ఎవరి త్యాగం? ఎవరి భోగం?

‘మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె’ అనే సామెత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అక్షరాలా సరిపోయేట్టుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, అంటే 30 నెలలుగా చెల్లించకుండా మురగబెడుతున్న బకాయిలు, చిన్న చిన్న లక్షల రూపాయల బకాయిలు కూడా, ఎన్నో ఉన్నాయి. అత్యవసరంగా పెట్టవలసిన ఖర్చులను కూడా దాటవేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. రెండున్నర సంవత్సరాలుగాగా రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ప్రయాణాల కోసం అద్దెకు తీసుకున్న వాహనాలకు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదని, రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంలో మధ్యాహ్న భోజనాలు, అల్పాహారాలు. టీ, కాఫీలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు బకాయి పడ్డారని, పత్రికలకు, ఛానళ్లకు విడుదల చేసే ప్రభుత్వ ప్రకటనల బిల్లులు రెండేళ్లకు పైగా పెండింగ్ లో ఉన్నాయని, కాలేజీల, హాస్పిటల్స్ రియింబర్స్ మెంట్ నత్తనడక నడుస్తున్నదని వార్తలు వస్తున్నాయి. ఇతర కాంట్రాక్టర్ల గగ్గోలు కూడా వినబడుతూనే ఉంది.

ఒకవైపు ఇలా మింగ మెతుకు లేని స్థితి ఉండగా, ఒక్కొక్కటి ఒక లక్షా ముప్పై వేల కోట్ల రూపాయల నుంచి ఒక లక్షా డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే మూడు బుల్లెట్ రైలు మార్గాల ప్రాజెక్టులో భాగం పంచుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తహతహలాడుతున్నది. హైదరాబాద్ నుంచి పూణేకూ, చెన్నైకీ, బెంగళూరుకూ బుల్లెట్ రైలు మార్గాలు వేసే ఆ భారీ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ బుల్లెట్ ట్రేన్ హబ్ నిర్మించడానికి ఉరుకులు పరుగుల మీద పని చేస్తున్నది. ఈ హబ్ నుంచి గంటకు 350 కి.మీ. వేగంతో నడిచే బుల్లెట్ రైళ్లు ప్రారంభమై ముంబాయికీ, చెన్నైకీ, బెంగళూరుకూ హైదరాబాద్ నుంచి మూడు గంటల లోపు చేరుకునే అవకాశం వస్తుందట. అయితే 2026 కేంద్ర బడ్జెట్ లో దీని ప్రస్తావన తప్ప కనీసమైన ముందస్తు పనులేవీ కూడా ఇంకా ప్రారంభం కాలేదు. మొదట డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డిపిఆర్) లు తయారు చేయాలి. ఆ పనే ఇంకా జరగలేదు. ఆ పని జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వ అనుమతులు, పర్యావరణ అనుమతులు, బహిరంగ ప్రజా విచారణలు జరగాలి. ఆ తర్వాత అవసరమైన భూసేకరణ జరగాలి. భూమి సేకరించిన తర్వాత నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లు ఖరారయ్యాక నిర్మాణం ప్రారంభమవుతుంది.ఇంకా డిపిఆర్ తయారు కాలేదు గనుక, ఈ పనుల మైలురాళ్లు ఏమిటో ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు. కాని 2029 నాటికి భూసేకరణ పూర్తయి, నిర్మాణం ప్రారంభమయితే, 2035-37 నాటికి బుల్లెట్ రైళ్లను నడిపే అవకాశం ఉంటుందని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

‘ఆలూ లేదు చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం’ అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారానికి సంబంధించి భూసేకరణ ప్రారంభించింది. మొత్తం వరుసలో ఐదో పనో, ఆరో పనో అయిన భూసేకరణను తెలంగాణ ప్రభుత్వం ఇంత హడావిడిగా, ఇంకా మొదటి పని కూడా కాకుండానే మొదలుపెట్టిందంటే, అసలు ప్రాజెక్టు అటకెక్కినా, తన చేతుల్లో భూమి మిగుల్చుకోవడానికే. ప్రజలకు అవసరమైన ఇతర పనులు చేయడంలో ప్రభుత్వానికి ఇంత ఉత్సాహమూ, వేగమూ, హడావిడీ ఉంటే ఎంత బాగుండును! హైదరాబాద్ బుల్లెట్ ట్రేన్ హబ్ నిర్మించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్ విమానాశ్రయ సమీపంలోని బహదూర్ గూడ గ్రామంలో 650 ఎకరాల భూమిని ఎంచుకుంది. బహదూర్ గూడలో సర్వే నంబర్ 62లో 500 ఎకరాలు, సర్వే నంబర్ 28లో 150 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందనీ, దాన్ని ఇప్పటివరకూ సాగు చేసుకుంటున్న రైతుల నుంచి స్వాధీనం చేసుకుని, బుల్లెట్ ట్రేన్ హబ్ కోసం కేటాయిస్తామనీ ప్రభుత్వాధికారులు అంటున్నారు. అది ప్రభుత్వ భూమే అయితే స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి హక్కు ఉంది గాని, మొట్టమొదట అది ప్రభుత్వ భూమి అవునా కాదా తేలాలి. ఒకవేళ ప్రభుత్వ భూమి అని తేలినా, దశాబ్దాలుగా ఆ భూమిని రైతులు సాగు చేస్తున్నారని, భూమి వారి అధీనంలోనే ఉందని తేలితే, దాని స్వాధీనానికి అనుసరించవలసిన చట్టబద్ధ ప్రక్రియ ఉంటుంది.

ఆ చట్టబద్ధ ప్రక్రియనంతా తుంగలో తొక్కి, హైడ్రాకు ఇప్పటికే అలవాటయిన దౌర్జన్యాన్నీ, దురాక్రమణనూ ఈ భూమి విషయంలో కూడా అమలు చేశారు. భూమిని వెంటనే స్వాధీనం చేసుకుని చుట్టూ కంచె పాతడానికి వెయ్యి మంది పోలీసులను మోహరించి, రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులు బుల్డోజర్లను, గుంతలు తవ్వి, కంచెలు పాతే కూలీలను తీసుకుని శనివారం తెల్లవారు జామున గ్రామం మీద దాడి చేశారు. ఉదయం నుంచే గ్రామస్తులను ఇళ్ల నుంచి బైటికి, పొలాలకు వెళ్లకుండా దిగ్బంధనం చేసి, ప్రతిఘటించినవారిని అరెస్టు చేసి, భయ భీతావహం సృష్టించి, గ్రామంలో విద్యుత్తు సరఫరా బంద్ చేసి, ఇప్పటికే పంటలు ఉన్న భూముల చుట్టూ కంచెలు పాతడానికి ప్రయత్నించారు.

ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి రాబోతున్నారనే వార్త పొక్కినప్పటి నుంచీ, వారం పది రోజులుగా రైతులు భూముల దగ్గర నిరసన దీక్ష చేస్తున్నారు. ఆ భూమిని దురాక్రమించడానికి అధికారులు రాగానే అక్కడ సాగు చేసుకుంటున్న రైతులు సహజంగానే అధికారుల మీద తిరగబడ్డారు. ఈ భూములను ప్రభుత్వం తమకు అసైన్ చేసిందని, ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగినా తగిన పత్రాలు ఇవ్వలేదని, పత్రాలు లేకపోయినంత మాత్రాన దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న, తమ అధీనంలో ఉన్న భూమిని చెప్పాపెట్టకుండా, పద్ధతి ప్రకారం కాకుండా ఆక్రమించడానికి వీలు లేదని రైతులు వాదించారు. ఈ ఘర్షణ క్రమంలో పోలీసులు ప్రజల మీద లాఠీచార్జి చేశారు, ప్రజలు, ముఖ్యంగా మహిళలు చురుగ్గా అధికారులను అడ్డుకుని అధికారుల కళ్లలో కారం చల్లారు. భూమి కోసం పోరాడుతున్న ప్రజలకు ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపి మద్దతుగా నిలవగా పోలీసులు ప్రతిపక్ష నేతలను కూడా అరెస్టు చేశారు.

అవి ఒకవేళ అసైన్డ్ భూములు అయినా, చట్ట వ్యతిరేకంగా అన్యాక్రాంతం అయ్యాయని, అలా కొనుక్కున్నవారు భవనాలు, ఫార్మ్ హౌజులు నిర్మించుకున్నారని, వారే ప్రజలను రెచ్చగొడుతున్నారని అధికారులు అంటున్నారు. ఎకరానికి 500 చదరపు గజాల స్థలం ఇస్తామని అధికారులు చెపితే ప్రజలు అంగీకరించారని, కాని ఇతరుల ప్రోద్బలంతో 1200 చదరపు గజాలు ఇవ్వాలని పేచీ పెడుతున్నారని అంటున్నారు. మొత్తం సేకరిస్తున్న 650 ఎకరాల్లో 400 ఎకరాలు బుల్లెట్ ట్రేన్ హబ్ కు కావాలని, బస్ టర్మినల్ కు 100 ఎకరాలు, మెట్రో టర్మినల్ కు 50 ఎకరాలు పోగా, 96 ఎకరాల్లో ఒక లే అవుట్ ను కూడా అభివృద్ధి చేస్తామని, దానిలో రైతులకు కోల్పోయిన ఎకరానికి 600 గజాల చొప్పున ఇస్తామని ప్రభుత్వం ఇప్పుడు అంటున్నది.

అయితే ఇంకా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు కూడా రాకుండా ఈ మాటల్లో ఏవి నమ్మదగినవో, ఏవి అబద్ధాలో చెప్పలేం. అసలు ప్రస్తుత భూసేకరణ విషయంలో కూడా ప్రభుత్వం గందరగోళం సాగిస్తున్నది. సర్వే నంబర్ 62, 28ల్లో మాత్రమే భూమి సేకరిస్తున్నామని ఒకవైపు చెపుతూనే, ఇతర సర్వే నంబర్ల భూమి చుట్టూ కూడా కంచె వేస్తున్నది. ఉదాహరణకు, సర్వే నంబర్ 3, సర్వే నంబర్ 5లలోని రైతుల పట్టాభూమి, 26 ఎకరాల పంట భూమి చుట్టూ కూడా కంచెలు పాతారు. హైడ్రా నాయకత్వంలో, పోలీసు దౌర్జన్యంతో, రెవెన్యూ అధికారుల సహాయంతో సాగిన ఈ భూదురాక్రమణ ప్రక్రియ మీద నలుగురు రైతులు జక్కిడి యాదిరెడ్డి, జక్కిడి శ్రీనివాస్ రెడ్డి, తూర్పు సుదర్శన్ రెడ్డి, తూర్పు సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నలుగురు మధ్యతరగతి రైతులకూ ఒక్కొక్కరికి ఉన్న భూమి 8.26 ఎకరాలు, 6.04 ఎకరాలు, 8.21 ఎకరాలు, 6.09 ఎకరాలు. వీరు తమ భూమిలో వరితో పాటు కూరగాయలు కూడా పండిస్తున్నారు, పూల తోటలు కూడా వేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి ముందు సీనియర్ న్యాయవాది వి రఘునాథ్ సోమవారం నాడు అత్యవసర పిటిషన్ దాఖలు చేయగా, ఆ 26 ఎకరాల మీద బలవంతపు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

వారు దాఖలు చేసిన 98 పేజీల పిటిషన్ లో ఆ నలుగురు రైతులు ఆ భూములను 1990-92లో కొన్న పత్రాలు, ఈ ముప్పై ఆరు సంవత్సరాలుగా తమ పేర్ల మీద ఉన్న పట్టాదారు పాస్ బుక్కులు, ధరణి, భూభారతి రికార్డులు జతపరిచారు. మూడు దశాబ్దాలకు పైగా తమ అధీనంలో, తమ సాగులో ఉన్న భూమిని స్వాధీనం చేసుకుని కంచె వేసి, తమ పంట దగ్గరికి తమను వెళ్లకుండా అడ్డుకోవడానికి ప్రభుత్వానికి ఏమి అధికారం ఉందని వారు ప్రశ్నిస్తున్నారు. తమ పూర్వీకుల సమాధులు కూడా ఉన్న తమ సొంత భూమిలోకి ప్రభుత్వాధికారులు చొరబడి బుల్డోజర్లతో గేటు, ప్రహరీ గోడ కూల్చివేసి, భూమి చుట్టూ కంచె వేశారని వారు కోర్టుకు తెలియజేశారు.అదే సమయంలో ఆర్ కృష్ణమోహన్ రాజు, మరో 84 మంది రైతులు కూడా గ్రామంలో వివిధ సర్వే నంబర్లలో ఉన్న తమ సొంత భూముల్లోకి హైడ్రా, రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రవేశించి విధ్వంసం సృష్టించారని, ఆ దురాక్రమణను అడ్డుకుని, తమ భూములు తమకు ఇప్పించాలని హైకోర్టును కోరారు. హైడ్రా సాగించిన ఈ దౌర్జన్యం వల్ల గ్రామంలో మొత్తం 500 కుటుంబాలు తీవ్రమైన మానసిక వేదంకు గురయ్యాయని వారు కోర్టు దృష్టికి తెచ్చారు.

బుల్లెట్ రైలు భ్రమలలో, రంగుల కాలాల్లో బతికే మధ్యతరగతికి ఈ రైతుల గోడు పట్టకపోవచ్చు. అభివృద్ధి కోసం ఆ మాత్రం త్యాగం చేయలేరా అని ఎదురు ప్రశ్నలు కూడా వేయవచ్చు. దేశంలో బ్రిటిష్ వలస పాలనా కాలం నుంచీ ప్రజల నుంచీ, రైతుల నుంచీ, ఆదివాసుల నుంచీ లక్షలాది ఎకరాల భూమి ఇలాగే లాక్కుని వారిని నిర్వాసితులను చేశారు. 1947 తర్వాత, మరీ ముఖ్యంగా 1992 ప్రపంచీకరణ తర్వాత భూసేకరణ పేరుతో సాగే ఈ దురాక్రమణ మితిమీరిపోయింది. ప్రతి సందర్భంలోనూ దేశాభివృద్ధి కోసం, సమాజాభివృద్ధి కోసం వ్యక్తులు, కుటుంబాలు త్యాగం చేయాలనే శుష్క ప్రవచనాలు వినిపిస్తూనే ఉంటాయి. ఇంతకూ అసలు సమస్య ఎవరు త్యాగం చేస్తున్నారు, ఎవరి అభివృద్ధి జరుగుతున్నదనేది. దేశంలోని వందలాది “అభివృద్ధి పథకాలనూ”, వాటి వల్ల భూమినీ, ఉపాధినీ, జీవికనూ కోల్పోయిన కోట్లాది ప్రజలనూ ఒక్కసారి పోల్చి చూస్తే త్యాగం చేసినవారికి ప్రతిఫలం దక్కలేదు. వారికి ఎక్కువలో ఎక్కువ నష్ట పరిహారం పేరుతో కాసిన్ని డబ్బులు విదిల్చారు. సాధారణంగా వారి జ్ఞానపరిధికి మించిన డబ్బు చేతికి అందడంతో దాన్ని ఏమి చేసుకోవాలో తెలియక వృథా చేసుకున్నవారూ, మోసపోయినవారూ, చివరికి పేదరికంలోకి జారిపోయినవారూ ఎందరో ఉన్నారు. ఆ నష్ట పరిహారం కూడా భూమి ఉన్నవారికే అందుతుంది గాని, భూమి మీద, వ్యవసాయం మీద, గ్రామం మీద ఆధారపడి వివిధ వృత్తుల్లో బతుకుతూ, భూమిలేని వారికి పైసా కూడా అందదు. ఏ గ్రామంలోనైనా అటువంటి భూమి లేని నిరుపేదల జనాభా సగం కన్నా ఎక్కువే ఉంటుంది. వారు పట్టణాలకు వెళ్లి అడ్డాకూలీలుగా మారడం తప్ప మరొక మార్గం మిగలదు.

అలా అటు భూమి ఉన్నవారి పరిస్థితినీ దిగజార్చి, ఇటు భూమి లేని వారిని బిచ్చగాళ్లుగా మార్చి, వచ్చే “అభివృద్ధి” ఎవరికి అందుతుంది? ఇంకో పది సంవత్సరాల తర్వాత వస్తుందో రాదో తెలియని బుల్లెట్ ట్రేన్ లో, రెండు గంటల్లో చెన్నైకో, బెంగళూరుకో వెళ్లిపోవాలని ఉబలాటాపడే వేలాది, లక్షలాది ఊహాజనిత ప్రయాణికుల్లో ఒక్కరైనా బహదూర్ గూడ నిర్వాసితుల కుటుంబ సభ్యులు ఉంటారా? ఎవరి త్యాగం, ఎవరికి బోగం? ఈ తలకిందుల అభివృద్ధి నమూనాను ఇప్పటికైనా అనుమానించవద్దా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *