రాజ్యాంగపరమైన ప్రశ్నలపైనే మా దృష్టి

– శబరిమలలో మహిళల ప్రవేశంపై విచారణ
– ఆలయాల అంతర్గత ఆచారాల్లోకి వెళ్లదల్చుకోలేదు
– సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు

న్యూదిల్లీ, ఏప్రిల్ 28: శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో మహిళల ప్రవేశం, ఇతర మతపరమైన ఆచారాలపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిదిమంది సభ్యుల భారీ రాజ్యాంగ ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. ఈ సందర్భంగా రాజ్యాంగ నైతికత, మతపరమైన విశ్వాసాల మధ్య జరుగుతున్న చర్చ దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక కీలకమైన అంశాన్ని స్పష్టం చేసింది. తాము కేవలం రాజ్యాంగపరమైన ప్రశ్నలపై మాత్రమే దృష్టి పెడుతున్నామని, వ్యక్తిగత ఆలయాల అంతర్గత ఆచారాల్లోకి వెళ్లదల్చుకోలేదని తెలిపింది. నిర్దిష్టమైన ఆలయ సంప్రదాయాల కంటే మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కుల పరిధినే తాము సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది. వాదనల సమయంలో ఒక మహిళా న్యాయవాది అస్సాంలోని కామాఖ్య ఆలయ ఉదాహరణను కోర్టు ముందు ఉంచారు. అక్కడ మహిళల రుతుస్రావాన్ని ఒక వేడుకగా జరుపుకుంటారని వివరించారు. అదే సమయంలో అక్కడ జరిగే జంతు బలులను ఆపాలని ఒక పిటిషనర్ కోరగా ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ ప్రస్తావనను తోసిపుచ్చింది. సీనియర్ అడ్వకేట్ శ్రీధర్ పోతరాజు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మతపరమైన విశ్వాసాలను పరీక్షించేటప్పుడు నాస్తికుల అభిప్రాయాలను కోర్టు పరిగణనలోకి తీసుకోకూడదు అని వాదించారు. మతపరమైన హక్కులు కేవలం భక్తుల కోణం నుంచే చూడాలని, ఆచారాల పట్ల నమ్మకం లేని వారి వాదనలకు ఇక్కడ తావు లేదని కోర్టుకు విన్నవించారు. ఆధ్యాత్మిక స్వేచ్ఛ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్-21 (జీవించే హక్కు)లో అంతర్భాగమని శ్రీధర్ వాదించారు. మతపరమైన ఆచారాల్లో న్యాయస్థానాల జోక్యానికి ఖచ్చితమైన పరిమితులు ఉండాలని న్యాయవాదులు కోరారు. వ్యక్తిగత విశ్వాసాలకు, రాజ్యాంగ నైతికతకు మధ్య ఉన్న సమతుల్యతపై సుదీర్ఘ చర్చ కొనసాగుతోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *