“అప్పటికి అధికారంలో ఉన్నవారి మీద వ్యతిరేకతతో పాటు, కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టడానికి దోహదం చేసినవి ఆ పార్టీ చేసిన వాగ్దానాలుకూడా. ఎన్నికల ప్రణాళికలోనూ, ఎన్నికల ప్రచార సభల్లో రాష్ట్రమంతటా ఎన్నోచోట్ల కాంగ్రెస్ అగ్రనాయకుల దగ్గరినుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి,మంత్రుల దాకా ఎందరో ప్రకటించిన వాగ్దానాలున్నాయి. వాటిలో ఆరు గ్యారంటీలు ప్రధానమైనవి. ఆ ఆరు హామీలకు తాను ఏడో హామీ జతచేస్తున్నానని కూడా అప్పటికి పిసిసి అధ్యక్షుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు..”
ప్రజాతంత్ర దినపత్రిక తెలంగాణార్థం 98 సెప్టెంబర్ 3, 2026
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెయ్యిరోజుల పండుగ జరుపుకున్నది. పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజుల కోసం వచ్చిన అధికారంలో సగం దాటిపోయి, మరొక మైలురాయి వచ్చింది. తన పాలన గురించి ప్రభుత్వ ప్రగల్భాలు ఎట్లా ఉన్నప్పటికీ, ప్రజలలో మాత్రం విపరీతమైన అసంతృప్తి చెలరేగుతున్నది. ఎన్నికల్లో కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు, ఆ వాగ్దానాలను చూసి కొన్ని ప్రజా సమూహాల్లోనైనా కలిగిన భ్రమలు కరిగిపోయాయి, కరిగిపోతున్నాయి. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇంత త్వరగా ఇంతగా ప్రజాభిమానం పోగొట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తున్నట్టుంది. క్షేత్ర స్థాయి నాయకులు, ఇంటిలిజెన్స్ రిపోర్టులు, రాగ్ దర్బారీ మీడియా అధినాయకత్వం చెవులకు ఇంపుగా ఉండే అబద్ధాలో, అర్ధసత్యాలో చెప్పి మెప్పిస్తుండవచ్చు గాని వాస్తవం పూర్తిగా భిన్నంగా ఉంది.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏ కారణాలతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిందో, ప్రజల నుంచి దూరం, ప్రజలను వినకపోవడం, ప్రజా ఆకాంక్షలను పట్టించుకోకపోవడం, అహంకారం, అవినీతి వంటి ఆ కారణాలన్నీ తిరిగి వచ్చాయి. ఏ ఒక్కటైనా గడిచిన వెయ్యి రోజుల్లో రద్దు కాలేదు. ఆ కారణాలు ఒక పార్టీకి మాత్రమే వర్తిస్తాయనీ, మరొక పార్టీకి వర్తించవనీ లేదు. పాలన మీద, పాలకుల మీద సాధారణంగా ఏర్పడే ప్రజాభిప్రాయం అది. పాలనా సరళి పట్ల ప్రజల వ్యతిరేకత అది. ఒక్కొక్క డిగ్రీగా ఆ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అసలు ఉష్ణోగ్రతే లేదని వందిమాగధులు ఇంపైన భజన గీతాలు పాడుతున్నప్పుడే, హఠాత్తుగా థర్మామీటర్లు పగిలిపోతాయి. 2023 ఎన్నికల్లో వ్యక్తమైనది ఆ వ్యతిరేకతే గాని, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ పట్ల అనుకూలత కాదు. రేపు 2028లో అలాగే జరిగితే అది కూడా వచ్చేవారి పట్ల అనుకూలత కాదు, వీరి పట్ల వ్యతిరేకత. వోటరుకు ఇంకొక దిక్కు లేదు.
అప్పటికి అధికారంలో ఉన్నవారి మీద వ్యతిరేకతతో పాటు, కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టడానికి దోహదం చేసినవి ఆ పార్టీ చేసిన వాగ్దానాలు కూడా. ఎన్నికల ప్రణాళికలోనూ, ఎన్నికల ప్రచార సభల్లో రాష్ట్రమంతటా ఎన్నోచోట్ల కాంగ్రెస్ అగ్రనాయకుల దగ్గరినుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి, మంత్రుల దాకా ఎందరో ప్రకటించిన వాగ్దానాలున్నాయి. వాటిలో ఆరు గ్యారంటీలు ప్రధానమైనవి. ఆ ఆరు హామీలకు తాను ఏడో హామీ జత చేస్తున్నానని కూడా అప్పటికి పిసిసి అధ్యక్షుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ ఆరు గ్యారంటీలకు వంద రోజుల గడువు పెట్టారు. “వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ” అని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార పోస్టర్లు ప్రకటించాయి. వెయ్యి రోజులు గడిచినా ఆ ఆరు గ్యారంటీలు సంపూర్ణంగా అమలయ్యాయని చెప్పే పరిస్థితి లేదు.
“వ్యవసాయ కూలీలకు రు. 12,000 ఇస్తామన్న హామీ ఇప్పటివరకూ ప్రారంభం కాలేదు. వ్యవసాయ కూలీలను ఎలా గుర్తించాలో, వారికి ఈ భరోసా నగదు ఎలా ఇవ్వాలో విధివిధానాలు రూపొందించడానికి 2024 జూలై 2న నియమించిన మంత్రివర్గ ఉపసంఘం 2025 జనవరిలోనే నివేదిక సమర్పించింది. తర్వాత ఇరవై నెలలు గడిచిపోయినా ఆ విషయం అంగుళం కూడా ముందుకు కదలలేదు..”
ఆరు గ్యారంటీల్లో మొదటిది మహాలక్ష్మి. ప్రతి మహిళకూ ప్రతి నెలా రు. 2,500 ఇస్తామని, రు. 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం ఒక్కటి మాత్రమే దాదాపుగా పూర్తిగా అమలవుతున్నది. అయితే, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం మీద సమాజంలో, చివరికి బస్సు నడిపే సిబ్బందిలో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఇప్పటికీ కనబడుతున్నది. ఆ వ్యతిరేకతకు కారణమైన పితృస్వామ్య భావనలను పోగొట్టే బాధ్యతను ప్రభుత్వం తీసుకోకపోయినా, కనీసం స్త్రీలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవ్వడం ఎందుకు అవసరమో, అది మొత్తంగా సమాజానికి ఎంత మేలు చేస్తుందో ప్రజల్లో చైతన్యం కలిగించడానికి తనవైపు నుంచి ప్రభుత్వం చేయవలసిన ప్రయత్నం, ప్రచారం ఉన్నాయి. కాని ఆ పని ఇసుమెత్తు కూడా జరిగినట్టు లేదు.
ఇక సిలిండర్ ధరలో రాయితీ ఇవ్వడం స్త్రీలకు మాత్రమే వర్తించే సహాయం ఏమీ కాదు, దాన్ని మహాలక్ష్మిలో భాగం చెయ్యనక్కరలేదు. గ్యాస్ సిలిండర్ రాయితీని స్త్రీల పథకంగా చెప్పడంలోనే వంట పని, వంటింటి బాధ్యత స్త్రీలది మాత్రమే అనే పితృస్వామిక భావజాలం ఉంది. అది అలా ఉంచితే, ఈ పథకం అమలు కోసం అనేక షరతులు విధించారు. వెయ్యి రోజులు గడిచాక చూస్తే ఇది రాష్ట్రంలోని ఒక కోటి కుటుంబాలలో, తెల్ల రేషన్ కార్డ్ ఉన్న 90 లక్షల కుటుంబాలలో, 43 లక్షల కుటుంబాలకు మాత్రమే అందుతున్నదని ప్రభుత్వ గణాంకాలే చెపుతున్నాయి. ఇక అర్హులైన మహిళలకు నెలకు రు. 2,500 నగదు సహాయం అనే పథకం ఇప్పటికి మొదలు పెట్టలేదు. అంటే మహాలక్ష్మి కింద ఇచ్చిన మూడు హామీలలో ఒక్కటి మాత్రమే అమలవుతున్నది, ఒకటి నత్తనడక నడుస్తున్నది, మరొకటి ప్రారంభమే కాలేదు!
రెండోది రైతు భరోసా. దీనికింద రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రు. 15,000, వ్యవసాయ కూలీలకు రు. 12,000, వరి పంటకు బోనస్ గా రు. 500 ఇస్తామన్నారు. ఈ పథకం కింద ఇప్పటికి రు. 36,000 కోట్లు ఖర్చు పెట్టామని, మొత్తంగా వ్యవసాయ రంగానికి రు. 1.75 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని ప్రభుత్వం చెప్పుకుంటున్నది. కాని రైతులకు పంటకు రు. 6,000 చొప్పున రు. 12,000 కన్నా ఎక్కువ అందలేదు. అది కూడా అందినవారికి మాత్రమే. అందనివారు, ఆలస్యంగా అందినవారు ఎందరో ఉన్నారు. వ్యవసాయ కూలీలకు రు. 12,000 ఇస్తామన్న హామీ ఇప్పటివరకూ ప్రారంభం కాలేదు. వ్యవసాయ కూలీలను ఎలా గుర్తించాలో, వారికి ఈ భరోసా నగదు ఎలా ఇవ్వాలో విధివిధానాలు రూపొందించడానికి 2024 జూలై 2న నియమించిన మంత్రివర్గ ఉపసంఘం 2025 జనవరిలోనే నివేదిక సమర్పించింది. తర్వాత ఇరవై నెలలు గడిచిపోయినా ఆ విషయం అంగుళం కూడా ముందుకు కదలలేదు. ఇక వరికి రు. 500 బోనస్ కొన్ని రకాల వరి వంగడాలకే పరిమితం చేశారు. అంటే ఈ పథకం కింద మూడు హామీల్లోనూ రెండు అరకొరగా అమలు కాగా, ఒకటి అమలులోకే రాలేదు.
మూడోది గృహ జ్యోతి పథకం. దీని కింద అర్హులైన 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వాడకం వరకూ ఉచిత విద్యుత్తు ఇస్తామన్నారు. దీని అమలు మీద చాలా కఠినమైన షరతులు ఉండడంతో పాటు, ఒక్క యూనిట్ వాడకం పెరిగినా మితిమీరిన బిల్లులు వేస్తున్నారు. ఈ పథకం కొంతవరకు అమలవుతున్నట్టు కనబడుతున్నా, క్షేత్ర స్థాయి నుంచి ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. వెయ్యి రోజులు గడిచిన ఫిర్యాదులు రాకుండా, వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే యంత్రాంగం లేదు.
“వెయ్యి రోజుల్లో సాధించినదేమైనా ఉందంటే, ప్రతి లోపానికీ పాత ప్రభుత్వం వైపు వేలు చూపడం మాత్రం అయినదానికీ, కానిదానికీ యథావిధిగా సాగుతున్నది. ఆ ఆరోపణ నెలో రెండు నెలలో ఏడాదో సరిపోతుందేమో గాని, పగ్గాలు చేపట్టి సగం కాలం గడిచి, వెయ్యి రోజులు గడిచినా అదే సాకు కుదరదు. అలాగే ఈ వెయ్యి రోజుల పాలన సాధించిన మరొక అంశం రాజకీయ భాషను మున్నెన్నడూ లేనంతగా దిగజార్చడం. ఇదీ వెయ్యిరోజుల ఘనత!”
నాలుగోది ఇందిరమ్మ ఇండ్లు. ఇల్లు లేనివారికి ఇంటి స్థలం తోపాటు రు. 5 లక్షలు. స్థలం ఉన్నవారికి రు. 5 లక్షలు, ఉద్యమకారులకు 250 చ.గ. ఇంటి స్థలం ఈ పథకం కింద హామీలు. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొదటి విడతలో 4.16 లక్షల ఇళ్లను మంజూరు చేసి రు. 22,500 కోట్లు కేటాయించానని ప్రభుత్వం చెప్పుకుంటున్నది. అయితే కాగితాల మీద మంజూరీలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మొదటి విడత బిల్లుల చెల్లింపులే జరగలేదని, లబ్ధిదారుల ఎంపికలో కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రజా పాలనలో దరఖాస్తు చేస్తున్న లక్షలాది మంది అర్హులైన నిరుపేదల పట్ల వివక్ష చూపుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. సొంత స్థలం ఉంటే రు. 5 లక్షలు ఇస్తామన్న ప్రభుత్వం, అసలు స్థలం లేనివారి ఊసే ఎత్తడం లేదు. ఇక ఉద్యమకారుల గుర్తింపు జరగలేదు గనుక ఈ పథకం కింద ఆ హామీ కూడా అమలు కాలేదు.
అయిదోది యువ వికాసం. విద్యార్థులకు రు. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాపిస్తామని హామీ ఇచ్చారు. విద్యా భరోసా కార్డు అమలుకు మార్గదర్శక సూత్రాలు తయారుచేయడం కోసం విద్యాశాఖ, బ్యాంకింగ్ రంగ అధికారులతో చర్చలు జరుపుతున్నదంటున్నారు. వెయ్యి రోజులైనా ఆ చర్చలు పూర్తి కాలేదు, విధివిధానాలు తేలలేదు. కనుక పథకం ప్రారంభం కాలేదు. మండలానికో అంతర్జాతీయ స్థాయి పాఠశాల నిర్మాణం అన్నవారు, నిర్మాణం సంగతి అలా ఉంచి, కనీసం పునాదిరాయి కూడా వేయకుండానే వెయ్యి రోజులు గడిపారు. ఆ ఐదు లక్షల వాగ్దానం అలా ఉంచి, సంవత్సరాలుగా విద్యార్థులకు అందుతున్న ఫీజు రీయింబర్స్ మెంట్ ను కూడా ఇబ్బందుల పాలు చేశారు. పేరుకుపోయిన రి యింబర్స్ మెంట్ పాత బకాయిలు చెల్లించడం లేదు. ఇప్పటికీ రెండు విద్యా సంవత్సరాల్లో కొత్త రి యింబర్స్ మెంట్ బాకీలు చెల్లించలేదు. విద్యార్థులను, తల్లిదండ్రులను కాలేజీల యాజమాన్యాలు వేధిస్తుంటే ప్రభుత్వం మౌనసాక్షిగా ఉంటున్నది.
ఆరోది చేయూత. వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు అంతవరకూ ఉండిన రు. 2,016 పింఛన్ ను రు. 4,000 కు పెంచుతామని, దివ్యాంగులకు అంతకు ముందున్న రు. 4,016 పింఛన్ స్థానంలో రు. 6,000 ఇస్తామని వాగ్దానం చేశారు. కాని రాష్ట్రంలోని దాదాపు 44 లక్షల మంది లబ్ధిదారులకు, వెయ్యి రోజులుగా ఇప్పటికీ పాత ప్రభుత్వ పింఛన్ మాత్రమే అందుతున్నది గాని, పెంపుదల లేదు. అలాగే ఈ నిరాదృత వర్గాలకు రు. 10 లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా పథకం ఇస్తామన్నారు, అదీ నత్తనడక నడుస్తున్నది.
ఈ ఆరు హామీల్లో లేకపోయినా రాష్ట్రంలో ప్రధాన సమస్యగా ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి, తగ్గించడానికి ఈ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో చేసినదేమీ లేదు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ ఆరు హామీలకు తోడుగా, తాను వ్యక్తిగతంగా ఏడో హామీగా ప్రజాస్వామ్య పాలన తెస్తానని, అంతకు ముందరి ప్రభుత్వంలో కోల్పోయిన ప్రజల హక్కులను పునరుద్ధరిస్తానని రేవంత్ రెడ్డి ఎన్నికల వాగ్దానంగానూ, అధికారం చేపట్టగానే ఇచ్చిన ఉపన్యాసంలోనూ వాగ్దానం చేశారు. కాని అంతకు ముందు పది సంవత్సరాలలో తెలంగాణ ఎంతగా పోలీసు రాజ్యంగా మారిపోయిందో, ఈ రెండున్నర సంవత్సరాలలో అంతకన్నా ఎక్కువగా కొనసాగుతున్నది. పౌర, ప్రజాస్వామ్య హక్కుల పునరుద్ధరణ అనేది జరగానే లేదు. సభలు, సమావేశాల నిర్వహణ మీద పాతకాలపు ఆంక్షలే కొనసాగుతున్నాయి. హాలు యాజమాన్యాలను స్థానిక పోలీసు అధికారులు బెదిరించి, హాలు సమావేశాలకు కూడా పోలీసు అనుమతి కావాలంటున్నారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నాలకు, నిరసన ప్రదర్శనలకు కూడా ఎంతమంది రావచ్చు, ఎంత సమయంలో నిరసన తెలపాలి, ఏ స్థల పరిమితులలోపల నిరసన తెలపాలి లాంటి ఇదివరకెన్నడూ లేని ఆంక్షలు, నియమాలు పెడుతున్నారు. అతి ఎక్కువ నిఘా నేత్రాలున్న నగరంగా అంతర్జాతీయ ఖ్యాతి పొందిన నగరంలో ఆ నిఘా అంతా ప్రజల మీద, ప్రజా ప్రదర్శనల మీద, ప్రజా ఉద్యమకారుల మీద తప్ప, నిజంగా నేరాల మీద ఉండడం లేదు. నగరంలో అన్ని రకాల నేరాలు యథావిధిగా జరిగిపోతున్నాయి.
వెయ్యి రోజుల్లో సాధించినదేమైనా ఉందంటే, ప్రతి లోపానికీ పాత ప్రభుత్వం వైపు వేలు చూపడం మాత్రం అయినదానికీ, కానిదానికీ యథావిధిగా సాగుతున్నది. ఆ ఆరోపణ నెలో రెండు నెలలో ఏడాదో సరిపోతుందేమో గాని, పగ్గాలు చేపట్టి సగం కాలం గడిచి, వెయ్యి రోజులు గడిచినా అదే సాకు కుదరదు. అలాగే ఈ వెయ్యి రోజుల పాలన సాధించిన మరొక అంశం రాజకీయ భాషను మున్నెన్నడూ లేనంతగా దిగజార్చడం. ఇదీ వెయ్యిరోజుల ఘనత!





అగౌరవం కాదు, అవసరమైన నిష్కర్ష!