తెలుగు సమాజ చరిత్రలో ఒక అసాధారణమైన ప్రయోగంగా నిలిచిన చర్చల ప్రక్రియను ఎంతమాత్రమూ మరిచిపోవడానికి వీలులేదు. గతాన్ని మరిచిపోయినవాళ్లు, గతం నుంచి పాఠాలు నేర్చుకోలేని వాళ్లు భవిష్యత్తును కూడా పోగొట్టుకుంటారు
ఐదున్నర దశాబ్దాల విప్లవోద్యమ చరిత్రలో మొదటిసారిగా, అసాధారణమైన, అపూర్వమైన రీతిలో ప్రభుత్వానికీ విప్లవ పార్టీల ప్రతినిధులకూ మధ్య చర్చలు జరిగి సరిగ్గా ఇరవై సంవత్సరాలు. అయినవాటికీ కానివాటికీ కూడా తప్పనిసరి తద్దినాలు పెట్టే ప్రచార సాధనాలు ఈ ఇరవై ఏళ్ల జ్ఞాపకాన్ని మాత్రం ఎందువల్లనో తలచుకోలేదు. చర్చల సందర్భంలో ఆసక్తితో గమనించినవాళ్లు, ఏదో ఒక స్థాయిలో తమ వంతు పాత్ర నిర్వహించినవాళ్లు కూడ తలచుకున్నట్టు లేరు. బహుశా సరిగ్గా అక్టోబర్ 12న ప్రొ. జి ఎన్ సాయిబాబా మరణం కలిగించిన విషాదం ఆ జ్ఞాపకాలకు అడ్డుపడి ఉంటుంది.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాల్లో ఒకటిగా విప్లవకారులతో చర్చలు అంశం ఉండడం, 2004 మే లో కాంగ్రెస్ అధికారానికి వచ్చినప్పటి నుంచీ జరిగిన ప్రయత్నాలు, సన్నాహక సంభాషణలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, చివరికి ఇరువైపులా కాల్పుల విరమణ ఒప్పందం ఫలితంగా 2004 అక్టోబర్ 11న నల్లమల అడవుల నుంచి బయలుదేరిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు లెనినిస్టు) పీపుల్స్ వార్ నాయకులు రామకృష్ణ, సుధాకర్, గణేష్, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు లెనినిస్టు) జనశక్తి నాయకులు అమర్, రియాజ్ లు, దాదాపు 30 మంది గెరిల్లా సైనికుల రక్షణలో అక్టోబర్ 12న గుత్తికొండ బిలం దగ్గర పెద్ద బహిరంగ సభ నిర్వహించి అక్టోబర్ 13న హైదరాబాద్ చేరారు. ప్రభుత్వం వారికి బేగంపేటలోని మంజీరా అతిథి గృహంలో వసతి ఏర్పాటు చేసింది.
తమ పార్టీ సెప్టెంబర్ మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియాతో ఐక్యమై, కొత్తగా భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఏర్పడిరదని మంజీర గెస్ట్ హౌజ్ లోనే రామకృష్ణ ప్రకటించాడు. అక్టోబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోం మంత్రి జానారెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందానికీ, రామకృష్ణ నాయకత్వాన విప్లవ పార్టీల ప్రతినిధుల బృందానికీ మధ్య మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో చర్చలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 18 వరకూ వరుసగా నాలుగు రోజులు చర్చలు జరిగాయి. పదకొండు అంశాల ఎజెండాలో కేవలం రెండే అంశాలు %-% భూమి సమస్య, ప్రజాస్వామిక హక్కులు – చర్చకు వచ్చాయి. మిగిలిన అంశాలు చర్చించడానికి మరొక విడత సమావేశం కావాలని, రెండో విడత సమావేశం నవంబర్ 16న మొదలవుతుందని అవగాహనతో మొదటి విడత ముగిసింది. అక్టోబర్ 19ననో, 20ననో విప్లవోద్యమ నాయకులు మళ్లీ అడవికి వెళ్లిపోయారు.
చర్చలు తెలుగు సమాజ చరిత్రలో, ముఖ్యంగా ప్రజా ఉద్యమానికీ ప్రభుత్వానికీ మధ్య సంభాషణలో ఒక అపూర్వమైన ఘట్టం. ప్రభుత్వాలు ఎంత బలహీనమైనవో, ప్రజా ఉద్యమాలు ఎంత బలమైనవో ప్రదర్శించిన ప్రక్రియ. ఆ వారం రోజుల్లో విప్లవకారులు వేలాది మందిని కలిశారు, వేలాది మంది హృదయాలను తట్టారు. విప్లవకారులు ఆ వారం రోజుల్లో ప్రతిరోజూ ఒకటో రెండో ప్రజా సమూహాలతో సంభాషణకు కూచుని, దళితులు,ఆదివాసులు, ముస్లింలు, బహుజనులు, స్త్రీలు, విద్యార్థులు,కార్మికులు, రైతులు, నిరుద్యోగ యువకులు వంటి అనేక సమూహాలతో మాట్లాడారు. నిజానికి వారు మాట్లాడడం కాదు,విన్నారు. తమ గురించి ఆ సమూహం ఏమనుకుంటున్నదో, ఆ సమూహానికి తమ మీద ఏ ఫిర్యాదులున్నాయో….
కాని నవంబర్ మొదటి వారం నుంచే ప్రభుత్వం వైపు నుంచి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం మొదలయింది. అమరవీరుల సంస్మరణ సభలకు అనుమతి ఇవ్వకపోవడం, సభలను భగ్నం చేయడం, స్తూపాలను కూలగొట్టడం, పులిచింతల ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమం మీద నిర్బంధం విచ్చలవిడిగా సాగాయి. చివరికి బూటకపు ఎన్ కౌంటర్లు కూడ మొదలయ్యాయి. 2005 జనవరి 6న మొదలైన ఎన్ కౌంటర్ హత్యల పరంపరలో, జనవరి 18 వరకే, అంటే 14 రోజుల్లోనే 16 మంది విప్లవ కార్యకర్తలను పోలీసులు చంపివేశారు. ఇక చర్చలు జరిగే అవకాశం లేదని, కాల్పుల విరమణ ఒప్పందం నుంచి తాము కూడా వైదొలగక తప్పడం లేదని విప్లవ పార్టీల నాయకులు ప్రకటించారు.
అలా తెలుగు సమాజంలో శాంతి, ప్రజాస్వామ్యం వికసించడం కోసం వచ్చిన ఏకైక అవకాశాన్ని ప్రభుత్వం చేజేతులా చిదిమివేసింది.
తర్వాత ఇరవై సంవత్సరాలలో అధికారానికి వచ్చిన అన్ని పాలకపక్షాలూ అంతులేని నిర్బంధకాండను ప్రయోగిస్తూ, అక్షరాలా పోలీసు రాజ్యాన్ని నెలకొల్పి సమాజంలో అశాంతినీ, అప్రజాస్వామ్యాన్నీ పెంచి పోషించడానికే ప్రయత్నిస్తున్నాయి. మెక్సికో, కొలంబియా, నేపాల్, శ్రీలంక వంటి దేశాలలో సాయుధ విప్లవకారులకూ ఆయా ప్రభుత్వాలకూ మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చలు, ఈశాన్య భారత జాతి ఉద్యమాల సాయుధ సంస్థలతో భారత ప్రభుత్వం జరిపిన చర్చలు వంటి ఎన్నో ఉదాహరణల నుంచి పాఠాలు తీసుకుని, చర్చలను కొనసాగించవలసి ఉండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం చర్చా మార్గం కన్నా హింసా మార్గాన్ని, దమన నీతిని మాత్రమే ఎంచుకుంది. ఉద్యమకారులను భౌతికంగా హత్య చేయడం ద్వారా ఆ భావాలు లేకుండా చేయగలమనుకుంది. ఆకలి, అసమానత, సామాజిక అన్యాయం కొనసాగినన్ని రోజులూ ఒకరు కాకపోతే మరొకరు ఉద్యమ మార్గం చేపడతారనే చారిత్రక సత్యాన్ని విస్మరించి ఇంకా భౌతిక నిర్మూలన పగటి కలలు కంటున్నది. తెలుగు సమాజ చరిత్రలో ఒక అసాధారణమైన ప్రయోగంగా నిలిచిన చర్చల ప్రక్రియను ఎంతమాత్రమూ మరిచిపోవడానికి వీలులేదు. గతాన్ని మరిచిపోయినవాళ్లు, గతం నుంచి పాఠాలు నేర్చుకోలేని వాళ్లు భవిష్యత్తును కూడా పోగొట్టుకుంటారు.
అసలు చర్చల భావన 1996 జూలైలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం ఎన్ రావు ఇచ్చిన తీర్పుతో మొదలయింది. అప్పటికి టాడా (టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ ఆక్టివిటీస్ ప్రివెన్షన్ ఆక్ట్) కింద జైలులో ఉండిన పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావు, మోడెం బాలకృష్ణల పిటిషన్ మీద తీర్పులో ఆయన ‘‘వామపక్ష తీవ్రవాదాన్ని ప్రభుత్వం ఒక సమస్యగా చూస్తూ ఉండగా, నిరాదరణకు గురవుతున్న ప్రజలు అదే తమ సమస్యలకు పరిష్కారంగా చూడడం అంతకంతకూ ఎక్కువ అవుతున్నది. ఈ సందర్భంలో నక్సలైట్లు, పోలీసులతో సహా సమాజంలోని అన్ని సమూహాల ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా ప్రాతినిధ్య స్వభావం ఉన్న శాంతి కమిషన్ ఏర్పాటు చేసి, దానికి పూర్తి రాజ్య అధికారం, ఆమోదం ఇచ్చి చర్చలు జరిపినప్పుడు మాత్రమే పోలీసుల ఎన్ కౌంటర్లు, నక్సలైట్ల హింస తగ్గుముఖం పడతాయని భావిస్తున్నాం. అలా రూపొందిన శాంతియుత వాతావరణలో, శాశ్వత పరిష్కారాల కోసం ఒక అర్థవంతమైన అన్వేషణ సాగించడానికి వీలవుతుంది’’ అన్నారు.
ఆ సూచనను కార్యరూపంలోకి తేవడానికి ఎస్ ఆర్ శంకరన్ నాయకత్వంలో కమిటీ ఫర్ కన్సర్న్డ్ సిటిజన్స్ (సిసిసి) ఏర్పడి ప్రభుత్వాన్నీ, విప్లవ పార్టీనీ చర్చలకు సిద్ధం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. రహస్య అజ్ఞాత జీవితం గడుపుతున్న పీపుల్స్ వార్ అగ్రనాయకులను ఎస్ ఆర్ శంకరన్, పొత్తూరి వేంకటేశ్వర రావు వంటి పెద్దలు 1998 జనవరిలో కలిసి, వారిని చర్చలకు రావడానికి ఒప్పించారు. విప్లవ నాయకులతో జరిపిన చర్చల సారాంశాన్ని ప్రభుత్వాధినేతలకు 1998 ఏప్రిల్ లో వివరించి వారిని చర్చలకు ఒప్పించడానికి ప్రయత్నించారు. అలా చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడుతుండగానే ప్రభుత్వం పీపుల్స్ వార్ అగ్రనాయకులు నల్లా ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్ లను 1999 డిసెంబర్ 1న బెంగళూరులో పట్టుకుని, మర్నాడు కరీంనగర్ జిల్లా కొయ్యూరు అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగినట్టు కట్టుకథ అల్లి చంపేశారు. అది కొయ్యూరులోనే జరిగిందని భ్రమ కలిగించడానికి స్థానిక పశువుల కాపరి లక్ష్మీరాజంను కూడా వాళ్లతో పాటు చంపేశారు. మూడు నెలలకే 2000 మార్చ్ లో పీపుల్స్ వార్ అప్పటి హోమ్ మంత్రి ఎ మాధవరెడ్డిని చంపివేయగానే ప్రభుత్వం వెంటనే నక్సలైట్లతో చర్చలు జరుపుతానని ప్రకటించింది. సిసిసి తన ప్రయత్నాలను పునరుద్ధరించింది. అలా 2002లో చర్చలకు సానుకూలమైన వాతావరణాన్ని నిర్మించడానికి, విధివిధానాలు తయారుచేయడానికి తమ తరఫున మధ్యవర్తులుగా గద్దర్, వరవరరావు ల పేర్లు పీపుల్స్ వార్ సూచించింది. ప్రభుత్వం వారితో చర్చలు జరిపి, తాము రావడానికి అనువైన వాతావరణాన్ని కల్పించాలని కోరింది. 2002 జూన్ లో మూడుసార్లు మధ్యవర్తులకూ మంత్రులకూ మధ్య చర్చలు జరగగా, ప్రతిసారీ చర్చలకు ముందురోజు పోలీసులు ఎన్ కౌంటర్ హత్యలు చేసి, చర్చలకు విఘాతం కల్పించారు. దానితో మధ్యవర్తులు తాము ఈ చర్చల నుంచి విరమించుకుంటున్నామని ప్రకటించారు.
తర్వాత ఏడాదిన్నరకు తన మీద జరిగిన హత్యాప్రయత్నం సానుభూతిని ఉపయోగించుకుని గెలుద్దామనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు మధ్యంతర ఎన్నికలకు వెళ్లినప్పుడు, కాంగ్రెస్ ఆ ఎన్నికల వాగ్దానాలలో ‘నక్సలైట్లతో చర్చలు జరుపుతాము’ అనేదాన్ని భాగం చేసింది. అప్పటికే మళ్లీ ప్రయత్నిస్తున్న సిసిసి తో పాటు ప్రజాకవి కాళోజీ నాయకత్వాన పీస్ ఇనీషియేటివ్ కమిటీ అనే మరో ప్రయత్నం మొదలయింది. ఆంధ్రప్రదేశ్ పౌర సమాజమంతా అటువంటి శాంతి-ప్రజాసామ్యం చర్చలను కోరుకుంటున్నదనడానికి చిహ్నంగా రాష్ట్రవ్యాప్తంగా చర్చలకు అనుకూల సభలు, సమావేశాలు మొదలయ్యాయి. ఒక దినపత్రిక చర్చల మీద ప్రజాభిప్రాయాన్ని ఆహ్వానించి వందలాది మంది ఏమి కోరుకుంటున్నారో ప్రకటించింది. ఈ నేపథ్యంలో మే 2004లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం చర్చల దిశగా నడవక తప్పలేదు.
చర్చలు తెలుగు సమాజ చరిత్రలో, ముఖ్యంగా ప్రజా ఉద్యమానికీ ప్రభుత్వానికీ మధ్య సంభాషణలో ఒక అపూర్వమైన ఘట్టం. ప్రభుత్వాలు ఎంత బలహీనమైనవో, ప్రజా ఉద్యమాలు ఎంత బలమైనవో ప్రదర్శించిన ప్రక్రియ.
ఆ వారం రోజుల్లో విప్లవకారులు వేలాది మందిని కలిశారు, వేలాది మంది హృదయాలను తట్టారు. విప్లవకారులు ఆ వారం రోజుల్లో ప్రతిరోజూ ఒకటో రెండో ప్రజా సమూహాలతో సంభాషణకు కూచుని, దళితులు, ఆదివాసులు, ముస్లింలు, బహుజనులు, స్త్రీలు, విద్యార్థులు, కార్మికులు, రైతులు, నిరుద్యోగ యువకులు వంటి అనేక సమూహాలతో మాట్లాడారు. నిజానికి వారు మాట్లాడడం కాదు, విన్నారు. తమ గురించి ఆ సమూహం ఏమనుకుంటున్నదో, ఆ సమూహానికి తమ మీద ఏ ఫిర్యాదులున్నాయో, తాము ఏమి చేయాలని వారు కోరుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఆ వారం రోజుల్లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దగ్గరికి వచ్చిన సందర్శకుల కన్న మంజీర అతిథిగృహానికి వచ్చిన సందర్శకులే ఎక్కువని అప్పటి పత్రికలే రాశాయి. భార్యాభర్తల సమస్యల నుంచి భూమి సమస్యల దాకా వేలాది అభ్యర్థనలు, గోనె సంచుల నిండా అభ్యర్థనలు పరిష్కారం కోరుతూ విప్లవకారులకు అందాయి.
అదంతా మంజీర అతిథి గృహంలో కాగా, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం లోపల చర్చ జరిగిన రెండు అంశాలలోనూ విప్లవకారులు సవివరమైన సమాచారంతో, విశ్లేషణతో పత్రాలు ప్రవేశపెట్టారు. అత్యంత సూక్ష్మ వివరాలు కూడా చర్చకు పెట్టారు. ఎన్నో సంవత్సరాలు అడవిలో ఉంటూ, నిత్యనిర్బంధంలో పరుగు పెడుతూ, ప్రశాంతంగా కూచుని అధ్యయనం చేసే అవకాశాలు లేని విప్లవకారులేమో అంత పకడ్బందీగా పత్రాలు రాసుకుని, సకల వివరాలతో రాగా, కంప్యూటర్లూ, సకల సాధనాలూ, అంగబలమూ అర్థబలమూ అధికారమూ అవకాశాలూ ఉన్న ప్రభుత్వ ప్రతినిధులు మాత్రం ఏ సమాచారమూ లేక, ఏ వాదనా విశ్లేషణా లేక మౌన ఫ్రేక్షకులైపోయారు. ఎజెండా ముందే నిర్ణయమైనప్పటికీ తమ పక్షాన ఒక పత్రమో, వాదనో లేకుండా ఉట్టి చేతులతో వచ్చారు. చరిత్ర నిర్మాతలైన ప్రజల పక్షాన, భవిష్యత్తు పక్షాన నిలబడినవాళ్లు అవకాశాల లేమిలోనే అవకాశాలు ఎట్లా సృష్టించుకోగలరో విప్లవకారులు ఎన్నోసార్లు నిరూపితమైన చారిత్రక సత్యాన్నే మరొకసారి నిరూపించారు. ఆ వైభవోజ్వల దినాలు గతించిపోయాయి. ఇంగ్లిష్ నుడికారంలో వంతెన కింద చాల నీళ్లు ప్రవహించాయి అన్నట్టుగా చాల వంతెనల కింద ఎంతో నెత్తురూ ఎన్నో కన్నీళ్లూ ప్రవహించాయి. చాల వంతెనలే కూలిపోయాయి. కాని ప్రజలకూ పాలకులకూ ఒక నిజమైన చర్చ జరిగే అవకాశం వస్తే ఎంత అద్భుతంగా, రోమాంచకారిగా ఉంటుందో 2004 అక్టోబర్ అక్షరాలా చూపింది.