– ఐదు నెలలుగా బాధపడిన బాలుడు
– పరీక్షలలో అరుదైన వ్యాధి గుర్తింపు
– కొత్త జీవితం ప్రసాదించిన ‘కేర్’ వైద్యులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : హయత్‌నగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు శివ దుర్గా రెడ్డి దాదాపు ఐదు నెలలపాటు తీవ్రమైన వాంతులు, బలహీనత, ఆహారం తీసుకోలేకపోవడం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడ్డాడు. కుటుంబ సభ్యులు అనేక హాస్పిటల్స్ తిరిగి పలు పరీక్షలు చేయించినా సమస్య ఏమిటో వైద్యులు గుర్తించలేకపోయారు. రోజురోజుకీ బాలుడి ఆరోగ్యం క్షీణిస్తుండడంతో కుటుంబం ఆందోళనకు గురైంది. చివరికి కాలనీలోని పరిచయాల ద్వారా కుటుంబ సభ్యులు కేర్ హాస్పిటల్స్, మలక్‌పేట్‌లోని సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ రోబోటిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ భూపతి రాజేంద్రప్రసాద్‌ను సంప్రదించారు. బాలుడి లక్షణాలను పూర్తిగా పరిశీలించిన డాక్టర్ భూపతి ఇది సాధారణ గ్యాస్ట్రిక్ సమస్య కాదని సుపీరియర్ మెసెంటరిక్ ఆర్టరీ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి కావచ్చని అనుమానించారు. మనం తిన్న ఆహారం చిన్న ప్రేగుల ద్వారా ముందుకు సాగుతుంది. కానీ ఎసఎంఏ సిండ్రోమ్‌లో చిన్న ప్రేగులోని ఒక భాగం రెండు ప్రధాన రక్తనాళాల మధ్య ఇరుక్కుపోతుంది. దీనివల్ల ఆహారం సరిగా వెళ్లకపోవడంతో తరచుగా వాంతులు, పొట్ట నొప్పి, బలహీనత, బరువు తగ్గడం, జీర్ణ సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు సాధారణ గ్యాస్ లేదా అజీర్ణ సమస్యల లాగా కనిపించడంతో చాలాసార్లు ఈ వ్యాధి గుర్తించలేరని తెలిపారు. నిర్ధారణ కోసం సీఈసీటీ అబ్డొమెన్ స్కాన్ చేయించగా మొదటి రిపోర్టులో అన్నీ సాధారణంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే డాక్టర్ భూపతి అనుమానం తొలగకపోవడంతో స్వయంగా స్కాన్ ఫిల్మ్స్‌ను పరిశీలించి రేడియాలజిస్టులతో చర్చించారు. అనంతరం మళ్లీ పరిశీలించగా ఎస్ఎంఏ సిండ్రోమ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. తర్వాత బాలుడికి లాపరోస్కోపిక్ డ్యూడెనోజెజునోస్టమీ అనే అత్యాధునిక మినిమల్ ఇన్వేసివ్ శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ శస్త్రచికిత్సలో ఇరుక్కుపోయిన చిన్న ప్రేగు భాగాన్ని దాటేలా కొత్త మార్గం ఏర్పాటు చేస్తారు. ఆపరేషన్ విజయవంతమై బాలుడు కేవలం మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని సాధారణంగా ఆహారం తీసుకుంటూ తన రోజువారీ జీవితాన్ని తిరిగి ప్రారంభించాడు.
సాధారణ నిర్ధారణలకే పరిమితం కాకూడదు : డాక్టర్ భూపతి
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





