శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను ఘనంగానిర్వహించాలి

  • అంచనాకు మించి భక్తులు వేడుకలకు హాజరయ్యే అవకాశం 
  • భారీ ఏర్పాట్లు చేయండి
  • వేడుకలకు సిద్ధమవుతున్న మిథిలా స్టేడియం పరిశీలన
  • ప్రజా పాలనలో సర్వమతాల సముద్దరణకు ప్రభుత్వం కట్టుబడిఉంది
  • తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటేలా దేవాలయాల అభివృద్ధి
  • రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

భద్రాచలం: దక్షిణ అయోధ్య అయిన భద్రాచలంలో సీతా రాముల కల్యాణ ఉత్సవాన్ని తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది ప్రజలు భక్తి తో వీక్షిస్తారని , ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఏప్రిల్ మొదటి వారంలో జరిగే శ్రీ రామనవమి మహోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని , ఈసారి అంచనాకు మించి భక్తులు కూడా ఎక్కువగా హాజరయ్యే అవకాశం ఉందని కావున ఎవరికీ అసౌకర్యం కలగకుండా భారీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నవమి ఏర్పాట్ల పై మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ అండ్ బి, విద్యుత్, ఆర్ డబ్ల్యూ ఎస్, శానిటేషన్, హెల్త్, రవాణా, ఫైర్, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులను నవమికి జరుగుతున్న ఏర్పాట్లపై వివరాలను అడిగి మంత్రి తెలుసుకున్నారు

అంతకు ముందు నవమి వేడుకలకు సిద్దమవుతున్న మిథిలా స్టేడియాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటేలా దేవాలయాల అభివృధ్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ అన్ని జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీరామనవమి వేడుకలకు ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి హాజరవుతారని మంత్రి తెలిపారు. మూడు రోజుల్లో మాడవీధుల విస్తరణకు అవసరమైన స్థల సమీకరణకు డబ్బులు చెల్లించి, శ్రీరామనవమి రోజున ముఖ్యమంత్రి చేతుల మీద గా మాడవీధుల విస్తరణ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమం చేపడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

వేసవి అధికంగా ఉన్నందున మంచినీటి కేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలను అధికంగా ఏర్పాటు చేయాలన్నారు. స్నానఘట్టాలను, ఆలయ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర స్థాయి అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో పార్కింగ్ కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. వేడుకలకు హాజరయ్యే అతిథులందరికీ కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వీలైనన్ని ఎక్కువగా ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.

కల్యాణం అనంతరం స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దర్శన భాగ్యం కల్పించాలని తెలిపారు. ట్రాఫిక్ కు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం జరగకుండా ముందుగానే ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉంచుకుని నవమి ఉత్సవాలను అట్టహాసంగా జరపాలని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్థానిక ఆర్డీవో దామోదర్ , వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page