– విపక్షాల నిరసనలతో హోరెత్తిన సభ
– నల్ల చొక్కలతో పార్లమెంట్ ముందు విపక్షాల నిరసన
న్యూదిల్లీ, జులై 22: వరుసగా మూడో రోజు కూడా పార్లమెంట్‌లో గందరగోళం నెలకొంది. విపక్ష సభ్యలు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టబట్టడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. బుధవారం కూడా లోక్‌సభ, రాజ్యసభలో గందరగోలం నెలకొన్నది. దీంతో రెండు సభలు 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని లోక్‌సభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. సభను ఆర్డర్‌లోకి తెచ్చేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించారు. కానీ ఫలితం కనిపించలేదు. ప్రశ్నోత్తరాల సమయం జరిగే రీతిలో విపక్షాలు సహకరించాలని ఆయన కోరారు. ఎటువంటి సమస్యపైన అయినా చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. కానీ విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. నినాదాలు చేశారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా విపక్షాలు సీజేపీపై లాఠీచార్జ్ అంశాన్ని చర్చించాలని పట్టుపట్టాయి. కానీ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ వ్యతిరేకించారు. గందరగోళ నేపథ్యంలో సభను 12 వరకు వాయిదావేశారు. మరో వైపు విపక్ష ఎంపీలు ఇవాళ నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు. నీట్ పేపర్ లీకేజీ అంశంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీఛార్జ్‌కు నిరసనగా నల్ల దుస్తులు ధరించినట్లు కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా ఆరోపించారు.
పోలీసుల కాఠిన్యంపై -అత్యవసర చర్చకు సుప్రీం తిరస్కరణ
కాక్రోచ్ జనతాపార్టీ ’చలో సంసద్’ మార్చ్‌లో భాగమైన నిరసనకారులపై పోలీసు లాఠీఛార్జ్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే.. దాని అత్యవసర విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని.. అలాగే పిటిషనర్ కూడా తన సమయాన్ని వృథా చేసుకోవద్దని ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. నిరసనకారులపై పోలీసు చర్యకు సంబంధించిన వీడియోల గురించి పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించగా..‘మాకు వీడియోలు చూసే సమయం లేదు‘ అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ పిటిషన్ అత్యవసర విచారణకు దిల్లీ హైకోర్టు కూడా నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ అంశంలోకి తమను లాగొద్దని వ్యాఖ్యానించింది. దాంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ లాఠీఛార్జిపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని పిటిషనర్ కోరారు. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యా వ్యవస్థలో సంస్కరణలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన చలో పార్లమెంటు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వేల మంది సీజేపీ మద్దతుదారులు పార్లమెంటువైపు దూసుకురావడం, బారికేడ్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని బాష్పవాయు గోళాలు ప్రయోగించడం, లాఠీఛార్జి చేయడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. పలుచోట్ల రాళ్లు రువ్వడం, ఘర్షణ పడటం, తోపులాటలతో అటు పోలీసులు, ఇటు ఆందోళనకారులు గాయపడ్డారు. చాలా మంది రక్తమోడుతున్న వీడియోలు వైరలయ్యాయి. వీటిని చూపుతూ విచారణ కోరారు. అయితే సుప్రీం ప్రధాన న్యాయమూర్తి వాటిని తిరస్కరించారు. అత్యవసరంగా చర్చించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




