– హరీష్ రావువి పగటి కలలు
– ఫ్యూచర్ సిటీపై బాధ్యాతారాహిత్య ప్రకటన
– మండిపడ్డ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. ఇది బ్లాక్ మెయిల్ రాజకీయమని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా.. వద్దా అనేది చెప్పాలన్నారు. ఇలా చేస్తే పెట్టుబడులు రావు.. పక్క రాష్ట్రాలకు వెళ్తాయి.. ఫ్యూచర్ సిటీలో కాలుష్యకారక పరిశ్రమలు ఉండవు.. దాన్ని రద్దు చేస్తామనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటోందని ఆరోపించారు. ఆ పార్టీ బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు యత్నిస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే ఆ పార్టీ నేతలు విమర్శలే ప్రధానంగా ముందుకెళ్తున్నారని అన్నారు. మెట్రోను విస్తరించాలనుకుంటే అడ్డుకుంటున్నారంటూ చీప్ పాలిటిక్స్, బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేయొద్దని హితవు పలికారు. ఎక్కడ అభివృద్ధి చేస్తే అక్కడ ఆపుతామంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు కోరుకున్నది తప్పకుండా చేసి తీరుతామన్నారు. వేలాది కోట్లు పెడతామని మల్టీ నేషనల్ కంపెనీలు వస్తున్నాయని, ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే పెట్టుబడిదారులు భయపడరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ తెచ్చిన మెట్రోనే ముందుకు సాగిందని మంత్రి తెలిపారు. తాము ఎన్ని కిలోమీటర్లు తెచ్చామో అన్ని కిలోమీటర్లు మాత్రమే మెట్రో వచ్చిందని చెప్పారు. పెరిగిన జనాభాకనుగుణంగా మెట్రో విస్తరించకూడదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తామని మాజీ మంత్రి హరీశ్ రావు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని, అయినా ఆ పార్టీ నేతల బుద్ధి మారడం లేదని వ్యాఖ్యానించారు. నగరాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి తెలిపారు. ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రణాళికలు రూపొందించామని, ఇతర నగరాల అభివృద్ధిపై అధ్యయనం చేశామని వివరించారు. రాబోయే తరాలకు ఉపయోగపడే కార్యాచరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఓటమితో ఎదురైన నిరాశ నుంచి ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నారన్నారు. బుల్లెట్ ట్రైన్ తెస్తామంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వొద్దా అని అడిగారు. స్వార్థ రాజకీయాలే తమకి ముఖ్యమని బీఆరఎస్ నేతలు భావిస్తున్నారని మంత్రి శ్రీధర్బాబు విరుచుకుపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




