135 ఏళ్లుగా దేశ‌సేవ‌లో త‌రిస్తున్న సింగ‌రేణి

ప్రగతి, వ్యాపార విస్తరణలో నెంబర్ వన్
కంపెనీలో పనిచేసే ప్ర‌తీ ఒక్క‌రూ అదృష్ట‌వంతులే.
ప్రైవేటు సంస్థలతో పోటీ పడుతున్న సింగ‌రేణి
సిఎండి ఎన్‌ బలరామ్‌
ఘనంగా సింగరేణి డే వేడుకలు

కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 23 : సింగరేణి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కార్మికులకు, అధికారులకు అలాగే ఉత్పత్తి క్రమంలో ప్రాణాలను అర్పించిన అమర కార్మికులను తలుచుకుంటూ వారికి జోహార్లు అర్పిస్తున్నానని సింగరేణి సంస్థ సిఅండ్‌ ఎండి ఎన్‌ బలరామ్‌ అన్నారు. సింగరేణి డే సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో సోమవారం జ‌రిగిన‌ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అథితిగా ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా సిఅండ్‌ ఎండి మాట్లాడుతూ.. త్యాగానికి మారుపేరుగా నిలుస్తున్న ఈ సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థకు చైర్మన్‌గా పనిచేసే అవకాశం రావడం, సంస్థలో పనిచేస్తున్న అందరితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని స్పష్టం చేశారు. సంక్షేమంలోనూ, ప్రగతిలోనూ, వ్యాపార విస్తరణలోనూ దేశంలోనే నెంబర్‌ వన్‌ గా నిలిచిన ఈ కంపెనీలో పనిచేసే అవకాశం పొందిన ప్రతి ఒక్కరూ, ప్రతి ఉద్యోగి, అధికారి కూడా అదృష్టవంతులేనని నేను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో అనేక ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. కానీ ఇతర ప్రభుత్వ సంస్థలతో పోల్చుకుంటే సింగరేణి సంస్థకు ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టతలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ సంస్థల్లో ఎక్కువ శాతం దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఏర్పడినవే, కానీ సింగరేణి సంస్థ అలా కాదని 1889వ సంవత్సరంలో ఇల్లందు ప్రాంతంలో ప్రారంభమైంద‌న్నారు. స్వాతంత్య్రంకు 58 ఏళ్ల ముందే స్థాపించార‌ని, స్వాతంత్య్రం వొచ్చిన తర్వాత ఇప్పటివరకూ మరో 77 ఏళ్ళుగా దేశ సేవలలో తరిస్తోందని గుర్తు చేశారు.

135 ఏళ్లుగా దేశ, రాష్ట్ర విద్యుత్‌ అవసరాలు తీర్చడం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తున్న ఏకైక మహోన్నత ప్రభుత్వ సంస్థ మన సింగరేణి అని అన్నారు. దేశానికి బొగ్గు అందించడం కోసం, విద్యుత్‌ వెలుగులు పంచడం కోసం, మన సింగరేణి కార్మికులు, తరం తర్వాత తరం తమ స్వేదం చిందించి, ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నారని, ఆ త్యాగధనుల కృషి వల్లనే నేడు సంస్థ ఈ విధంగా నిలబడి ఉందన్నారు. ఈ సందర్భంగా 135 సంవత్సరాలుగా 1920 డిసెంబర్‌ 23న సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌గా నామకరణం జరుపుకుంది.. గనుక ఆ పవిత్ర దినాన్ని మనం సింగరేణి ఆవిర్భావ దినంగా భావిస్తూ ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. మహోన్నత చరిత్ర కలిగిన మన సింగరేణి సంస్థ మరో నూరేళ్ల పాటు ఇదే విధంగా వర్ధిల్లాలని, అందుకు మనమంతా సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. మన సంస్థ ఏడాదికి దాదాపు 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. ఈ బొగ్గులో అధిక శాతం మన రాష్ట్రంలోని ఉన్న అన్ని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు మనం సరఫరా చేస్తున్నామని, విద్యుత్‌ కేంద్రాలు విద్యుత్‌ ను ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్‌ వల్ల మన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకుపోతోందన్నారు. మన బొగ్గును పొరుగున‌ ఉన్న ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తోపాటు 8 రాష్ట్రాలలోని అన్ని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు సరఫరా చేస్తున్నామ‌ని, తద్వారా ఆ రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక సిమెంట్‌ కర్మాగారాలకు స్పాంజ్‌ ఐరన్‌ కర్మాగారాలు, ఎరువులు, మందులు, పేపర్‌ వంటి సుమారు 2000 పరిశ్రమలకు బొగ్గు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మనం ఇచ్చే బొగ్గుతో ఆయా పరిశ్రమలు తమ ఉత్పత్తులు సాధిస్తున్నాయ‌ని తెలిపారు.

భ‌విష్య‌త్ స‌వాళ్ల‌కు సిద్ధంగా ఉండాలి..
సింగరేణి సంస్థ రాష్ట్ర అభివృద్ధిలోనూ, దేశ అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తున్న ఒక గొప్ప బాధ్యతాయుతమైన ప్రభుత్వ సంస్థగా మనమందరం గుర్తించాల‌ని అందుకు గర్వపడాల‌ని బ‌ల‌రామ్ అన్నారు. అదే సమయంలో మన బాధ్యతలను కూడా గుర్తు చేసుకోవాల‌ని కోరారు. ఇప్పటివరకు దక్షిణ భారతదేశం మొత్తానికి బొగ్గు అందించే ఏకైక ప్రభుత్వ సంస్థగా మన సింగరేణి సంస్థ ఏకఛత్రాధిపత్యంగా నిలబడుతూ వొచ్చిందన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, దేశ విద్యుత్‌ అవసరాల రీత్యా బొగ్గు ఉత్పత్తిని మరింతగా పెంచాలన్న ఉద్దేశంతో బొగ్గు పరిశ్రమలోకి ప్రైవేటు సంస్థలకు కూడా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వాలు చట్టాల్లో మార్పులు చేశాయ‌ని చెప్పారు. దేశవ్యాప్తంగా కొత్త బొగ్గు బ్లాకులను వేలం ద్వారా కేటాయిస్తున్నారు. వీటిని అనేక ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు దక్కించుకుంటున్నాయని స్పష్టం చేశారు. రానున్న కాలంలో మనం ప్రభుత్వ, ప్రైవేటు బొగ్గు ఉత్పత్తి సంస్థలతో పోటీపడే పరిస్థితి రాబోతుందని వెల్లడించారు. ప్రైవేటు కంపెనీలు మనకంటే తక్కువ ధరకే బొగ్గును ఉత్పత్తి చేస్తూ, అమ్ముతారని, ఎక్క‌డ‌ తక్కువ ధరకు బొగ్గు దొరుకుతుందో అక్కడికే వినియోగదారులు వెళ్లే అవకాశం ఉందన్నారు. అటువంటి పరిస్థితి ఏర్పడితే దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? మన సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలి.? బొగ్గు ఉత్పత్తి ఖర్చులు ఏ విధంగా తగ్గించుకోవాలి? అనేది పెద్ద సవాలు అన్నారు.

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు లాభాల బోనస్‌ పంపిణీ సభలో మాట్లాడుతూ .. సింగరేణి కార్మికులు, ఉద్యోగులు తమ పని విధానంలో మార్పులు తీసుకురావాలని, సంస్థ ఆర్థిక స్థితిగతులను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని, ఈ సంస్థ మీరే దీన్ని మీరు కాపాడుకోవాలి అంటూ సందేశం ఇచ్చిన విష‌యాన్ని గుర్తుచేశారు. ఆయన ఆదేశం మేరకు అన్ని గనుల్లో, డిపార్ట్మెంటుల్లో సదస్సులు నిర్వహించి సంస్థ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? మనం ఏం చేయాలి ఏం చేస్తే ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది? ఏం చేస్తే కంపెనీకి భవిష్యత్‌ ఉంటుంది.. అనే విషయాలను వివరించామ‌న్నారు. ఇప్పుడు కూడా మల్టీ డిపార్టుమెంట్‌ టీముల ద్వారా చైతన్యపరిచే కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం తర్వాత మీ ఆలోచనలలో కొంత మేరకు మార్పు వొచ్చిందని మనం ప్రధానంగా యంత్రాల ద్వారానే బొగ్గు ఉత్పత్తి సాధిస్తున్నట్లు తెలిపారు. యంత్రాల వినియోగం రోజుకు 24 గంటల్లో ప్రస్తుతం 12 నుంచి 16 గంటల మధ్య ఉంది. దీనిని కనీసం 20 గంటలకు పెంచుకుంటే మన ఉత్పత్తి ఖర్చు బాగా తగ్గిపోతుంది. తద్వారా మనం వినియోగదారులకు తక్కువ ధరకే బొగ్గు అందించే అవకాశం ఉంది. అప్పుడు మన వినియోగదారులు మనతోనే ఉంటారు. ఎన్ని ప్రైవేటు బొగ్గు ఉత్పత్తి కంపెనీలు వచ్చినా ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు.

ఉద్యోగులు కూడా తమ ఎనిమిది గంటల పని సమయాన్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తే మనకు ఉత్పత్తి పెరగడంతో పాటు ఉత్పాదకత కూడా పెరిగి లాభాలు కూడా రెట్టింపయ్యే అవకాశం ఉందని, ఇది జరిగితే మీరు రెట్టింపు లాభాల వాటాను రెట్టింపు సంక్షేమాన్ని పొందే అవకాశం ఉంద‌న్నారు. కంపెనీ కూడా అనేక కొత్త గనులు తెరిచే అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ అంశంపై ఆలోచించి, తల్లి సింగరేణిని కాపాడుకోవడం కోసం కంకణబద్ధులై ముందుకు పోతారని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు.నేడు మారుతున్న మార్కెట్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మన సింగరేణి సంస్థ కూడా బొగ్గు ఉత్పత్తితో పాటు ఇతర వ్యాపారల్లోకి ప్రవేశించాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మనం థర్మల్‌ విద్యుత్‌ రంగంలోకి ప్రవేశిస్తూ మంచిర్యాల జైపూర్‌ వద్ద 1200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పామ‌ని, ఈ విద్యుత్‌ కేంద్రం విజయవంతంగా పనిచేస్తూ ఏడాదికి సుమారు 500 కోట్ల లాభాలను మన కంపెనీకి అందిస్తోంది. ఈ ప్లాంట్‌ విజయవంతమ‌వడంతో అదే ఆవరణలోనే మరో 800 మెగాపాట్ల సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ ప్లాంట్‌ కూడా అతి త్వరలో ఏర్పాటు చేసుకోపోతున్నామని స్పష్టం చేశారు. ముందుగా సింగరేణి జెండాను ఆవిష్కరించారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసిన అతిథులు, గుర్తింపు, ప్రాతినిథ్య కార్మిక సంఘాల నాయకులు, కార్మికులకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page