ఎప్పుడూ చేసే పనే ఎటమటమైతే ఎట్లా?

“దశాబ్దాలుగా చూస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు కూడా రాష్ట్రమంతటా చెలరేగుతున్నది. గత వారం పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆందోళనలూ, అధికారుల అక్రమాలూ, ప్రతిపక్షాల విమర్శలూ,అధికారపక్షపు బూకరింపు సమర్థనలూ వినిపించని రోజు లేదు. బహుశా ఈ దృశ్యం మరొక రెండు వారాల దాకా కొనసాగవచ్చు కూడా. ఈలోగా రోడ్ల మీద, మార్కెట్ ప్రాంగణాలలో, కొనుగోలు కేంద్రాల బైట, ఆరుబయట,  బళ్లలో, ట్రాక్టర్లలో కొనుగోలుకు ఎదురుచూస్తున్న ధాన్యం మీద, ఎదురుచూస్తున్న రైతుల ఆశల మీద నీళ్లు చల్లుతూ అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. లేదా కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తూ,కనీస వసతులు లేక వడదెబ్బకు రైతులు రాలిపోతున్నారు.”

యాసంగి (రబీ) ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అవకతవకల గురించి, అధికార యంత్రాంగం చేతుల్లో రైతాంగం పడుతున్న ఇక్కట్ల గురించి రాష్ట్రమంతా అల్లకల్లోలం అవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయిందని ప్రతిపక్ష పార్టీలన్నీ విమర్శిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొనడం లేదనీ, బెంగాల్ ఎన్నికల వల్ల హమాలీల కొరత వచ్చిందనీ, కేంద్ర ప్రభుత్వ సాచివేత వైఖరి వల్లనే 40 లక్షల తన్నుల ధాన్యం రోడ్ల మీద ఉందనీ ప్రభుత్వం ఎదురు చెపుతున్నది. మొత్తం మీద సకాలానికి ధాన్యం కొనుగోలు జరగాక రైతాంగం ఇబ్బందుల్లో ఉంది.

నిజానికి అదేమీ అనూహ్యంగా వచ్చిపడిన పని కాదు,తత్తరబిత్తర కావడానికి. కాలచక్రం తిరిగినట్టుగా యాసంగి పంటల రుతువూ వస్తుంది, చివరికి పంటలూ వస్తాయి. ఆ పంటలు కొనడం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేయవలసిన పనే. ఆ పని చేయడానికి ఎన్నో వ్యవస్థలూ,నిర్మాణాలూ, ఏర్పాట్లూ, కోట్లాది రూపాయల ప్రజాధనం కేటాయింపూ కూడా ఉన్నాయి. అయినా ఇంత గందరగోళం జరుగుతున్నదంటే మౌలికంగానే ఎక్కడో ఏదో లోపం ఉండి ఉండాలి. పైగా అటువంటి గందరగోళం ప్రతి సంవత్సరం జరుగుతున్నదంటే ఆ మౌలిక లోపాల్ని సవరించుకోవాలనే కోరిక పాలకులకు ఎంతమాత్రం లేదనడానికి గుర్తు.

మామూలుగా ఏప్రిల్ చివరి వారంలో మొదలయ్యే యాసంగి పంటల దిగుబడి మే రెండో మూడో వారాలకల్లా విపరీతంగా పెరిగిపోయి,వ్యవసాయ మార్కెట్లన్నీ రద్దీగా మారిపోతాయి. మార్కెట్ యంత్రాంగం ద్వారా ధాన్య సేకరణ జరపవలసిన ప్రభుత్వం, ఇది ఏటేటా జరిగే పనే గనుక అదనపు ఏర్పాట్లు చేస్తుంది. కొత్తగా కొనుగోలు కేంద్రాలు తెరుస్తుంది. కాని మార్కెట్లలో, కొనుగోలు కేంద్రాలలో అధికార యంత్రాంగం అక్రమాల గురించీ, అవినీతి గురించీ, కొనుగోళ్ల దగ్గర జరిగే తొక్కిసలాటా, తాత్సారం, గిట్టుబాటు ధరలలో కోత, అక్రమ తరుగులు వంటి సమస్యల గురించీ, బలవంతంగా రైతులను ప్రైవేటు వ్యాపారులవైపు తోయడానికి అధికార యంత్రాంగం వేసే ఎత్తుగడలగురించీ, రవాణా సౌకర్యాల లేమి గురించీ రైతుల గగ్గోలు లేకుండా ఒక్క సంవత్సరం కూడా గడవడం లేదు. ఈ కొనుగోళ్ల వ్యవహారమంతా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరగాలి గనుక అందులో జరిగే అవకతవకలకు ప్రభుత్వమే, అధికార పార్టీయే తప్పనిసరిగా బాధ్యత వహించవలసి వస్తుంది. అందులోనూ ఈ కొనుగోళ్లు కేంద్ర ప్రభుత్వ విధానాన్నీ,నిధులనూ అనుసరించి జరుగుతాయి గనుక కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కువ బాధ్యత వహించాలి. సహజంగానే ప్రతి యాసంగి ధాన్యపు కొనుగోళ్ల రుతువు ప్రతిపక్షాల ఆందోళనలకు కూడా అవకాశం ఇస్తుంది.

“రాష్ట్రవ్యాప్తంగా 8,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్ళు సాగిస్తున్నామని కూడా అంటున్నది. అయినప్పటికీ వాస్తవంగా రైతులు తాము తెచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వ సేకరణలో భాగంగా అమ్మడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల ముందు రోజుల తరబడీ, వారాల తరబడీ వేచి చూడవలసి వస్తున్నదని, కొన్ని చోట్ల తూకం వేసిన తర్వాత కూడా ధాన్యాన్ని తీసుకోవడానికి ఆలస్యం చేస్తున్నారనీ రైతులు అంటున్నారు.”

దశాబ్దాలుగా చూస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు కూడా రాష్ట్రమంతటా చెలరేగుతున్నది. గత వారం పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆందోళనలూ, అధికారుల అక్రమాలూ, ప్రతిపక్షాల విమర్శలూ,అధికారపక్షపు బూకరింపు సమర్థనలూ వినిపించని రోజు లేదు. బహుశా ఈ దృశ్యం మరొక రెండు వారాల దాకా కొనసాగవచ్చు కూడా. ఈలోగా రోడ్ల మీద, మార్కెట్ ప్రాంగణాలలో, కొనుగోలు కేంద్రాల బైట,ఆరుబయట, బళ్లలో, ట్రాక్టర్లలో కొనుగోలుకు ఎదురుచూస్తున్న ధాన్యం మీద, ఎదురుచూస్తున్న రైతుల ఆశల మీద నీళ్లు చల్లుతూ అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. లేదా కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తూ,కనీస వసతులు లేక వడదెబ్బకు రైతులు రాలిపోతున్నారు. ప్రభుత్వమూ అధికార యంత్రాంగమూ దశాబ్దాలుగా ఈ పనే చేస్తున్నా గత అనుభవాల నుంచి పాఠాలూ నేర్చుకోవడం లేదు, ప్రస్తుత సందర్భంలో రైతుల కడగండ్లను తగ్గించడానికి కనీస ప్రయత్నాలూ చేయడం లేదు.

దేశంలోకెల్లా హెచ్చు వరి ఉత్పత్తి ఉండే రాష్ట్రాలలో ఒకటిగా తెలంగాణలో వరిధాన్యపు అమ్మకం భారీ వ్యవహారం (ఈ రబీలో మక్కజొన్నలు కూడా అమ్మకానికి వస్తాయి గాని, ప్రస్తుతానికి వరి ధాన్యం గురించే మాట్లాడుకుందాం).   రాష్ట్రంలో వరి ధాన్యం సాలుసరి దిగుబడి 140 లక్షల టన్నులు కాగా, అందులో యాసంగి భాగం 60-80 లక్షల టన్నులు. ప్రతి యాసంగి పంట కోతలకు ముందు ప్రభుత్వం తాను కొనబోయే ధాన్యం పరిమాణం అంచనాలు ప్రకటిస్తుంది. మొత్తం దిగుబడి అంచనా 60-80 లక్షల టన్నులు ఉండగా, ప్రభుత్వం 70-90 లక్షల టన్నులు తాను కొంటానని ఈసారి ప్రకటించింది. దిగుబడి అంచనా కన్నా కొంటానన్న పరిమాణం ఎక్కువ ఉండడం చూసి ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. నిజానికి దిగుబడి కన్నా ఎక్కువ ఎవరూ కొనలేరు. అయితే దిగుబడి అంచనా కూడా కచ్చితమైన అంచనా కాదు,ఎకరానికి ఉత్పాదకత అంకెలను బట్టి, మొత్తం పంట విస్తీర్ణాన్ని బట్టి ఆ అంచనా ప్రకటిస్తారు. అలాగే అప్పుడప్పుడు ఆలస్యమైన ఖరీఫ్ దిగుబడులు రబీ కొనుగోళ్ల తొలి దశ నాటికి మార్కెట్ కు చేరవచ్చు.

అంటే కొనుగోలు అంకె ఒక రాజకీయ ప్రకటన. ఒక్క గింజ కూడా కొనకుండా వదలం అని ప్రభుత్వం చేసే రాజకీయ లక్ష్య ప్రకటన, ఒక వాగ్దానం. రైతులకు మేలు చేయబోతున్నామని చెప్పడానికి ఒక సంకేతం.సేకరణలో కేంద్ర ప్రభుత్వ భాగం కూడా ఉంటుంది గనుక కేంద్ర ప్రభుత్వాన్ని కట్టుబడెయ్యడానికి కూడా ఇలా పెంచి చెప్పవచ్చు. ఈ ధాన్య పరిమాణపు లెక్కలన్నీ బియ్యానివి కావు, వడ్లవి. కొనుగోలు సమయానికి వడ్లలో ఉండే తేమ శాతం వల్ల వాటి బరువు ఎక్కువ కూడా ఉండవచ్చు. ఆ వరి ధాన్యం రైస్ మిల్లులకు వెళ్లి, వాస్తవికంగా మిల్లింగ్ జరిగే నాటికి ఆ బరువు తగ్గవచ్చు కూడా.

అయితే సాధారణంగా ఇలా ముందస్తుగా ప్రకటించిన అంకెను వాస్తవంగా నిలబెట్టుకోవడం ఎప్పుడూ జరగదు. ప్రస్తుతమే చూస్తే మొదట 90 లక్షల టన్నుల సేకరణ అన్నవారు దాన్ని అప్పుడే 75 లక్షల టన్నులకు తగ్గించారు. ఇది రాస్తున్న సమయానికి 54 లక్షల టన్నులు సేకరించడం జరిగిందని ప్రభుత్వమే ప్రకటిస్తున్నది. మరొక పక్క 40 లక్షల టన్నుల ధాన్యం రోడ్ల మీద ఉందని కూడా స్వయంగా ముఖ్యమంత్రే అన్నారు. అంటే అన్నీ కాకిలెక్కలేనా అని ఎవరైనా అనుమానించవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా 8,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోళ్ళు సాగిస్తున్నామని కూడా అంటున్నది. అయినప్పటికీ వాస్తవంగా రైతులు తాము తెచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వ సేకరణలో భాగంగా అమ్మడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల ముందు రోజుల తరబడీ, వారాల తరబడీ వేచి చూడవలసి వస్తున్నదని, కొన్ని చోట్ల తూకం వేసిన తర్వాత కూడా ధాన్యాన్ని తీసుకోవడానికి ఆలస్యం చేస్తున్నారనీ రైతులు అంటున్నారు. చాలా కొనుగోలు కేంద్రాల దగ్గర రైతుల నిరసనలు, ఆందోళనలు, ధాన్యం ఊరికే పారబోయడం, అధికార యంత్రాంగం మీద ఆగ్రహ ప్రదర్శనల వార్తలు వస్తున్నాయి.

“ఈ సమస్యలను సృష్టిస్తున్నది, పెంచుతున్నది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు, ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర కూడా ఉంది. ధాన్య సేకరణ విధానాన్ని, కనీస మద్దతు ధరను నిర్ణయించేది, నిధులు ఇవ్వవలసినది కేంద్ర ప్రభుత్వమే. సేకరణ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. సేకరించిన మొత్తం ధాన్యంలో 50-70 శాతం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు వెళ్లి, జాతీయ బఫర్ స్టాక్ గా మారుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ చౌక ధరల దుకాణాలకు సరఫరా అవుతుంది. మిగిలినది రాష్ట్ర స్థాయిలో ప్రజా పంపిణీ వ్యవస్థకూ, సంక్షేమ కార్యక్రమాలకూ వెళ్తుంది. అంటే ధాన్య సేకరణ అవకతవకలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యత వహించవలసిందే.”

కొనుగోళ్లలో, తూకం వేసిన తర్వాత కూడా కొనుగోలు చేయకపోవడంలో ఆలస్యం చేయడానికి అధికార యంత్రాంగం వైపు నుంచి రెండు కారణాలున్నాయి. నిలువ వసతి లేకపోవడం, వెంటవెంటనే గిడ్డంగులకు, రైస్ మిల్లులకు పంపడానికి రవాణా సౌకర్యాలు, తగిన వాహనాలు లేకపోవడం ఒక కారణమైతే, ఉద్దేశపూర్వకంగా రైతులను ప్రైవేట్ వ్యాపారుల వైపు నెట్టడం మరొక కారణం. అప్పటికే తమ గ్రామం నుంచి ధాన్యం తీసుకుని వచ్చి చాలా రోజులు గడిచిపోయి, ధాన్యం బరువు తగ్గుతూ ఉండడం, అధికారుల ఆలస్యం, కొనుగోలు కేంద్రం దగ్గర నిలువ నీడ లేకపోవడం వంటి కారణాల వల్ల, నాలుగు డబ్బులు తక్కువ వచ్చినా వెంటనే కొనుగోలు పూర్తి చేసే ప్రైవేట్ వ్యాపారికి ధాన్యం అప్పగించడం మంచిదని రైతు అనుకునేలా చేయడమే ప్రభుత్వ అధికారుల లక్ష్యం.

కొనుగోలు కేంద్రాలలో చాలా చోట్ల నీడ, ఆశ్రయం, మంచినీటి సౌకర్యాలు,పారిశుధ్య సౌకర్యాలు లేవు. ధాన్యం మీద కప్పడానికి తగినంత టార్పాలిన్ దొరకదు. గాలికి, వానకు ధాన్యం ఏమైపోతుందోననే భయంతో రైతులు ధాన్యాన్ని అరచేతుల్లో పెట్టుకుని కాపాడవలసి వస్తుంది. పద్ధతి ప్రకారం ధాన్యంలో తేమ శాతం పరీక్షించి గ్రేడింగ్ చేయవలసిన, వరుస సంఖ్య కోసం టోకెన్ లు ఇవ్వవలసిన ప్రభుత్వాధికారులు సాధారణ నిర్లక్ష్యం కారణంగా, అవినీతి కారణంగా,ప్రైవేటు వ్యాపారులతో, రైస్ మిల్లర్లతో, బ్రోకర్లతో, కమిషన్ ఏజెంట్లతో కుమ్మక్కు కారణంగా, రైతుల పట్ల ఉండే మామూలు చిన్నచూపు వల్లవిపరీతమైన ఆలస్యం చేస్తుంటారు. చాలా సందర్భాలలో ప్రభుత్వాధికారులు ధాన్యాన్ని ఏదో ఒక సాకు చూపి నిరాకరిస్తుంటారు.

ఇటీవలి కాలంలో ఆన్ లైన్ కొనుగోళ్లు జరుగుతున్నాయి గనుక, కొన్ని సందర్భాలలో సర్వర్ డౌన్ అయిందనీ, ఆన్ లైన్ సౌకర్యం పని చేయడం లేదనీ, చివరి నిమిషంలో కొనుగోలు ఆపివేస్తారు. కొంటున్న ధాన్యంలో తేమ తరుగు పేరుతో బస్తాకు నాలుగైదు కిలోలు తగ్గిస్తారు. ధాన్యం నింపడానికి తగినన్ని బస్తాలు లేవని, వాహనాలు లేవని కొనుగోళ్లు నిలిపి వేస్తారు. వరుసలో ఒకరిని కొన్ని గంటలు ఆపేశారంటే, వరుసలో వెనుక ఉన్నవారందరి కొనుగోళ్లు మరింత ఆలస్యమైపోతాయి. ఈ ఇబ్బందులన్నిటితో రైతులు అనివార్యంగా, నిర్బంధంగా ప్రైవేట్ వ్యాపారుల దగ్గరికి వెళ్లి అడ్డికి పావుసేరు అమ్ముకోవలసి వస్తుంది.

2025-26 మార్కెటింగ్ సంవత్సరంలో ప్రభుత్వం వరి ధాన్యం క్వింటాల్ కు రు. 2,300 కనీస మద్దతు ధరగా నిర్ణయించింది. కాని ఇది రాస్తున్న సమయానికి రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలలో రైతులకు సగటున క్వింటాల్ కు రు. 1900 మాత్రమే అందుతున్నాయని, రు. 1521 ఇచ్చిన కొనుగోలు కేంద్రాలు కూడా ఉన్నాయని తెలుస్తున్నది. ప్రభుత్వమే ఇలాతాను ప్రకటించిన కనీస మద్దతు ధరను తానే పాటించని స్థితిలో,ప్రైవేట్ వ్యాపారులు మరింత విజృంభిస్తారు. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాపారులు ఇవ్వజూపుతున్న ధర రు. 1800-1900 మాత్రమేనని వార్తలు వస్తున్నాయి. అంటే రైతులు కనీస పక్షం క్వింటాల్ కు నాలుగైదు వందల రూపాయలు నష్టపోతున్నారు.

ఈ సమస్యలను సృష్టిస్తున్నది, పెంచుతున్నది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు, ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర కూడా ఉంది. ధాన్య సేకరణ విధానాన్ని, కనీస మద్దతు ధరను నిర్ణయించేది, నిధులు ఇవ్వవలసినది కేంద్ర ప్రభుత్వమే. సేకరణ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. సేకరించిన మొత్తం ధాన్యంలో 50-70 శాతం కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు వెళ్లి, జాతీయ బఫర్ స్టాక్ గా మారుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ చౌక ధరల దుకాణాలకు సరఫరా అవుతుంది. మిగిలినది రాష్ట్ర స్థాయిలో ప్రజా పంపిణీ వ్యవస్థకూ, సంక్షేమ కార్యక్రమాలకూ వెళ్తుంది. అంటే ధాన్య సేకరణ అవకతవకలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యత వహించవలసిందే.

కనీస గిట్టుబాటు ధరను రూపొందించి రైతాంగాన్ని ఆదుకోవడానికి,వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడానికి, మార్కెట్ శక్తుల అరాచక ధరల నుంచి రైతులను రక్షించడానికి, ధరల ఎగుడుదిగుళ్లను నియంత్రించి మార్కెట్ స్థిరత్వాన్ని కాపాడడానికి, దేశంలో ఆహార భద్రతను కల్పించడానికి రూపొందిన ధాన్య సేకరణ కార్యక్రమం పాలకుల అవకతవకల వల్ల, అధికార యంత్రాంగపు అవినీతి వల్ల, అక్రమాల వల్ల ప్రకటిత లక్ష్యాలలో ఏ ఒక్క లక్ష్యాన్నీ చేరుకోకుండా మిగిలిపోతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *