– పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే
కోల్ కతా, ఏప్రిల్ 29 : ఉత్కంఠ రేపిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే పైచేయి సాధిస్తుందని పీపుల్స్‌పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఎన్నికల్లో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ పోటాపోటీగా తలపడినా మమతా బెనర్జీ మరోసారి అధికారం చేపట్టడం ఖాయమని సర్వేలో తేలింది. 294 అసెంబ్లీ స్థానాల్లో అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148 స్థానాలు. అధికార టీఎంసీ 177-187, బీజేపీ 95-110, కాంగ్రెస్ 1-3, వామపక్షాలు 0-1, బీజీపీఎమ్ 1-2 గెలిచే అవకాశాలున్నట్లు, టీఎంసీ కూటమి 46.5 శాతం, బీజేపీ 41.5 శాతం, వామపక్షాలు 4.1 శాతం, కాంగ్రెస్ 2.1 శాతం, బీజీపీఎమ్ 0.7 శాతం, ఇతరులు 5.1 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయని సర్వేలో వెల్లడైంది. ఎస్సీ, ఎస్టీ ఆధిపత్యం ఉండే జల్పాjáYTగురి డివిజన్‌లో టీఎంసీ, బీజేపీ పోటాపోటీగా తలపడ్డాయి. ఇక్కడ బీజేపీ కొంత మెరుగ్గా ఉన్నా కూచ్ బీహార్‌లో బలహీనంగా ఉంది. ఇక్కడ దళితులు, గుర్ఖాలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు సర్వేలో వెల్లడైంది. మైనారిటీలు అధికంగా ఉండే మాల్దా డివిజన్‌లో టీఎంసీ తన బలాన్ని మరోసారి నిరూపించుకునే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. ప్రెసిడెన్సీ డివిజన్‌లో మరోసారి టీఎంసీ పూర్తి ఆధిపత్యం కనబరుస్తుందని సర్వేలో తేలింది. కోల్ కతా, హౌరా, నార్త్, సౌత్ 24 పరగణ జిల్లాల్లో బీజేపీపై టీఎంసీ పైచేయి సాధించినట్లు సర్వేలో వెల్లడైంది. బుర్దవాన్ డివిజన్‌లో టీఎంసీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా టీఎంసీ ఆధిపత్యమే కనిపిస్తోంది. మిడ్నాపూర్ డివిజన్‌లో బీజేపీ బలోపేతమైనా ముస్లిం ప్రాంతాల్లో టీఎంసీకి కలిసి వస్తుందని సర్వేలో తేలింది. సామాజికవర్గాలుగా పరిశీలిస్తే దళితులు, ముస్లింలు టీఎంసీ వైపు మొగ్గు చూపారు. ఓబీసీలు టీఎంసీ, బీజేపీ మధ్య చీలిపోయారు. మాతూస్ సామాజికవర్గం ‘సర’పై ఆగ్రహంతో బీజేపీకి దూరమయ్యారు. ముస్లిం సామాజికవర్గంలో ఎలాంటి చీలిక కనిపించకపోవడం టీఎంసీకి కలిసి వచ్చింది. ఏఐఎంఐఎం, జేయూపీ, కాంగ్రెస్, వామపక్షాలు ముస్లిం ఓట్లమై ఆశలు పెట్టుకున్నా వారు బీజేపీకి వ్యతిరేకంగా టీఎంసీకే మూకుమ్మడిగా ఓటు వేశారు. రాష్ట్రంలో 35 శాతంపైగా ముస్లిం జనాభా ఉన్న అసెంబ్లీ సీట్లు 89 కాగా, 25 శాతంపైగా ముస్లింలున్న స్థానాలను కలుపుకుంటే మొత్తం 112 స్థానాల్లో ముస్లింలు కీలకంగా ఉన్నారు. ‘సర’తో 90 లక్షల ఓట్లు తొలగించడం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఇప్పుడు ఓటు హక్కు పోయిందని, తర్వాత రేషన్ కార్డులు, పౌరహక్కులు కూడా పోతాయనే భయం ఓటర్లలో నెలకొందని సర్వేలో తేలింది. టీఎంసీ ప్రవేశపెట్టిన లక్కీ భండార్ పథకంతో మహిళలు మమతా బెనర్జీ వైపు మొగ్గు చూపారు. బీజేపీ జాతీయవాదంపై మమతా బెనర్జీ బెంగాలీ సెంటిమెంట్ బాగా పనిచేసింది. రాష్ట్రంలో మమతా బెనర్జీకి సరితూగే నేతలు ఏ పార్టీలో లేకపోవడం టీఎంసీకి కలిసివచ్చింది. బీజేపీ నేత సువేందు అధికారి కీలకపాత్ర పోషించినా మమతా బెనర్జీకి సరితూగలేదు. కాంగ్రెస్, వామపక్షాల నుండి ఆమెకు సమానంగా ఎవరూ లేరు. స్వాతంత్య్రానంతరం బెంగాల్ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే అక్కడ ప్రజలకు సహనం, ఓర్పు ఎక్కువని స్పష్టమవుతోంది. మొదటి దశలో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 25 ఏళ్లపాటు అధికారం కట్టబెడితే ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలకు 35 ఏళ్లపాటు అధికారం కట్టబెట్టారు. ఆ ఒరవడిలోనే టీఎంసీకి నాలుగో దఫా కూడా అధికారం కట్టబెట్టే అవకాశాలున్నాయి. బీజేపీ టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చినా క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి పూర్తిస్థాయిలో కార్యకర్తలు, పార్టీ యంత్రాంగం లేకపోవడం ప్రతికూలంగా మారింది.
రెండోదశలో 90శాతం దాటిన పోలింగ్
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ముగిసింది. 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అయితే సాయంత్రం 6 గంటల లోపు క్యూలో ఉన్నవారికి వోటు వేసే అవకాశం ఈసీ కల్పించడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. చెదురుమదురు హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్నిచోట్ల ఈవీఎంలు మెరాయించడంతో వోటింగ్ ఆలస్యంగా మొదలైంది. పలుచోట్ల బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ఘర్షణలకు దిగారు. అయితే సీఆర్పీఎఫ్ పోలీసుల అప్రమత్తతో పెద్దగా ఘర్షణలు చోటుచేసుకోలేదు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎండలను సైతం లెక్కచేయకుండా పోలింగ్‌లో పాల్గొన్నారు. కాగా, పోలింగ్ పూర్తయిన వెంటనే టీఎంసీ గెలుపుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. తమకు అందిన సమాచారం ప్రకారం బీజేపీ బెంగాల్‌లో ఓటమి చవిచూడనుందని, మూడింట రెండువంతుల మెజారిటీతో టీఎంసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని తెలిపారు. దీనికి ముందు తాను అభ్యర్థిగా నిలబడిన భవానీపూర్ నియోజకవర్గంలో తన వోటు హక్కును మమతా బెనర్జీ వినియోగించుకున్నారు. సీఆర్‌పీఎఫ్, కేంద్ర బలగాలపై నిప్పులు చెరిగారు. ఒక్క పోలింగ్ బూత్ కూడా సురక్షితంగా లేదన్నారు. అన్ని పోలింగ్ బూత్‌లు సీఆర్‌పీఎఫ్ గుప్పిట్లోకి వెళ్లిపోయాయని, ఎక్కడా రాష్ట్ర పోలీసులు బూత్ వద్ద కనిపించలేదని చెప్పారు. అర్ధరాత్రి నుంచే సీఆర్‌పీఎఫ్ బలగాలు, కేంద్ర పరిశీలకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని, టీఎంసీ కార్యకర్తల ఇళ్లల్లో చొరబడ్డారని, టార్చర్ పెట్టారని ఆరోపించారు. 1984 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ ఈ తరహా ప్రజాస్వామ్యం, దౌర్జన్యాలు తానెప్పుడూ చూడలేదన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




