- అక్టోబర్‌లో అర్హులందరికీ రేషన్ కార్డులు
- విధివిధానాలు ఖరారు చేస్తున్న కేబినేట్ కమిటీ
- వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్16: రాష్ట్రంలోని నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని వెల్లడించింది. సోమవారం కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. అనంతరం మంత్రి ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. కొత్త రేషన్ కార్డు విధివిధానాలు రూపొందిస్తున్నామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. తెల్ల రేషన్ కార్డు అర్హులు ఎవరనేదానిపై వొచ్చే భేటీలో నిర్ణయిస్తామన్నారు.
ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులను ఎలా ఇస్తున్నారనేదానిపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డుల నిబంధనలు ఎలా ఉండాలని పార్టీలకు లేఖ రాశామన్నారు.. కొందరు ప్రజాప్రతినిధులు విలువైన సూచనలు చేశారని, వొచ్చిన సూచనలన్నీ సమావేశంలో చర్చించామని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. అందరికీ ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామన్నారు.
గత ప్రభుత్వం 49 వేల రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందని, అవి కూడా బై ఎలక్షన్ వచ్చిన నియోజకవర్గాల్లోనే రేషన్ కార్డులు ఇచ్చారని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రమంతా ఏనాడూ రేషన్ కార్డులు ఇవ్వలేదని, తాము . పారదర్శకంగా రేషన్ కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 21న మరోసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఉంటుందని, ఈ నెలాఖరులోగా కేబినెట్ కమిటి రిపోర్ట్ ఇస్తుందని, అక్టోబర్ లో అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రులు వెల్లడించారు.





