హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్ 23 : ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనగాల్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 90 ఏళ్ల పడిలో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామ్ బెనెగల్ సోమవారం సాయంత్రం చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1934 డిసెంబర్ 14వ తేదీన హైదరాబాద్‌లోని తిరుమలగిరిలో శ్యామ్ బెనెగల్ జన్మించారు. శ్యామ్ బెనగల్ భారతీయ సినీ దర్శకుడిగా.. చిత్ర రచయితగా గుర్తింపు పొందారు. చాలా మంది టీవీ సీరియల్స్‌లకు దర్శకత్వం వహించిన శ్యామ్ బెనగాల్ అనంతరం సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు.
శ్యామ్ బెనగల్ సినిమాల్లో అంకుర్ (1974) అనే చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. నిశాంత్ (1975), మంథన్ (1976), భూమిక, జునూన్ (1978), మండి (1983), త్రికాల్ (1985), అంతర్నాద్ (1991) లాంటి సూపర్ హిట్ చిత్రాలతో భారతీయ సినీ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో శ్యామ్ బెనెగల్‌ను సత్కరించింది. 2013లో ప్రఖ్యాత అక్కినేని నాగేశ్వరరావు అవార్డు శ్యామ్ బెనెగల్‌కు లభించింది. 2003లో ఇందిరా గాంధీ జాతీయ సమైక్యత పురస్కారం అందుకున్నాడు. ఏడుసార్లు జాతీయ అవార్డులు అందుకోవడం విశేషం.
ఆయన మృతితో భారతీయ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా సినీ, రాజకీయ ఇతర రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సినీ పరిశ్రమకు శ్యామ్ చేసిన సేవలను కొనియాడారు.