స్టేచర్‌, స్ట్రేచర్‌, మర్చురీ….

అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలపై లొల్లి 

సభ్యుల పరస్పర  విమర్శనాస్త్రాలు

(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )
తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి. గవర్నర్‌ ప్రసంగంపై గత రెండు రోజులుగా జరుగుతున్నచర్చ నేపథ్యంలో రెండు వివాదాస్పద అంశాలు చోటుచేసుకున్నాయి. ఒక విధంగా చర్చ ప్రారంభమైన రోజునే ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్‌కు గురికాగా, రెండో రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని నిరసిస్తూ, ఆయన ప్రసంగానికి ముందే బిఆర్‌ఎస్‌ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేయడంతో తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కింది. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో గురువారం బిఆర్‌ఎస్‌ సీనియర్‌ శాసనసభ్యుడు జగదీశ్వర్‌రెడ్డి తన ఆవేశపూరిత ప్రసంగంలో స్పీకర్‌ను ఏకవచనంతో సంబోధించాడని ఆరోపిస్తూ అధికార కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో పెద్ద గందరగోళం ఏర్పడింది.
ఆ విషయంలో తమ వివరణను తీసుకోకుండా ఏకపక్షంగా సభ నుంచి సస్పెండ్‌ చేయడాన్ని బిఆర్‌ఎస్‌ మండిపడింది.  అయినా ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించడంతోపాటు, అసెంబ్లీ ప్రాంగణాన్ని వెంటనే వదిలివెళ్లాలని ఆదేశించడంతో బిఆర్‌ఎస్‌ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌ శ్రేణులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను దహనం చేయడంతోపాటు, రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. వాస్తవంగా జగదీశ్వర్‌రెడ్డి చేసిన ప్రసంగంలో ఎక్కడకూడా ఆయన ఏకవచనంగా సంబోదించిందిలేదని ఆపార్టీ అగ్రనేతలు చెబుతున్నారు. దీనిపై రెండవ రోజుకూడా స్పీకర్‌కు విజ్ఞప్తిచేశారు. దీనిపై పునర్ విచారించి, తమ సభ్యుడు తిరిగి సభలోకి హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మాజీ మంత్రి హరీష్‌రావు కోరినప్పటికీ స్పీకర్‌ దానిపై ఏమాత్రం స్పందించలేదు.
ఇదిలా ఉంటే శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగం వినేదిలేదంటూ బిఆర్‌ఎస్‌ సభ్యులు వాకౌట్‌ చేయగా, మండలిలో కూడా అదే సీన్‌ రిపీట్‌ అయింది. కెసిఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సిఎం క్షమాపణ చెప్పిన తర్వాతే మండలిలో మాట్లాడాలని బిఆర్‌ఎస్‌ సభ్యుల డిమాండ్‌ను పట్టించుకోకపోగా, కనీసం తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో మండలి నుంచి బిఆర్‌ఎస్‌ సభ్యులు కూడా వాకౌట్‌ చేశారు. బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌పై  అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని వారు డిమాండ్‌ చేశారు. స్వతంత్ర  భారత్ లో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడని విధంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడాడని, ఇది క్షమార్హం కాదని వారు ఏక కంఠంగా ఆరోపించారు. గాంధేయ పద్దతిలో అలుపెరుగని పోరాటం చేసి, ఒక రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా, పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని హీనంగా మాట్లాడిన తీరుపై వారు తీవ్రంగా మండిపడ్డారు. పాలన చేతగాక, ఏం చేయాలో తోచని స్థితిలో వ్యక్తిగత దూషణలకు రేవంత్‌రెడ్డి పాల్పడుతున్నారన్నారు. రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టిన ఈ 15 నెలల కాలంలో కెసిఆర్‌ కుటుంబంపై నింద లేకుండా మాట్లాడింది లేదంటున్నారు. ఈ నింద ఎంత పరాకాష్టకు చేరిందంటే కెసిఆర్‌ చావును కోరే వరకు వెళ్ళిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ పార్టీల మధ్య, నాయకుల మధ్య విభేదాలు ఉండడం సహజం. కాని ఎదుటివ్యక్తి చావు కోరుకోవడం నీచ సంస్కృతిని తెలుపుతుందని ఆపార్టీ ఎంఎల్‌ఏ, ఎంఎల్సీలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు గొడ్డలిపెట్టంటూ వారు రేవంత్‌ వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నెల 12న తేదీన రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ సిఎం కెసిఆర్‌పై హేయమైన రీతిలో మాట్లాడాడన్నది బిఆర్‌ఎస్‌ ఆరోపణ. అది ఏదో అలవోకగా మాట్లాడింది కాదని, దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందంటున్నారు బిఆర్‌ఎస్‌ నేతలు. సిఎం చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే కెసిఆర్‌ను నిజంగానే మార్చురీకి పంపే కుట్ర ఏదైనా జరుగుతున్నదా అన్న అనుమానానికి తావేర్పడుతున్నదంటున్నారు బిఆర్‌ఎస్‌ నేత డాక్టర్‌ శ్రవణ్‌. ఈమేరకు ఫిల్మ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైన క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆయన కోరారు.
అలాగే పేట్‌ బషీర్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో మేడ్చల్‌ జిల్లా అధ్యక్షులు శంబీపూర్‌ రాజ, మల్కాజిగిరి ఎంఎల్‌ఏ రాజశేఖర్‌రెడ్డి తదితరులు కూడా సిఎం రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో మరికొందరు కూడా వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తున్నది. వీరంతా రేవంత్‌రెడ్డి మాటల వెనుక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా, కెసిఆర్‌కు ఏదైనా ప్రమాదం తలపెట్టే ఆలోచన ఉందా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పుట్టిన ప్రతీ వ్యక్తి మరణించక తప్పదు. సహజ మరణం సంభవించిన వారినెవరినీ మార్చురీకి పంపరు, కేవలం మెడికల్‌ లీగల్ కేసుకు సంబంధించి, హత్యకు, ప్రమాదాలకు సంబందించినవారినే మార్చురీకి పంపిస్తారు.
మరి ముఖ్యమంత్రి మాటలను ఏవిధంగా అర్థం చేసుకోవాలో విద్యావంతులు ఆలోచించాంటున్నారు. ఇదిలా ఉంటే తన మాటలను వక్రీకరిస్తున్నారని సిఎం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పేర్కొన్నారు. అంత కుంచిత స్వభావం తనకు లేదంటూనే, కెసిఆర్‌ వందేళ్ల పాటు ఆయురారోగ్య గా ప్రతిపక్షంలోనే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తాను ఇక్కడే (సిఎం స్థానంలో), కెసిఆర్‌ ప్రతిపక్ష నాయకుడిగా సూచనలు చేస్తూనే ఉండాలి. నేను మంచి పాలన చేస్తూనే ఉండాలి అంటూ సిఎం రేవంత్‌రెడ్డి ముక్తాయింపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page