వోటు హక్కు వినియోగించుకోవాలన్న ఈసీ
న్యూదిల్లీ,సెప్టెంబర్ 30: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మూడోవిడత పోలింగ్ మంగళవారం జరుగనుంది. ఈ మేరకు ఈసీ• అన్ని ఏర్పాట్లు చేసింది. మూడో విడత పోలింగ్ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక సూచన చేశారు. ప్రజాస్వామ్య పండుగలో వోటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అక్టోబర్ 1న తుది విడత పోలింగ్ జరుగనుంది. తొలి రెండు విడతల్లో రికార్డు స్థాయిలో పాల్గొన్న వోటర్లకు రాజీవ్ కుమార్ అభినందనలు తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 58.58 శాతం పోలింగ్‌తో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతాన్ని పోల్చారు.
మొదటి విడతలో 61.38 శాతం, రెండో విడతలో 57.3 శాతం పోలింగ్ నమోదైనట్టు చెప్పారు. వోటింగ్ శాతం, అభ్యర్థుల సంఖ్య, ప్రచారం గణనీయంగా పెరగడాన్ని తాము గమినించామని, రెండు విడతల్లోనూ ఎన్నికలను బహిష్కరించడం కానీ, రీపోలింగ్ కానీ చోటుచేసుకోలేదన్నారు. వోటర్ టర్నవుట్ చరిత్రాత్మకమని చెప్పారు. మూడో దఫా పోలింగ్‌లోనూ గరిష్టంగా వోటర్లు తమ వోటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సెప్టెంబర్ 18, 25 తేదీల్లో మొదటి రెండు విడతల పోలింగ్ జరుగగా, మంగళవారంనాడు 40 నియోజకవర్గాల్లో తుది విడత పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.