భారత పన్ను వ్యవస్థను సరళీకృతం చేయాలి

క్ల‌ష్ట‌మైన ఆదాయ ప‌న్ను వ్య‌వ‌స్థ‌తో ఇబ్బందులు
చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప‌టిష్ట‌మైన విధానాలు అవసరం
రాష్ట్రంలో వెనుకబడి ఉన్న జిల్లాలకు నిధులు కేటాయించాలి
రాష్ట్రాల అభివృద్ధికి రుణ స్వేచ్ఛ, ఆర్థిక స్వయంప్రతిపతికి తగిన అనుమతులివ్వాలి
కేంద్ర ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

జైస‌ల్మీర్‌, ప్ర‌జాతంత్ర డిసెంబ‌ర్ 20 : భారత పన్ను వ్యవస్థను సరళీకృతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలంగాణ ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క అభిప్రాయం వ్య‌క్తంచేశారు. ఆదాయ పన్ను చట్టంలో సంస్కరణలు చేయాల‌నుకోవ‌డం స్వాగ‌తించ‌ద‌గిన‌ద‌ని, ప్రస్తుత పన్ను వ్యవస్థ క్లిష్టంగా ఉండటం వల్ల వ్యక్తులు, వ్యాపారాలకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. పన్ను స్లాబుల సరళీకరణ, కార్పొరేట్ పన్ను రేట్ల తగ్గింపు అవసరమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. కీలకమైన కేంద్ర ప్రీ-బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించినందుకు తెలంగాణ ప్రభుత్వం పక్షాన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ధన్యవాదాలు. తెలిపారు. ఈ చర్చలు సమాఖ్య స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయని, రాష్ట్రాల ప్రాధాన్యతలను జాతీయ దృష్టితో చూసే అవకాశాన్ని కల్పిస్తాయన్నారు. రాజస్థాన్ రాష్ట్రం జై సల్మీర్ లో శుక్రవారం జరిగిన కేంద్ర ఆర్థిక మంత్రి ఫ్రీ- బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు.

2021లో ప్రారంభించిన ఆర్థిక సమీకరణ ప్రణాళిక మంచి ఫలితాలు అందించింద‌ని, అయితే ఆర్థిక సంవత్సరం 2026కి చేరుకుంటున్నప్పుడు ఆర్థిక క్రమశిక్షణను వృద్ధి అవసరాలతో సమతుల్యం చేయడం కీలకమ‌ని అన్నారు. మూలధన వ్యయం, ఉపాధి సృష్టి పెంపు కోసం జిడిపికి 4.5% ఆర్థిక లోటు గడువు అనుకూలమని తెలంగాణ ప్ర‌భుత్వం అభిప్రాయ‌ప‌డుతోంద‌ని చెప్పారు. 2027 ఆర్థిక సంవ‌త్స‌రం నుండి, వృద్ధి ప్రేరేపిత విధానంతో రుణ‌-తులనాత్మకతను తగ్గించడంపై దృష్టి పెట్టడం అవసరమ‌న్నారు. భారత పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడం ఆదాయ పన్ను చట్టం సంస్కరణలు స్వాగతించ‌ద‌గిన‌ద‌ని, ప్రస్తుత పన్ను వ్యవస్థ క్లిష్టంగా ఉండటం వల్ల వ్యక్తులు. వ్యాపారాలకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.

పన్ను స్లాబుల సరళీకరణ, కార్పొరేట్ పన్ను రేట్ల తగ్గింపు అవసరమ‌ని, ఆదాయపు పన్ను, జిఎస్టీ ఫైలింగ్ ప్రక్రియలను సరళీకరించడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ అనిశ్చితులు, దేశీయ ఆర్థిక మందగమనం పరిస్థితుల్లో, మూలధన వ్యయ ప్రోత్సాహం అవసరమ‌ని, రాష్ట్రాల మూలధన వ్యయానికి ప్రత్యేక సహాయంగా సంవత్సరానికి ₹2.5 లక్షల కోట్లు కేటాయించాల‌న్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలమని, అయితే, వాటి ఎదుగుదల కోసం తగిన విధానాలు అవసరమ‌ని చెప్పారు. తెలంగాణ ఎస్ఎంఈ టెక్నాలజీ అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంద‌న్నారు. ఐటీఐలను ఆధునీకరించాలి. ఏఐ, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో యువతను నైపుణ్యం కల్పించేందుకు తగిన నిధులు కావాలి. గిగ్ కార్మికులకు సరైన భద్రత అందించడానికి జాతీయ విధానాన్ని రూపొందించాల‌ని సూచన‌లు చేశారు.

తెలంగాణ ప్రత్యేక ప్రాధాన్యతలు
సీఎస్‌ఎస్ కింద తెలంగాణకు తగిన నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంద‌ని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం పెండింగ్ బకాయిల చెల్లింపులు చేయాల‌ని, సంవత్సరానికి ₹450 కోట్ల మంజూరు మరో ఐదేళ్ల పాటు పొడిగించాల‌ని కోరారు. తెలంగాణ వెనుకబడి ఉన్న జిల్లాలకు పర్యావరణ అనుకూలమైన మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి నిధులు అందించాల‌ని డిప్యూటీ సీఎం కోరారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామీణ ఉపాధి సమస్యలను పరిష్కరించడానికి నిధుల వినియోగంలో మరింత సౌలభ్యం అవసరమ‌న్నారు. 5. ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి పీఎల్ఐ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ కోరుతోంద‌ని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి రుణాల కోసం తగిన అనుమతులు ఇవ్వాల‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page