ఇలాగైతే విమానాలను నడపలేం

– విమాన ఇంధన ధరలను అదుపు చేయండి
– వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలి
– కేంద్ర విమానయాన శాఖకు ఎఫ్ఐఏ లేఖ

న్యూదిల్లీ, ఏప్రిల్ 28: విమాన ఇంధన ధరల పెరుగుదలపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్ఐఏ) ఆందోళన వ్యక్తం చేసింది. విమాన ఇంధన ధరల్ని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖకు మంగళవారం లేఖ రాసింది. విమాన ఇంధన ధరలు తగ్గించకుంటే విమానయానాన్ని కొంతకాలం మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎఫఐఏ సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ వంటి సంస్థలకు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నది. తాజాగా ఆయా సంస్థల తరఫున కేంద్రానికి లేఖ రాసింది. ఎఫ్ఐఏ ప్రకారం ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాల వల్ల విమాన ఇంధన ధరలు (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్/ఏటీఎఫ్) భారీగా పెరిగాయి. దీంతో విమానయాన సంస్థలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. విమాన ఇంధన ధరల పెరుగుదల వల్ల విమానాల నిర్వహణ కష్టమైపోతోంది. ఏటీఎఫ్ ధరలు చమురు సంస్థలకు అందుబాటులో లేకుండా పెరిగాయి. ఒక కిలోలీటరు చమురుకు రూ.2 లక్షల వరకు ఖర్చవుతోంది. పశ్చిమాసియాలో క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. సాధారణంగా ఎయిర్ లైన్స్ సంస్థల వ్యయంలో 30-40 శాతం ఇంధనానికి ఖర్చవుతుంది. కానీ, ప్రస్తుతం ధరల పెరుగుదలవల్ల ఈ ఖర్చు 55-60 శాతం పెరిగింది. అందుకే కేంద్రం త్వరగా జోక్యం చేసుకుని ధరలు తగ్గించాలని ఎఫఐఏ కేంద్రాన్ని కోరుతోంది. ఏటీఎఫ్‌పై ప్రస్తుతం విధిస్తున్న 11 శాతం పన్నును తగ్గించాలని అలాగే రాష్ట్రాలు విధించే వ్యాట్ కూడా తొలగించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. కొన్ని రాష్టాల్లో 25 శాతం వరకు వ్యాట్ ఉన్న సంగతిని ఎఫఐఏ ప్రస్తావిస్తోంది. అలాగే, ఇంధన ధరల్లో స్థిరత్వం తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. ధరల స్థిరీకరణకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలని ఎఫఐఏ కోరుతోంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల అనేక మార్గాల్లో విమానాలు నడపడం ఆయా సంస్థలకు భారంగా మారుతోంది. అంతేకాదు.. కొన్ని రూట్లలో విమాన సర్వీసుల్ని తగ్గించడం, రద్దు చేయడం చేస్తున్నాయి. ఇంధన ధరలు పెరిగితే అంతిమంగా విమాన టిక్కెట్ల ధరలు పెరుగుతాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *