పోలీసు రాజ్యానికి మరిన్ని ఉదాహరణలు!

“పరామర్శకు వచ్చి, తమకు న్యాయం జరగాలని కోరినందుకు ఇటువంటి దాడా అని పోలీసుల దాడిని అడ్డుకోవాలని ప్రయత్నించిన మృతుడి భార్య మీద కూడా పోలీసులు నిర్దాక్షిణ్యంగా చెయ్యి చేసుకున్నారు. తోపులాటలో ఆమె గాజులు పగిలి చేతులు రక్తమండలాలయ్యాయి. మృతదేహం పక్కనుంచి మనుషులను లాక్కుపోవడం, మృతదేహం పక్కన ఉండగా భార్య మీద దౌర్జన్యం చేయడం ఎంత కర్కోటక పాలనల్లో కూడా జరిగి ఉండదు..”

రాష్ట్రంలో ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ పేరిట సాగుతున్న కాంగ్రెస్ పాలనలో పోలీసు రాజ్యం గురించి నానాటికీ మరింత అదనపు సమాచారం అందుతున్నది. వెయ్యి రోజుల పాలనా వైఫల్యాల గురించి శాసనసభ సమావేశాల ప్రారంభ దినాన ప్రతిపక్షం తెలిపిన నిరసన, ప్రతిపక్ష సభ్యులను శాసనసభ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా నిరోధించడంలో పోలీసులు ప్రదర్శించిన అతి, అక్కడ జరిగిన ఘర్షణ, అటూ ఇటూ మాటలు విసురుకోవడం, ప్రతిపక్ష నాయకుని ఇంటి ముందు చావు డప్పు ప్రదర్శనకు కాంగ్రెస్ పిలుపు, ఆ దారిలో పోలీసులు మళ్లీ ప్రదర్శించిన అతి, బిఆర్ఎస్ నిరసనకారుల మీద పోలీసులు బనాయించిన కేసులు, కాంగ్రెస్, బిఆర్ఎస్ ల ఆరోపణలు, ప్రత్యారోపణలు మామూలుగా జరిగిపోయాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పాలన మరింత పోలీసు రాజ్యంగా మారిందనడానికి మరికొన్ని పరిణామాలు జరిగాయి, జరుగుతున్నాయి. 

నిరసన సందర్భంగా నమోదైన కేసుల్లో దర్యాప్తు కోసం పోలీసు స్టేషన్ కు రమ్మని ప్రతిపక్ష నాయకుడు కెటిఆర్ సిబ్బందిలో పిఆర్ఓ, పిఏ లను పిలిపించారు. పండుగ రోజున పిలవవలసినంత తీవ్రమైన విషయం కానప్పటికీ వారిని కొన్ని గంటల పాటు పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఆ తర్వాత ముసుగులు కప్పుకున్న దుండగులు కొందరు పోలీసు స్టేషన్ లోకి ప్రవేశించి, పోలీసుల ముందే ఆ ఇద్దరి మీద దాడి చేయబోయారని, దుర్భాషలాడారని ఒక కథనం ప్రచారం అయింది. ఆ ముసుగువీరులు కాంగ్రెస్ గూండాలా, మారు వేషంలో వచ్చిన పోలీసులా అని బిఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. వారు గణేష్ మండపాల అనుమతుల కోసం వచ్చినవారనీ, కేటీఆర్ అనుచరులను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారని పోలీసులు అంటున్నారు. ఎవరైనా పోలీసు స్టేషన్ లోకి చొరబడి, పోలీసుల అదుపులో విచారణలో ఉన్నవారిపై దాడి చేయడానికి ప్రయత్నించడం నేరం గనుక దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయమని బిఆర్ఎస్ డిమాండ్ చేసింది. నాలుగైదు గంటల వాదనల తర్వాత పోలీసులు జరిగిన ఘటన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు సరిగదా, ఆ మాట అడిగిన బిఆర్ఎస్ నాయకులనే అరెస్టు చేశారు.   

ఈ వ్యవహారంలో అటూఇటూ అనేక వీడియోలూ రీల్సూ చలామణీలో ఉన్నాయి. అధికార, ప్రతిపక్ష కథనాలు భిన్నంగా ఉండవచ్చు. ప్రతి ఘటననూ ఎవరికి వారు తమకు అనుకూలంగా చెప్పుకోవచ్చు. తప్పులన్నీ అవతలివారివి, ఒప్పులన్నీ మావి అనే దృక్కోణం నుంచే కథనాలన్నీ తయారు కావచ్చు. సత్యం రెండు పక్షాల లోనూ కాకుండా మధ్యలో ఎక్కడో ఉండవచ్చు. కాని గుర్తించదగిన విషయాలు రెండు: పోలీసులు స్పష్టంగా అధికారపక్షం తరఫున, అధికార పక్ష ప్రయోజనాల కోసం పని చేశారు; “రేపు అధికారంలోకి వస్తాం, మీ పేర్లన్నీ రాసి పెట్టుకుంటాం, మీ సంగతి చూస్తాం జాగ్రత్త” అని అరెస్టవుతున్న ప్రతిపక్ష నాయకులు అన్నారు. అంటే, రెండు వైపులా చట్టం మీద, చట్టబద్ధ పాలన మీద గౌరవం లేదు. పోలీసు వ్యవస్థ అంటే అధికారంలో ఎవరు ఉన్నా తటస్థంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం చట్టబద్ధంగా ప్రజల కోసం పని చేయాలనే ఆలోచన పోలీసులకు ఎలాగూ లేదు. రాజకీయ పక్షాలకు కూడా లేదు. 

“ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగు దేశం, ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ – గద్దె మీద ఎవరు కూచున్నా ప్రజలకు పౌరహక్కులు లేవు, పోలీసులకు దౌర్జన్య హక్కులున్నాయి. పాలకులకు సొంత ప్రయోజనాలు నెరవేర్చే సేనగా మారింది ప్రజల కట్టే పన్నులతో నడిచే పోలీసు వ్యవస్థ!.”

ఒకవైపు ఈ రాజకీయ ఘర్షణ సాగుతుండగా, మరొకవైపు పోలీసు రాజ్యానికి, దుర్మార్గానికి, చట్టవ్యతిరేక ప్రవర్తనకూ మరొక ఉదాహరణ బైటపడింది. అది ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగ మరణం సందర్భంలో. ఎప్పటినుంచో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని, ఔట్ సోర్సింగ్ పద్ధతికి స్వస్తి చెప్పి, ప్రభుత్వోద్యోగులుగా గుర్తిస్తామని అన్ని రాజకీయ పక్షాలూ చెపుతున్నప్పటికీ దశాబ్దాలుగా అనేక ఉద్యోగాలు ఔట్ సోర్సింగ్ పద్ధతిలోనే కొనసాగుతున్నాయి. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు అధికార, ప్రతిపక్ష శాసనసభ్యులవి, అధికారులవి, సంపన్నులవి. ఇటీవలి కాలంలో అధికార, సంపన్న వర్గాలకు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ అనేది లాభదాయకమైన వృత్తిగా మారింది. ప్రతి ప్రభుత్వ కార్యాలయానికీ, శాఖకూ, పనికీ చిన్నవో పెద్దవో ఔట్ సోర్సింగ్ అవసరాలు ఉండడం, లేదా అధికారులే స్వయంగా కల్పించడం, ఒక అధికార, సంపన్న వ్యక్తికి ఆ ఏజెన్సీ అప్పగించడం జరుగుతున్నది. ఈ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు అటు ప్రభుత్వానికి చేసే సేవ ఏమీ లేదు, ఇటు ఉద్యోగానికి పెట్టుకునే సిబ్బంది కనీస అవసరాలు చూసే పనీ లేదు. ముఠా మేస్త్రీల లాగ తమ కింది మనుషులను ఆ ఉద్యోగాలలో ప్రవేశపెట్టి, ఆ ఉద్యోగుల కడుపు కొట్టి, వారికి ప్రభుత్వం ఇచ్చే జీతభత్యాలలో గణనీయమైన భాగం తాము కైంకర్యం చేయడమే వారి పని. 

హైదరాబాద్ నగర జలమండలి లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీ ఇస్తున్న జీతం రు. 13,500. ప్రభుత్వమే ప్రకటించిన కనీస వేతనాల కన్నా తక్కువ. అది కూడా మూడు నెలలుగా ఇవ్వడం లేదు. ఈ ఉద్యోగంలో మీటర్ రీడర్లుగా ఉన్నవారు ఆ అతి తక్కువ జీతం కూడా అందక ఆకలిచావుల వైపు, ఆత్మహత్యల వైపు, గుండెపోటు మరణాల వైపు నెట్టబడుతున్నారు. అంతకుముందురోజే శ్రీహరి అనే సహోద్యోగి మరణం తర్వాత ఫతేనగర్ బస్తీలో కిరణ్ అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి గుండెపోటుతో మరణించాడనే వార్త సంచలనం కలిగించింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఇప్పటికైనా పరిష్కరించాలని, ప్రభుత్వం బాధ్యత పడాలని, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను నియంత్రించాలని ఆందోళనలు మొదలయ్యాయి. ఇద్దరు చిన్నారి ఆడపిల్లలతో, దిక్కుతోచని స్థితిలో ఉన్న కిరణ్ భార్యకు సహాయం అందించాలని సానుభూతి పెల్లుబికింది. నష్టపరిహారానికి, భవిష్యత్తు భద్రతకు జలమండలి, ప్రభుత్వం బాధ్యత పడాలని ఆందోళన మొదలయింది. 

మృతుడి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేసిన సామాజిక కార్యకర్త పృథ్వీరాజ్, పరామర్శించడానికి వెళ్లి మృతదేహం పక్కన ఉన్నప్పుడు, అర్ధరాత్రి వేళ పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చొరబడి, మృతదేహం ఉన్న ఫ్రీజర్ కదిలిపోయేలా హడావుడి చేసి, పృథ్వీరాజ్ ను గొరగొర లాగుతూ తీసుకుపోయారు. పరామర్శకు వచ్చి, తమకు న్యాయం జరగాలని కోరినందుకు ఇటువంటి దాడా అని పోలీసుల దాడిని అడ్డుకోవాలని ప్రయత్నించిన మృతుడి భార్య మీద కూడా పోలీసులు నిర్దాక్షిణ్యంగా చెయ్యి చేసుకున్నారు. తోపులాటలో ఆమె గాజులు పగిలి చేతులు రక్తమండలాలయ్యాయి. మృతదేహం పక్కనుంచి మనుషులను లాక్కుపోవడం, మృతదేహం పక్కన ఉండగా భార్య మీద దౌర్జన్యం చేయడం ఎంత కర్కోటక పాలనల్లో కూడా జరిగి ఉండదు. 

నష్టపరిహారం హామీ దొరికేవరకూ, ప్రభుత్వం ఏమి సహాయం చేస్తుందో ప్రకటించేవరకూ అంత్యక్రియలు చేయబోమని మర్నాడు బస్తీవాసులు మొండికేశారు. ఆ బస్తీలోకి రాకపోకలు లేకుండా చక్రబంధం చేసిన పోలీసులు బస్తీవాసుల ఆందోళన కవర్ చేయడానికి వెళ్లిన తొలివెలుగు జర్నలిస్టు రఘు మీద కూడా దౌర్జన్యం చేసి, అరెస్టు చేసి, బైటికి తోసుకుపోయారు. ఒక బస్తీవాసి తొలివెలుగు ఛానల్ తో అన్నట్టు పోలీసులు “దాడి జేసుట్ల, అరెస్టు జేసుట్ల” చాలా బాగా పని చేశారు!   

 “ప్రపంచ బ్యాంకు ఆదేశాల పాలన ప్రారంభించిన చంద్రబాబు నాయుడు మనిషిని చంపితే త్వరిత పదోన్నతి పథకం, నగదు బహుమానం పథకం ప్రవేశపెట్టి పోలీసులను కిరాయి హంతకుల స్థాయికి దిగజార్చాడు. విప్లవోద్యమ సానుభూతిపరులను హత్య చేయడానికి ప్రైవేటు సైన్యాలను ఏర్పాటు చేసి, ఆ హంతక ముఠాలకు లొంగి ఉండే, లేదా సహకరించే బాధ్యత పోలీసులకు కల్పించాడు. ఆ పోలీసు రాజ్యమే కొనసాగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కూడా అనేక రకాల హింసలనూ, వేధింపులనూ భరించవలసి వచ్చింది.”

నిరసన తెలిపిన ఒక ప్రతిపక్ష పార్టీతో, విషాదకర మరణం మీద ఆందోళన చేస్తున్న సామాజిక కార్యకర్తతో, వార్తాసేకరణ చేస్తున్న జర్నలిస్టుతో – ఎవరితోనైనా మాట్లాడేది, లేదా చేతలతో చెప్పేది పోలీసులే. ప్రభుత్వమూ, ప్రభుత్వ శాఖలూ, ప్రజాస్వామిక చర్చా సంప్రదాయాలూ ఏమీ లేవు. ఉండవు. ఇదే ప్రజాస్వామిక పునరుద్ధరణ! అయితే ఇలా పోలీసు రాజ్యం సాగడం 2026 నాటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రమే కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోగాని, తెలంగాణలో గాని ఎప్పుడూ ప్రభుత్వానికి ప్రజలతో ప్రజాస్వామికంగా ప్రవర్తించే అలవాటు లేదు. పోలీసు రాజ్యం కన్నా, దౌర్జన్యం కన్నా భిన్నమైన సామరస్యపూర్వక ధోరణిని ప్రదర్శించే అలవాటు లేదు. ఈ సందర్భంలో లోతుగా ఆలోచించవలసిన అంశం ఇది.  

భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పోలీసు వ్యవస్థను వలస పాలకులు నిర్మించారు. అప్పుడు వాళ్లు పరాయి పాలకులు గనుక వాళ్ల దృష్టిలో భారత ప్రజలందరూ శత్రువులే. కనుక తమ ఉద్యోగులైన పోలీసులతో, “ఎదురుగా ఉన్నవారెవరైనా మీ శత్రువులే అనుకోండి. వాళ్ల మీద దౌర్జన్యం చేయండి, హింసించండి, చంపండి, మా రక్షణ మీ బాధ్యత” అని శిక్షణ ఇచ్చారు. వలస వ్యతిరేక ప్రజా ఉద్యమాలన్నిటి మీద భయానకమైన పోలీసు దౌర్జన్యం అందువల్లనే సాగింది. వలసానంతర భారత ప్రభుత్వం కూడా ఆ పోలీసు శిక్షణను ఇసుమంత కూడా మార్చలేదు. రాజ్యాంగ ఆదర్శాలు ఏమైనప్పటికీ, ప్రాథమిక హక్కులకు హామీ ఉన్నప్పటికీ పోలీసులు చట్టాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడం కొనసాగించారు.  పాత రోజుల్లో లాగానే ప్రజలు, ముఖ్యంగా ప్రశ్నించే, నిరసన తెలిపే ప్రజలు తమ పాలకులకు శత్రువులు గనుక, ఆ పాలకుల ఉద్యోగులుగా తమకూ శత్రువులే అని పోలీసులు భావించారు. ప్రజల మీద అనేక రకాల దౌర్జన్యాలు సాగించారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా ఉద్యమాలు, ముఖ్యంగా విప్లవోద్యమం ప్రారంభమయ్యాక, పాలకులు పోలీసులకు బారాఖూన్ మాఫ్ ఇబ్బడి ముబ్బడి అధికారాలు ఇచ్చారు. ప్రజలకు భావ ప్రకటనా స్వేచ్ఛ లేదు, సమావేశాల మీద ఆంక్షలు. సమాజంలో పోలీసు అంటే భయపడే స్థితి. పోలీసు స్టేషన్లలో మనిషి అంటే, పౌరులంటే గౌరవం లేదు. చిత్రహింసలు, ఎన్ కౌంటర్ హత్యలు యథావిధిగా సాగిపోయాయి. ప్రపంచ బ్యాంకు ఆదేశాల పాలన ప్రారంభించిన చంద్రబాబు నాయుడు మనిషిని చంపితే త్వరిత పదోన్నతి పథకం, నగదు బహుమానం పథకం ప్రవేశపెట్టి పోలీసులను కిరాయి హంతకుల స్థాయికి దిగజార్చాడు. విప్లవోద్యమ సానుభూతిపరులను హత్య చేయడానికి ప్రైవేటు సైన్యాలను ఏర్పాటు చేసి, ఆ హంతక ముఠాలకు లొంగి ఉండే, లేదా సహకరించే బాధ్యత పోలీసులకు కల్పించాడు. ఆ పోలీసు రాజ్యమే కొనసాగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కూడా అనేక రకాల హింసలనూ, వేధింపులనూ భరించవలసి వచ్చింది. 

అటువంటి స్థితిలో రాష్ట్ర విభజన జరిగి, కొత్త రాష్ట్రం ఏర్పడింది. పోలీసులను అదుపు చేసి, ప్రజల హక్కులను, రాజ్యాంగాన్ని గౌరవించి, కొత్త ప్రజాస్వామిక సంప్రదాయాలు ప్రారంభించగల అవకాశం వచ్చింది. కాని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం గత ప్రభుత్వాల కన్నా రెండాకులు ఎక్కువ చదివినట్టుగా పోలీసు రాజ్యాన్ని బలోపేతం చేసింది. సభలు లేవు. మాట్లాడితే అరెస్టు. బెదిరింపు. ఎప్పుడో ఇరవై ఏళ్ల కింద పోలీసులు ఎన్ కౌంటర్ పేరుతో చంపేసిన తమ్ముడిని తలచుకోవడానికి తన ఇంటికి నలుగురిని పిలిచిన అన్నను అరెస్టు చేశారు. పుస్తకావిష్కరణ సభలను కూడా భగ్నం చేశారు. విద్యా పరిరక్షణ ప్రదర్శన మీద దాడులు చేశారు. ముఖ్యమంత్రి ఏ ఊరికైనా వెళ్తున్నాడంటే ఆ ఊళ్లో ప్రజాసంఘాల వారందరినీ ముందే అరెస్టు చేశారు. నిరుద్యోగులను నిర్బంధ శిబిరాల పాలు చేశారు. ఆ అప్రజాస్వామిక పోలీసు రాజ్యపు ఉక్కపోతలో మగ్గిపోయిన ప్రజలు, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనే మాట  విని ఆశ పడ్డారు. రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఆ పోలీసు రాజ్యాన్ని మరింత పెంచిందని ప్రతి రోజూ చూపుతున్నది. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని చెప్పే అవకాశం బిఆర్ఎస్ ది!  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *