ఐదు రాష్ట్రాల్లో విజయంతో హ్యాట్రిక్

– బెంగాల్‌లో వోటింగ్ పెరగడం ప్రజల ఉత్సాహానికి సంకేతం
– బీజేపీ అధికారంలోకి రాబోతోంది
– గంగా ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోదీ

లక్నో, ఏప్రిల్ 29: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని, గత ఎన్నికల తరహాలో కాకుండా ఎలాంటి భయాలు లేని వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజాస్వామ్య పటిష్టతకు ఇది సంకేతమని తెలిపారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రజలంతా ఉత్సాహంతో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మే 4న ఐదు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచి హాట్రిక్ సాధించనుందని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని హోర్దోయీలో గంగా ఎక్స్‌ప్రెస్ వేను ప్రధాని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బెంగాల్‌లో జరుగుతున్న పోలింగ్‌ను ప్రస్తావించారు. ’బెంగాల్‌లో ప్రస్తుతం రెండో విడత పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. మొదటి విడతలో మాదిరిగానే ప్రజలు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. గత ఆరేడు దశాబ్దాల్లో ఎవరూ ఊహించని విధంగా భయరహిత వాతావరణంలో ఓటింగ్ జరుగుతోంది. ఓటింగ్ ముగియడానికి మరికొద్ది గంటలే ఉన్నాయి. ప్రజలు ఇదే ఉత్సాహంతో ప్రజాస్వామ్య పండుగలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతున్నా అని మోదీ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినట్లే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించనుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. మే 4న ఫలితాలతో అభివృద్ధి భారత్ సంకల్పానికి మరింత బలం చేకూరనుందని చెప్పారు. కాగా, గంగా మాత ఆశీర్వాదంతో 594 కి.మీ పొడవైన ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టు సాకారమైందంటూ దీనిని యూపీ అభివృద్ధికి కొత్త జీవన రేఖగా ఆయన అభివర్ణించారు. సుమారు రూ.36,230 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం జరిగింది. దేశపు అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ప్రాజెక్టులలో గంగా ఎక్స్‌ప్రెస్‌వే కూడా ఒకటి. ఉత్తరప్రదేశ్‌లో అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే ఇదే కావటం విశేషం.  ఆరు లైన్‌ల యాక్సెస్-కంట్రోల్డ్ కారిడార్ 8 లైన్ల వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. 12 జిల్లాల గుండా మీరట్ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు ఇది విస్తరించి ఉంది. ఇది కేవలం ఒక రహదారిగానే కాక పారిశ్రామిక, లాజిస్టిక్స్, అభివృద్ధి కారిడార్‌గా పనిచేయాలనే భారీ లక్ష్యంతో రూపొందించారు. గంగా ఎక్స్‌ప్రెస్‌వే కారణంగా మీరట్, ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రయాణ సమయం 6 గంటలకు తగ్గనుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *