ముగ్గురు ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయలేననే ఫోబియాతో ముఖం చాటేసిన వ్యక్తి
హైదరాబాద్ , ప్రజాతంత్ర, డిసెంబర్ 20: కుటుంబ బాధ్యతలకు భయపడి, ముగ్గురు ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయలేననే మానసిక ఒత్తిడి ఫోబియాతో స్వదేశానికి రాకుండా.. గత పదేళ్లుగా సౌదీ అరేబియాలోని తలదాచుకుంటున్న ఒక గల్ఫ్ కార్మికుడి విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన గూడూరి భూమేశ్వర్ పదేళ్ల క్రితం ఏప్రిల్ 2014 లో సౌదీ అరేబియాకు వెళ్ళాడు. ఇండియాకు రావడానికి విముఖత చూపుతున్న భూమేశ్వర్ ను స్వదేశానికి తిరిగి రప్పించాలని అతని భార్య గూడూరి లత శుక్రవారం హైదరాబాద్ లో ‘ప్రవాసీ ప్రజావాణి’ లో వినతి పత్రం సమర్పించారు. ఆమె వెంట ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి, టీపీసీసీ ఎన్నారై సెల్ అడ్వయిజర్ బొజ్జ అమరేందర్ రెడ్డి, గ్రామ ప్రముఖుడు తిప్పర్తి పుల్లయ్య చారి ఉన్నారు.
భూమేశ్వర్ చాలా ఏండ్లుగా సౌదీ నుంచి ఫోన్ చేయకపోవడం వలన… అసలు బతికి ఉన్నాడో లేదో తెలియని పరిస్థితిలో తానూ, తన ముగ్గురు కూతుళ్లు తీవ్రమైన మానసిక క్షోభ అనుభవించామని భార్య గూడూరి లత ఆవేదన వ్యక్తం చేశారు. సౌదీలో ఉన్న తమ గ్రామస్తులు, తెలిసినవారు ఇటీవల అతన్ని ముహాయిల్ అభా ప్రాంతంలో వెతికి జాడ తెలుసుకున్నారని, ఇండియాకు రావడానికి విముఖత చూపుతున్నాడని ఆమె వాపోయారు. తన ముగ్గురు కూతుళ్లు మౌనిక (ఎంసీఏ మొదటి సంవత్సరం), మానస (బీటెక్ మూడో సంవత్సరం), సహస్ర (ఏడవ తరగతి) చదువుతున్నారని, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకుని తన భర్త గూడూరి భూమేశ్వర్ ను సౌదీ నుంచి ఇండియాకు రప్పించాలని, తమ పిల్లల చదువుకు సహాయం చేయాలని లత విజ్ఞప్తి చేశారు.