- మొదటి నుంచీ దళితులంటే బిఆర్‌ఎస్‌కు చిన్నచూపే….
- ఎమ్మెల్సీ విజయశాంతి ఫైర్
మలి దశ తెలంగాణ ఉద్యమం నుండి కూడా బిఆర్‌ఎస్ పార్టీకి, నాయకులకు దళితులు అంటే చిన్న చూపే అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఎం.విజయశాంతి అలియాస్ రాములమ్మ మండిపడ్డారు. ఆమె శుక్రవారం సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా దళితుడినే చేస్తానని చెప్పిన కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేయకుండా వారినే ఫస్టు మోసం చేశాడన్నారు. ఆనాటి స్టేషన్‌ఘణపూర్ శాసనసభ్యుడు తాటికొండ రాజయ్యని డిప్యూటీ సిఎంగా చేసి కొద్ది రోజులలోనే ఆయన మీద ఏదో ఆరోపణలు వొచ్చాయని తొలగించాడన్నారు. ఇంతవరకు ఆ ఆరోపణల గురించి దళితులకు సమాధానమే చెప్పలేదన్నారు.
ప్రభుత్వానికి నాయకుడు ముఖ్యమంత్రి అయితే, శాసన సభకు అధిపతి స్పీకర్ అవుతారన్నారు. అటువంటి స్పీకర్‌ని ఏక వచనంతో సంబోధించిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డిని సభ నుండి సస్పెండ్ చేస్తే బిఆర్‌ఎస్ గగ్గోలు పెడుతుందనీ, ఆందోళనలు, నిరసనలు చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీ స్పీకర్ పట్ల అమర్యాదగా, అగౌరవంగా మాట్లాడిన జగదీష్‌రెడ్డిని మందలించాల్సింది పోయి కేటీఆర్ ఆయనకు వత్తాసు పలుకుతున్నాడన్నారు. దళిత స్పీకర్ అయిన గడ్డం ప్రసాద్‌ని అవమానించి, తిరిగి మరలా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్. అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేయడం మరీ విడ్డూరంగా ఉందన్నారు.
జగదీష్‌రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ కేటీఆర్ అమరణ నిరాహార దీక్షకు పూనుకుంటా అనడం హాస్యాస్పదంగా ఉందనీ, దళితులను, గిరిజనులను, మహిళలను, బిసిలను చిన్నచూపు చూడడం, అవమానించడం మీకు(బిఆర్‌ఎస్ పార్టీ నేతలకు) వెన్నతో పెట్టిన విద్యనే కదా? ప్రజలు తిరస్కరించి ఫామ్ హౌస్‌లో కూర్చోబెట్టినా కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ఇంకా అహంకారం తగ్గలేదన్నారు.
సభలో ఏవిధంగా ఉండాలి, సభా వేదికపై ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసి కూడా ఇలా చేస్తున్నారంటే ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగానే చేస్తున్నారన్నారు. ఇదే బిఆర్‌ఎస్ పార్టీ గతంలో శాసనమండలి ఛైర్మన్ మీద కాగితాలు పడేసారనీ, ఇద్దరు సభ్యులను తొలగించారు, బర్తరఫ్ చేశారన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారనీ, ఇటువంటి నిరసనలు చేయడం మంచిది కాదనీ, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంతకన్నా సరైంది కాదనీ ఆ పోస్టులో ఎమ్మెల్సీ, క్రాగెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు.