌ ‌కాగజ్‌నగర్‌లో (1932) ఏర్పాటు చేసిన పేపర్‌మిల్లుతో పాటు, ఆజంజాహి పేపర్‌ ‌మిల్లులకు అనుసంధానంగా ఈ విమానా శ్రయాన్ని నాటి నిజాం వినియోగించారు. అంతేకాదు అత్యవసర సమయంలో దేశ భద్రత (హైదారాబాద్‌ ‌స్టేట్‌) ‌కోసం మిలటరీని తరలించేందుకు నిజాంకు ఉప యోగపడిందీ మామునూరు విమాశ్రయం. నిజాం విమానాల మీద భారత యూనియన్‌ ‌మిలటరీ బాంబుల వర్షం కురిపించినప్పుడు ఈ విమానశ్రయంలో పెద్ద గోతులు పడినట్లు స్థానికుల కథనం. ఎంత లోతులో గుంతలు పడ్డాయంటే బావిలో నీరు ఊరినట్లుగా నీరుపైకి ఉబికి వొచ్చిన విధానాన్ని ప్రత్యక్షసాక్షి 95 ఏళ్ళ బొల్లికుంట గ్రామ మాజీ సర్పంచ్‌ ‌గొంతి రామిరెడ్డి తెలిపారు.

అగ్రనేతలందరూ వినియోగించుకున్నవారే..
నిజాం లొంగుబాటు తర్వాత భారత ప్రభుత్వం దీనిపై పెద్దగా శ్రద్ద పెట్టలేదు. 1964 వరకు రాష్ట్రపతులు బాబూ రాజేంద్రప్రసాద్‌, ‌సర్వేపల్లి రాధాకృష్ణ, జాకీర్‌ ‌హూసేన్‌ ‌తోపాటు ప్రధానులు జవహర్‌లాల్‌ ‌నెహ్రూ, ఇందిరా గాంధీ తమ పర్యటనలో భాగంగా ఈ విమనా శ్రయాన్ని వినియోగి ంచుకున్నారు. కాగా ఇందిరాగాంధీ దారుణంగా హత్యగా వించబడినప్పుడు వంగరలోని తన స్వంత ఇంట్లో  విశ్రాంతి తీసుకుంటున్న దివంగత భారత ప్రధాని పివీ నరసింహారావును ఆనాడు ఆగమేఘాలమీద దిల్లీకి రప్పిం చుకునే వొచ్చిన  ప్రత్యేక విమానం మాము నూరు విమానాశ్రయాన్ని వినియోగిం చుకుంది.

ఆ తర్వాత చాలాకాలం ఇక్కడ విమానరాకపోకలు లేకపోవడంతో కొంతకాలం ఫుడ్‌ ‌కార్పొరేషన్‌ ‌ధాన్యం నిల్వలకు ఈ ఎరోడ్రమ్‌ను వాడుకుంది. మరి కొంతకాలం ఎన్‌సిసి క్యాడెట్స్ ‌హెలికాఫ్‌టర్‌ ‌ట్రైనింగ్‌కు వాడుకున్నారు. కాగా, దీని పునరుద్దరణకోసం స్థానిక ప్రజలు అనేక సంవత్సరాలుగా చేస్తున్న  విజ్ఞప్తుల మేరకు 1980లో వాయుధూత్‌ ‌సర్వీసులను ప్రవేశపెట్టారు. 18 సీట్లు గల ఈ సర్వీసును హైదరాబాద్‌, ‌రామగుండం మీదుగా నడిపారు. కానీ ప్రయాణికుల రాకపోకలు అంతంత మాత్రంగానే ఉండడంతో దాన్ని నిలిపివేశారు. దీంతో విమానయాన చిత్రపటంలో మామునూరు కనుమరుగైపోయింది. స్వాతంత్య్రానికి పూర్వం ఆసియాలోనే అత్యంత పెద్ద విమానాశ్రయంగా మామునూరుకు పేరుంది. ఇక్కడ రెండు రన్‌వేలుండడం విశేషం.


కనుమరుగైన ఆశలకు మళ్లీ జీవం
మామునూరు ఎయిర్‌పోర్ట్ ‌నుపునరుద్దరించాలన్న స్థానిక ప్రజల ఆకాంక్ష దాదాపు 50 ఏళ్ల తర్వాత నెరవేరబోతున్నందుకు కేవలం ఓరుగల్లు ప్రజలేకాదు, యావత్‌ ‌తెలంగాణ సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నది. ఎందుకంటే తెలంగాణలో హైదారాబాద్‌ ‌తర్వాత రాజకీయంగా, సాంస్కృతిక పరంగా చైతన్యవంతమైన ప్రాంతంగా ఉమ్మడి వరంగల్‌కు పేరుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌తర్వాత రెండో రాజధానిగా దీన్ని తీర్చిదిద్దాలన్న ఆలోచన ఉంది. ఆ నాడు ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించిన ఆజంజాహి మిల్లు నేడు లేకపోయినప్పటికీ, ఆ లోటును భర్తీ చేసే విధంగా కేంద్ర సహకారంతో 1990 లోనే ఇక్కడ మెగా టెక్స్‌టైల్‌ ‌పార్కు ప్రారంభమైంది. ఇంకా ఇది పురోగతిలోనేఉన్నప్పటికీ , మొదటి నుంచి వరంగల్‌ ‌హెరిటేజ్‌ ‌సిటీగా ప్రాధాన్యతను సంతరించుకుంది. చారిత్రక ప్రసిద్ధి పొందిన రామప్ప ఇప్పటికే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. అందుకేమీ తీసిపోని వెయ్యి స్తంభాల రుద్రేశ్వరాలయం ఉంది. త్వరలో మెట్రో కూడా రానుంది. రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఆశలుకూడా చిగురిస్తున్నాయి.

అండర్‌‌గ్రౌండ్‌ ‌డ్రేనేజీ, ఇన్నర్‌- ఔటర్‌ ‌రింగ్‌రోడ్డతో వరంగల్‌ ‌నగరం విస్తృతం కానుంది. ఇలాంటి దశలో విమానాల పునరుద్దరణ జరిగితే వరంగల్‌ ‌రూపురేఖలే మారిపోనున్నాయి. హైదరాబాద్‌ ‌తర్వాత ఐటి కంపెనీలు ఒక్కొక్కటే ఇప్పుడిప్పుడే వరంగల్‌ ‌వైపు చూస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంకూడా వరంగల్‌లో ఐటి కంపెనీలకు తగిన ప్రోత్సహాన్ని అందించే ప్రణాళికలను సిద్దంచేసింది. ఇలాంటి పరిస్థితిలో మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్దరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఓరుగల్లు పజల్లో హర్షాతిరేకలు వెల్లువెత్తాయి. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజారపు రాంమోహన్‌నాయుడు ఆదివారం (ఫిబ్రవరి 2న) విమానాశ్రయాన్ని పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించారు. రెండున్నర సంవత్సరాల్లో ఈ ఎయిర్‌పోర్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా ఎయిర్‌పోర్టు అథార్టి ఆఫ్‌ ఇం‌డియాను ఆదేశించారు. అయితే ఇందుకు సంబందించి ఇంకా 253 ఎకరాల స్థలాన్ని సేకరించాల్సిఉంది. భూ సేకరణకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే  205కోట్ల రూపాయలను మంజూరుకూడా చేశారు. అయితే భూ యాజమాన్యం పెడుతున్న షరతుల దృష్ణ్యా భూ సేకరణలోజాప్యం జరుగుతున్నది.

కేంద్రంనుండి అనుమతి వచ్చిన దృష్ట్యా భూ సేకరణ కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తిచేయాల్సిందిగా సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌లోగా మొదటివిడుత పనులు పూర్తి కావాలని ఆయన వారికి సూచించారుకూడా.  రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌తర్వాత అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా మామునూరు అభివృద్ధి చెందనుంది. తెలంగాణలో అభివృద్దిలోకి రానున్న రెండవ ఎయిర్‌పోర్టుకూడా ఇదే కావడం విశేషం. రాజధానిలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణ క్రమంలో జిఎంఆర్‌ 150 ‌కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్‌పోర్టును నిర్మించరాదని ఒప్పందం చేసుకుంది. అందుకు నాటి కేంద్ర  ప్రభుత్వం అంగీకరించింది.

దాంతో తెలంగాణలో మరో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవకాశం లేకుండా పోయింది. తెలంగాణ నుంచి విడిపోయిన ఏపికి ఆరు వరకు విమానాశ్రయాలుండగా తెలంగాణకు ఒక్కటి మాత్రమే ఉండడం అసౌకర్యంగా మారింది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం పలుసార్లు జిఎంఆర్‌ ‌సంస్థతో, కేంద్రంతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఆ నిబంధనను తొలగించారు. దేశ వ్యాప్తంగా ఉడాన్‌ ‌పథకం కింద పలు రాష్ట్రాల్లో విమానాశ్రయాల ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న దరిమిలా, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో ఆరు విమానాశ్రయాలకు అనుమతివ్వాలని కోరింది. దీనిపై అధ్యయనం చేసిన ఏఏఐ అన్ని హంగులున్న మామునూరును ముందస్తుగా ఎంపిక చేసుకుంది. అయితే 696 ఎకరాలున్న ఈ విమానాశ్రయానికి మరో 253 ఎకరాలు కావాల్సి ఉండగా, రాష్ట్రఅధికారులు అంతమేర భూమిని సేకరించేపనిలో ఉన్నారు. మొత్తం మీద 95 ఏళ్ల కింద మారుమూల ప్రాంతమైన మామునూరులో నెలకొల్పిన ఈ విమానాశ్రయం శతాబ్దకాలం తర్వాత కొత్త హంగులను సమకూర్చుకోబోతున్నది.

క్రెడిట్‌ ‌కోసం పాకులాట
విమానాశ్రయ పునరుద్ధరణకు మేమంటే మేమే కారణమని స్థానిక రాజకీయ పార్టీలు ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. విమానాశ్రయ పునరుద్దరణకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇవ్వడంతో స్థానిక బిజెపి నాయకులు మామునూరు ఎయిర్‌పోర్టు వద్ద ప్రధాని నరేంద్రమోదీ ప్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తుండగా, ఎయిర్‌పోర్టు రావడంలో తమ కృషి ఉందని స్థానిక కాంగ్రెస్‌ ‌నేతలు సిఎం రేవంత్‌రెడ్డి ఫ్లెక్సీకి అక్కడే పాలాభిషేకం చేయడం వివాదానికి దారితీయడంతో పోలీసులు జోక్యంచేసుకోవాల్సి వొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page