ఇది మహిళా శక్తి మహోత్సవం

– మహిళా వారోత్సవాలను జయప్రదం చేయాలి
– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 25: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలైన అక్కచెల్లెమ్మలకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మహిళా వారోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాలు కేవలం ఒక కార్యక్రమం కాదని, మహిళా శక్తి సామర్థ్యాలను, ఆత్మవిశ్వాసాన్ని, సాధికారతను ప్రపంచానికి చాటి చెప్పే మహోత్సవమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజా భవన్ నుంచి వీడియో సందేశం విడుదల చేశారు. ఒకప్పుడు చిన్న పొదుపులతో ప్రారంభమైన స్వయంసహాయక సంఘాలు నేడు తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాక పారిశ్రామికవేత్తలుగా, ఉపాధి సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతోందని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ ఆర్థిక స్వావలంబనకు బలమైన తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు. క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్లు, సెంట్రింగ్ యూనిట్లు, ఇటుకల తయారీ కేంద్రాలు వంటి రంగాల్లో మహిళలు ముందంజలో నిలుస్తున్నారని చెప్పారు. మహిళలు ఆదాయ వనరులు సృష్టించుకునే దిశగా ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనిస్తోందన్నారు. చెట్ల కింద సమావేశాలు నిర్వహించే పరిస్థితి నుంచి గ్రామీణ మహిళలకు గౌరవప్రదమైన వేదికలు కల్పించే దిశగా ఎనిమిది వేల మహిళా భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. ఇది మహిళల పట్ల ఇందిరమ్మ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. రెండున్నరేళ్ల ప్రజా పాలన ప్రయాణాన్ని అవలోకనం చేసుకునే సందర్భంగా మహిళా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కోటి చీరల పంపిణీతోపాటు రూ.60 వేల కోట్లకు పైగా బ్యాంక్ లింకేజీ ద్వారా మహిళా సంఘాలకు ఆర్థిక బలం అందిస్తున్నామని వెల్లడించారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్న మహిళా సంఘాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఆడబిడ్డ బలపడితే కుటుంబం బలపడుతుంది.. కుటుంబం బలపడితే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ మహిళా వారోత్సవాలను ప్రతి మహిళా తన ఆత్మగౌరవ పండుగగా భావించి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *