- తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు హర్షణీయం..
- సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ ప్రతినిధులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18 : తెలుగు సాహిత్య రంగంలో భావితరాలకు స్పూర్తిని ఇచ్చే విధంగా తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ సుప్రసిద్ద రచయిత, వైతాళికుడు “సురవరం ప్రతాప రెడ్డి (Suravaram Prathapa Reddy ) తెలుగు విశ్వవిద్యాలయం”గా నామకరణం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, శాసనసభలో రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్, తెలంగాణ సారస్వత పరిషత్, సురవరం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య కృషిని గుర్తించాలనే ప్రజలందరి ఆకాంక్షలను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తించి గౌరవించినందుకు ట్రస్ట్ అభినందనలు తెలియజేసింది. తెలుగు విశ్వవిద్యాలయానికి “సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం” గా నామకరణం చేసిన ప్రభుత్వం ప్రతి ఏడాది మే నెల 28వ తేదీన ప్రతాప రెడ్డి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని, దాశరధి పేరుతో పురస్కారాన్ని అందజేస్తున్న మాదిరిగానే ‘సురవరం ప్రతాపరెడ్డి పురస్కారాన్ని’ కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది.
తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టడం తెలంగాణ, తెలుగు భాష ఏకోన్ముకంగా మరింతగా వైభవోపేతం కావడానికి దోహదపడుతుందని ట్రస్ట్ పేర్కొన్నది. ఈ మేరకు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, సంయుక్త కార్యదర్శి జె.చెన్నయ్య, ట్రస్టీలు సురవరం పుష్పలత, డాక్టర్ కృష్ణవర్ధన్ రెడ్డి, డాక్టర్ కొండా లక్ష్మీకాంత రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియుడబ్ల్యుజె) అధ్యక్షులు కె.విరాహత్ అలీ, ట్రస్ట్ సభ్యులు, ప్రతాపరెడ్డి మనుమలు సురవరం అనిల్‌రెడ్డి, సురవరం కపిల్, సుధీర్ తదితరులు మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు సాహత్య, జర్నలిజం రంగాలలో విశేష సేవలు అందిస్తున్న వారికి అందజేస్తున్న ఒక అవార్డుతో పాటు ఈ రంగాలలో అధ్యయనం చేస్తున్న ప్రతిభావంతులకు ఒక స్కాలర్‌షిప్‌ను “సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం” తరపున ఇవ్వాలని ట్రస్ట్ భావిస్తున్నదని, దీనిపై ట్రస్ట్ కమిటీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. మరోవైపు కేంద్ర సాహిత్య అకాడమీ ఆదేశాల మేరకు సురవరం ప్రతాప రెడ్డి జీవితం, సాహిత్య కృషిపై ‘సురవరం ప్రతాప రెడ్డి వాచకం” పుస్తకాన్ని తాను రచించానని, అది ప్రచురణ కావాల్సి ఉందని వెల్లడించారు.
ప్రతాప రెడ్డి రంచించిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’కు ప్రత్యామ్నాయ రచనలు నేటికీ లేవన్నారు. పుష్పలత మాట్లాడుతూ.. తెలుగు భాష మాట్లాడలేని పరిస్థితుల్లో తెలుగు జాతిని మేలుకొల్పేందుకు, తెలుగు సాహిత్య వికాసానికి సురవరం ప్రతాపరెడ్డి ఎనలేని కృషి చేశారన్నారు. డాక్టర్ కృష్ణవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప రెడ్డి పేరు పెట్టడానికి కృషి చేసిన కమ్యూనిస్టు నేత సురవరం సుధాకర్ రెడ్డి, సిపిఐ ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావులకు, సహకరించిన ఎంఎల్ఎలందరికీ ట్రస్ట్ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
డాక్టర్ కొండా లక్ష్మీకాంత రెడ్డి మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప రెడ్డి పేరు పెట్టాలనే ప్రతిపాదన దశాబ్ధకాలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో అది సాకారం కావడం హర్షణీయమన్నారు. కె.విరాహత్ అలీ మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప రెడ్డి నామకరణం చేయడం ఒక వ్యక్తికి కాకుండా తెలుగు సాహిత్య రంగానికి, తెలుగు జర్నలిజానికి, యావత్ సమాజానికి దక్కిన గౌరవమని, తద్వారా తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందన్నారు. అనేక మహోన్నతమైన సాంఘిక గ్రంథాలే మహనీయుడు ప్రతాప రెడ్డి సమాజానికి అందించిన విశేషమైన సేవలకు నిదర్శనమన్నారు. జె.చెన్నయ్య మాట్లాడుతూ చీకటిలో మగ్గుతున్న తెలుగు ప్రజల స్వాభిమాన ప్రతీకగా ప్రతాప రెడ్డి నిలిచారని, తెలుగు యూనివర్సిటికి ఆయన పేరు పెట్టడం ద్వారా తెలుగు సాహిత్య రంగానికి స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారని పేర్కొన్నారు.