ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీలో మున్సిపల్ 15వ వార్డు మాజీ కౌన్సిలర్ సరళ భర్త, సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి (40)ని బుధవారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. భూపాలపల్లి సింగరేణి టిబిజికెఎస్ బొగ్గుగణి కార్మిక సంఘం కార్యాలయం ముందు బుల్లెట్ బైక్‌పై వస్తున్న అతడిని పథకం ప్రకారం కాపు కాసి కత్తులతో దారుణంగా కడుపులో పొడిచి వెళ్లిపోయాడు. చికిత్స నిమిత్తం అతడిని ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.జిల్లా పోలీసు ఉన్నతాధికారులు రాజలింగమూర్తి మృతదేహాన్ని పరిశీలించారు. కాగా, గుర్తుతెలియని దుండగులు రాజలింగమూర్తిని హత్య చేశారని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సిఐ నరేశ్ తెలిపారు. మృతునికి భార్య సరళ, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ఇదిలావుండగా, హతుడు రాజలింగమూర్తి (Rajalilnga murthi) మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావుపై కాళేశ్వరం ప్రాజెక్టును నాణ్యత లోపంతో కట్టారని భూపాలపల్లిలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వివిధ కోర్టుల్లో విచారణ కొనసాగుతోంది. రాజలింగమూర్తి హత్య ఘటన భూపాలపల్లిలో సంచలనంగా మారింది. మృతుడు సామాజిక కార్యకర్తగా పనిచేసేవాడు. పలుచోట్ల సమాచార హక్కు చట్టం కింద సమాచారం సేకరించేవాడు.
మేడిగడ్డ అక్రమాలపై కెసిఆర్, హరీష్ రావుపై రాజలింగమూర్తి భూపాలపల్లి కోర్టులో కేసులు వేశారు. గురువారం హై కోర్టులో విచారణ ఉండగా బుధవారం రాత్రి ఆయనను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేయడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.