“అలా మనుషులకు సొంతమనుకునే భూమి మీద హక్కును కాపాడడానికి వచ్చిన ప్రభుత్వాలు ఆ హక్కును కొల్లగొడితే ఇంక దిక్కేమిటి అనే ప్రశ్న ఇవాళ తెలంగాణను చుట్టుముట్టింది. ఆ చిక్కుముడి ప్రశ్న పేరు 22ఏ. వ్యక్తుల సొంత భూముల ప్రభుత్వ దురాక్రమణకు ముద్దు పేరు. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన వివాదానికి కారణమైన ఈ 22ఏ నుంచి వేడి పుడుతున్నంతగా వెలుగు పుట్టడం లేదు. అసలు 22ఏ ఏమిటి అని తెలియని వారు కూడా రంగంలోకి దిగి అవతలి పక్షం మీద కాలు దువ్వుతున్నారు, ఒంటి కాలి మీద లేస్తున్నారు..”
‘భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు’ అన్నాడు వేమన. భూమిని ఎవరూ చంకన పెట్టుకొని పుట్టరు. భూమిని ఎవరూ చాపచుట్ట చుట్టి దాని మీద ఎల్లకాలానికీ కూచోలేరు. అసలు ప్రకృతి మనుషులకు చెందినది కాదు, మనుషులే ప్రకృతికి చెందినవారు. లక్షల కోట్ల ఏళ్లుగా పరిణామక్రమంలో ఉన్న ప్రకృతిలో వేల ఏళ్ల మానవ సమాజం మాత్రమే మిగిలిన ఏ జీవికీ తెలియని సొంత ఆస్తి భావనను సృష్టించి, దాని కోసం కక్షలూ కార్పణ్యాలూ పెంచింది, యుద్ధాలు చేసింది, రక్తాలు పారించింది. అంత బీభత్స హేతువు అయినప్పటికీ మనిషికి సొంత ఆస్తి అంటే, సొంత భూమి అంటే మమకారం పోలేదు. ఎన్నడూ మట్టి అంటని జీవితం గడిపినా, మట్టితో బంధమూ అనుబంధమూ లేకపోయినా, కాగితం మీద ఆ భూమి తనదే అనే అక్షరాలూ అంకెలూ ఉంటే చాలు. అట్లా కాగితం మీద భూమి సంపాదించాలని ఎంతో మందికి ఉన్న తపన వల్ల భూమికి ధర వచ్చింది. (ధర అనేది భూమికి పర్యాయపదం!). ఆ ధర పెరిగీ పెరిగీ అనూహ్య, అసహ్య పరిమాణానికి చేరింది. ఒక చదరపు గజం రెండున్నర లక్షల రూపాయలట. ‘మనిషికి ఎంత నేల కావాలి’ అని నూటయాబై ఏళ్ల కింద రష్యన్ మహా రచయిత లియో టాల్ స్టాయ్ ఒక కథ రాశాడు. మనిషి మృతదేహం ఖననం చేయడానికి వందల వేల ఎకరాలు అవసరం లేదు, ఆరడుగుల నేల చాలు అని తేల్చాడు.
సొంత ఆస్తిగా భూమి గురించి వేమన నుంచి టాల్ స్టాయ్ దాకా ఎంత తాత్విక చర్చ చేసినా, చివరాఖరికి మనిషికి చారెడు నేల కావాలి. పుట్టక ముందు ఏ శూన్యంలో, అంతరిక్ష ధూళిలో ఉన్నారో, చనిపోయాక ఏ శూన్యంలో, అంతరిక్ష ధూళిలో కలిసిపోతారో గాని, ఈ భూమి మీద ఉన్న కాలంలో కాసింత భూమి కావాలి. ఒక గూడు కావాలి. వ్యవసాయ భూమి కావాలి. విపరీతమైన దురాశతో వందల వేల ఎకరాలు అవసరం లేదు గాని మనిషి మనుగడకు కనీసమైన భూమి కావాలి. అదే భద్రత. అదే గౌరవం. అదే హామీ. అందువల్లనే భూమి మీద సొంత ఆస్తిని పరిరక్షించే చట్టాలూ, వాటిని అమలు చేసే ప్రభుత్వ యంత్రాంగాలూ, అందుకోసం బలప్రయోగాలూ వచ్చాయి.
అలా మనుషులకు సొంతమనుకునే భూమి మీద హక్కును కాపాడడానికి వచ్చిన ప్రభుత్వాలు ఆ హక్కును కొల్లగొడితే ఇంక దిక్కేమిటి అనే ప్రశ్న ఇవాళ తెలంగాణను చుట్టుముట్టింది. ఆ చిక్కుముడి ప్రశ్న పేరు 22ఏ. వ్యక్తుల సొంత భూముల ప్రభుత్వ దురాక్రమణకు ముద్దు పేరు. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన వివాదానికి కారణమైన ఈ 22ఏ నుంచి వేడి పుడుతున్నంతగా వెలుగు పుట్టడం లేదు. అసలు 22ఏ ఏమిటి అని తెలియని వారు కూడా రంగంలోకి దిగి అవతలి పక్షం మీద కాలు దువ్వుతున్నారు, ఒంటి కాలి మీద లేస్తున్నారు.
“రెవెన్యూ శాఖ మంత్రి చెప్పిన ప్రకారమే రాష్ట్రంలో 95,735 ఆస్తులు ఇలా నిషిద్ధ జాబితాలో చేరాయి. ముప్పై, నలబై ఏళ్ల కింద కొనుక్కుని, నివసిస్తున్న ఇళ్లను కూడా 22ఏ కింద చేర్చారు. చివరికి ముఖ్యమంత్రి ఇల్లు కూడా 22ఏ భూమిలోనే ఉందని తేలింది. స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి కూడా పొరపాట్లు జరిగాయని అంగీకరించారు. 22ఏ వివాద భూముల ఫిర్యాదులు స్వీకరించడానికి కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు..”
భూమిని 22ఏ కింద నిషేధిత భూమిగా నమోదు చేసినందువల్ల తాము దాన్ని అమ్మడానికి, కొనడానికి, తాకట్టు పెట్టి రుణం తీసుకోవడానికి వీలు కావడం లేదని, ఆ భూమి మీద నిర్మించిన ఇళ్లకు గృహరుణాలు మంజూరు కావడం లేదని, ఆ భూమిని 22ఏ నుంచి తొలగించాలని కోరుతూ వేలాది దరఖాస్తులు రాష్ట్ర హైకోర్టుకు వచ్చినప్పుడు, 22ఏ జాబితా రహస్యంగా ఉంచగూడదని, బహిరంగం చేయాలని హైకోర్టు 2025 ఆగస్టులో ఆదేశించింది. రెవెన్యూ అధికారులు అప్పటికి తమ దగ్గర ఉన్న 22ఏ జాబితాను హైకోర్టుకు సమర్పించడమో, బహిరంగ పరచడమో చేయకుండా, కొత్తగా 22ఏ జాబితా తయారు చేయడం మొదలుపెట్టారు. అలా తయారైన కొత్త 22ఏ జాబితా తప్పుల తడకగా, వివాదాస్పదంగా మిగిలింది. తమ భూమి అమ్ముకోవడానికి, కొత్తగా కొనడానికి ప్రయత్నించినవారికీ, తాము కొనుక్కుంటున్న గృహానికి రుణం కోసం బ్యాంకుకు వెళ్లినవారికీ 2025 డిసెంబర్ తర్వాత హఠాత్తుగా ఆ భూమి 22ఏ జాబితాలో ఉందని తెలిసింది. భూమి సమాచారాన్ని అంతకు ముందరి ధరణి నుంచి భూభారతికి మార్చే సమయంలోనో, ఆ తర్వాతనో ఈ కొత్త 22ఏ జాబితా తయారయిందని, అలా ఎన్నో సొంత భూములు డాటాబేస్ లో నిషేధిత భూములుగా మారిపోయాయని గగ్గోలు ప్రారంభమయింది.
ఒక భూమి 22ఏ జాబితాలో ఉంది గనుక రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదని చెప్పి, లంచాలు తీసుకుని, ఆ భూమిని ఆ జాబితా నుంచి బదలాయించి, రిజిస్ట్రేషన్ చేసిన సందర్భాలున్నాయని, అంటే 22ఏ జాబితా అనేది అవినీతికి రాజమార్గంగా మారిపోయిందని విమర్శలు వచ్చాయి. ప్రైవేటు భూములను ఇలా ప్రభుత్వ భూములుగా ప్రకటించి ప్రభుత్వ పెద్దలు దురాక్రమించడానికి, అడ్డికి పావుసేరుకు కొనుగోలు చేయడానికి, బెదిరించి కమిషన్లు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించగా, అసలు ఈ 22ఏ జాబితా అనేది ప్రతిపక్షాల కుట్ర అని అధికారపక్షం ప్రత్యారోపణ చేసింది. 22ఏ బాధితుల సమూహంతో ప్రతిపక్షం సమావేశాలు కూడా నిర్వహించింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి వంటి ఎన్నో జిల్లాల్లో, చివరికి గ్రామాల్లో కూడా వేలాది ఎకరాలు ఇలా “పొరపాటున” 22ఏ జాబితాలోకి చేరాయని తెలుస్తున్నది. రెవెన్యూ శాఖ మంత్రి చెప్పిన ప్రకారమే రాష్ట్రంలో 95,735 ఆస్తులు ఇలా నిషిద్ధ జాబితాలో చేరాయి. ముప్పై, నలబై ఏళ్ల కింద కొనుక్కుని, నివసిస్తున్న ఇళ్లను కూడా 22ఏ కింద చేర్చారు. చివరికి ముఖ్యమంత్రి ఇల్లు కూడా 22ఏ భూమిలోనే ఉందని తేలింది. స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి కూడా పొరపాట్లు జరిగాయని అంగీకరించారు. 22ఏ వివాద భూముల ఫిర్యాదులు స్వీకరించడానికి కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు.
22ఏ అనేది రిజిస్ట్రేషన్ చట్టం 1908 లోని ఒక నిబంధన అని, దాని ప్రకారం ప్రభుత్వ భూములను, అసైన్డ్ భూములను, గిరిజన భూములను, దేవాదాయ భూములను, అటవీ భూములను, భూగరిష్ట పరిమితి మిగులు భూములను, ప్రజా ప్రయోజనాల కోసం సేకరించిన భూములను, వక్ఫ్ భూములను బదిలీ చేయకుండా, కేవలం క్రయ విక్రయ పత్రాలు చూపి రిజిస్ట్రేషన్ చేయకుండా నిరోధించడానికి ప్రభుత్వానికి అధికారం వస్తుందని గత రెండు మూడు వారాల వివాదం ద్వారా చాలా మందికి తెలిసింది.
“మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లాండ్ ఇంప్రూవ్ మెంట్ లోన్స్ యాక్ట్ 1950 అనేది, ఇక నుంచి 1328 ఫస్లీ చట్టం స్థానంలో 1908 చట్టం ఉనికిలో ఉంటుదని నిర్ధారించింది. అలా తెలంగాణలో ప్రవేశించిన 1908 రిజిస్ట్రేషన్ చట్టం, 1956 ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు తర్వాత పూర్తిస్థాయిలో స్థిరపడింది. దానికి 1999లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఒక సవరణ ద్వారా 22ఏ నిబంధన చేరింది. ప్రస్తుత వివాదాస్పద 22ఏ తెలంగాణలో ప్రవేశించిన చరిత్ర ఇది..”
ఇది ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఏదైనా భూమిని 22ఏ భూమిగా ప్రకటిస్తే ఆ భూమిని అమ్మడానికీ, కొనడానికీ వీలు లేదన్నంత సులభమైన విషయం కాదు. చట్టపరంగా చాలా సంక్లిష్టమైన, ఎన్నో ప్రభుత్వాదేశాలు, న్యాయస్థానాల జోక్యాల చిక్కుముడులతో కూడిన ఈ వ్యవహారాన్ని వివరంగా అర్థం చేసుకోవలసి ఉంది.
అసలు భారత సమాజ చరిత్రలో భూమి మీద వ్యక్తిగత యాజమాన్యం ఉండిందా అనే చర్చ చరిత్రకారుల్లో ఉంది. బ్రిటన్ లో ఉండిన వ్యక్తిగత భూయాజమాన్య హక్కును వలస ప్రభుత్వం పద్దెనిమిదో శతాబ్ది చివరి దశాబ్దంలో భారతదేశంలో ప్రవేశపెట్టి, సర్వే సెటిల్ మెంట్ ప్రారంభించింది. భూములను వ్యక్తుల పేర్ల మీద రిజిస్టర్ చేయడం మొదలయింది. దానికి సంబంధించి 1864, 1866, 1871, 1877 చట్టాలన్నీ గడిచి, 1908లో ఒక సమగ్రమైన చట్టం తయారయింది. తర్వాతి కాలంలో దానికి అనేక సవరణలు కూడా జరిగాయి. అయితే అసలు రిజిస్ట్రేషన్ చట్టం 1908 మూలంలో 22ఏ అనే నిబంధన లేదు.
అంతమాత్రమే కాదు, బ్రిటిష్ ఇండియాలో 1908లో వలస ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రిజిస్ట్రేషన్ చట్టం హైదరాబాద్ రాజ్యానికి యథాతథంగా వర్తించదు. వెంటనే దాన్ని ఇక్కడ వర్తింప జేయలేదు. బ్రిటిష్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చట్టం వచ్చాక ఐదు సంవత్సరాలకు 1913-14ల్లో హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1323 ఫస్లీ అని, పది సంవత్సరాలకు 1918-19ల్లో హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1328 ఫస్లీ అనే చట్టాలు వచ్చాయి. 1948లో హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్ లో కలుపుకున్నంత వరకూ, ఆ మాటకొస్తే 1950 వరకూ కూడా తెలంగాణలో 1328 ఫస్లీ చట్టమే అమలులో ఉండింది.
మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లాండ్ ఇంప్రూవ్ మెంట్ లోన్స్ యాక్ట్ 1950 అనేది, ఇక నుంచి 1328 ఫస్లీ చట్టం స్థానంలో 1908 చట్టం ఉనికిలో ఉంటుదని నిర్ధారించింది. అలా తెలంగాణలో ప్రవేశించిన 1908 రిజిస్ట్రేషన్ చట్టం, 1956 ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు తర్వాత పూర్తిస్థాయిలో స్థిరపడింది. దానికి 1999లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఒక సవరణ ద్వారా 22ఏ నిబంధన చేరింది. ప్రస్తుత వివాదాస్పద 22ఏ తెలంగాణలో ప్రవేశించిన చరిత్ర ఇది.
అయితే ఆ 22ఏ మొదట, “ప్రభుత్వ విధానానికి (పబ్లిక్ పాలసీ) వ్యతిరేకమైన దస్తావేజుల రిజిస్ట్రేషన్ నిషేధం” అని చెప్పింది. ఈ “ప్రభుత్వ విధానం” అనే మాట అస్పష్టమైనదని, దాన్ని ఎట్లాగైనా వ్యాఖ్యానించ వచ్చునని, అందువల్ల చెల్లదని, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2005లో కొట్టివేసింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ 2007లో మరొక సవరణ ద్వారా ఆ అస్పష్టమైన పదం స్థానంలో, నిర్దిష్టంగా ఐదు రకాల భూముల మీద లావాదేవీలు నిషేధం, అటువంటి లావాదేవీలను రిజిస్టర్ చేయగూడదు అని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఈ చట్టం 2014 తర్వాత యథాతథంగా తెలంగాణ చట్టం అయిపోయింది.
ఈ సంక్లిష్టమైన చరిత్ర నుంచి అర్థమయ్యేదేమంటే, ఈ నిషేధం భూమి లావాదేవీల మీద కాదు, ఆ లావాదేవీలను రిజిస్టర్ చేయడం మీద మాత్రమే. ఇప్పుడు ఉనికిలో ఉన్న 22ఏ ఐదు రకాల భూముల రిజిస్ట్రేషన్ ను నిషేధిస్తుంది. అవి, 1. మరొక చట్టం ద్వారా బదిలీ నిషేధించబడిన భూములు. 2. ప్రభుత్వ భూములు, 3. దేవాదాయ, వక్ఫ్ భూములు, 4. గరిష్ట పరిమితికి మించిన మిగులు భూములు, 5. ప్రభుత్వ ఉత్తర్వులతో నిషేధించే ఇతర భూములు. నిజానికి మొదటి నాలుగు రకాల మీద పెద్ద వివాదం లేదు గాని, చివరి రకం మళ్లీ అస్పష్టతతో, ప్రభుత్వాధికారుల నిరంకుశత్వానికి, అవినీతికి, ఇష్టారాజ్యానికి అవకాశం ఇస్తున్నది. ఈ ఐదో రకం భూముల్లో స్థానిక సంస్థలకు, విద్యా, ప్రార్థనా మందిరాలకు, సాంస్కృతిక సంస్థలకు, మత సంస్థలకు, దాతృత్వ సంస్థలకు గతంలో ప్రభుత్వం కేటాయించిన భూములను గాని, న్యాయ వివాదాల్లో, పన్నుల ఎగవేతలో అటాచ్ మెంట్ కింద ఉన్న భూములను గాని, ప్రభుత్వం 22ఏ కిందికి మార్చవచ్చు.
అయితే ఈ నిబంధన కింద ఏ భూమిని నిషేధిస్తున్నారో దాని మీద జిల్లా కలెక్టర్ వివరమైన నివేదిక ఇవ్వాలని, నిషేధ నోటిఫికేషన్ ను బహిరంగ పరచాలని షరతులున్నాయి. నిషేధానికి నిర్దిష్టమైన ప్రక్రియ పాటించాలని ఆదేశాలున్నాయి. కాని, ప్రస్తుతం ఆ జాబితాను రహస్యంగా, యజమానులకు సమాచారం లేకుండా తయారు చేశారు. కలెక్టర్లు ఇచ్చిన వివరమైన నివేదికలు ఎక్కడున్నాయో తెలియదు. నిర్ణీత ప్రక్రియ వాస్తవంలో అమలు కాలేదు. తహశీల్దార్ గాని, సబ్ రిజిస్ట్రార్ గాని తమ ముందుకు ఒక లావాదేవీ వచ్చినప్పుడు, తమ దగ్గర ఉన్న కంప్యూటర్ డాటాబేస్ ప్రకారం అది 22ఏ భూమి అనీ, అందువల్ల రిజిస్టర్ చేయడం నిషేధం అనీ చెపుతున్నారు. ఇంతకూ అది కంప్యూటర్ డాటాబేస్ సమస్య కూడా కావచ్చు, నమోదు చేసిన సిబ్బంది పొరపాటు కావచ్చు, ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టు పైవారి ఉద్దేశపూర్వక కుటిలయత్నం కావచ్చు. ఏది ఏమైనా, వర్తమాన సమాజంలో మనుషులు పవిత్రంగా భావించే ‘సొంత ఆస్తి’ భావన మీదనే ప్రభుత్వం ఎక్కుపెడుతున్నది. ఇంత కమ్యూనిజం ఈ ప్రభుత్వానికి తగునా, ఇప్పుడే సాధ్యమేనా?





అగౌరవం కాదు, అవసరమైన నిష్కర్ష!