అన్ని వర్గాల ఆర్థిక స్వావలంబన కోసం కృషి
•మంథని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
:రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథని, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగిస్తూ మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపా లనేదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. బిఆర్‌ఎస్ నియంతృత్వ పాలనను బద్దలు కొట్టి, గత దశాబ్ద కాలంగా చేయని అభివృద్ధిని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏడాదిలోనే చూసి చూపామని అన్నారు. రైతుల సంక్షేమం, విద్యారం గానికి ప్రాధాన్యతనిస్తూ, వైద్య రంగాన్ని ప్రక్షాళన చేస్తూ, పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణను తీర్చిదిద్దుతూ, వేలకోట్లతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. శాంతి భద్రతలపై పర్యవేక్షణ పెంచి, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తూ, పల్లెల్లో రహదారులకు మహర్దశనిస్తూ, సంక్షేమ పథకాలను అందిస్తూ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఏడాది అవుతున్న తరుణంలో ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ప్రజా పాలన అందిస్తున్నామని అన్నారు. చదువుకున్న యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా, మహిళలు ఆర్థిక స్వావలంబన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
ఒక్క ఏడాదిలో మంథనికి రూ.1500 కోట్ల నిధులు
రూ.571 కోట్లతో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, రూ.300 కోట్లతో అడవి సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, 162 కోట్లతో మంథనికి నాలుగు లైన్ల రింగ్ రోడ్డు, రూ.125 కోట్లతో మంథని-శివారం మధ్య గోదావరి నదిపై హై లెవెల్ వంతెన, రూ.22కోట్లతో మంథనిలో నూతనంగా 50 పడకల దవాఖాన, రూ.7 కోట్లతో రామగిరి ఖిల్లా పర్యాటక కేంద్రం, రూ.2.5 కోట్లతో గుంజపడగలో నూతన ఆరోగ్య కేంద్రం, ఇంకా అనేక బీటి, సీసీ రోడ్లు,సైడ్ లైన్ల నిర్మాణాలు, నూతన సబ్ స్టేషన్ల నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. సీఎం సహాయ నిధి, ఎల్‌ఓసిల కింద ఈ ఏడాది పాలనలో రూ.60 కోట్లతో సుమారు 1700 మంథని ప్రాంత ప్రజలకు వైద్యసాయం అందించామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో మంథని నియోజకవర్గాన్ని అందరి అంచనాలకు మించి అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే అగ్రగామిగా అభివృద్ధి పథంలో నిలుపుతూ మంథని రూపు రేఖలు మారేలా చూస్తానని, మంథని ప్రాంత ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అహర్నిశలు వారి అభివృద్ధి కోసం పాటుపడతానని, కార్యకర్తలను కంటికి రెప్పగా కాపాడుకుంటానని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు.