- ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే సంఖ్య..
- జ్ఞానేశ్ కుమార్ ఎక్కడ దాక్కున్నా జైలుకే
- మోదీ చెప్పినట్లు పోల్ మ్యాప్ గీస్తున్నారు
- సామాజిక న్యాయానికి మరో 40 ఏళ్ల ఎదురుచూపులా?
- డీలిమిటేషన్ బిల్లుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్
- ప్రస్తుత 543 సీట్లతోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్
న్యూదిల్లీ, నవంబర్ 28 : లోక్‌సభ సీట్లు 850కి పెంచడం బీజేపీకి బ్లాంక్ చెక్ ఇవ్వడమేనని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ బిల్లుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఓ పత్రికా సమావేశంలో రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 850 అనేది కేవలం సంఖ్య కాదని, ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే నంబర్ అని వ్యాఖ్యానించారు. ఈ సంఖ్యతో బీజేపీ ఏమైనా చేయొచ్చని భావిస్తోందని విమర్శించారు. నియోజకవర్గాల హద్దులను మళ్లీ నిర్ణయించడం అంటే బీజేపీకి బ్లాంక్ చెక్ ఇవ్వడమేనని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం కలిగించడంతో పాటు దేశ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ, అమిత్ షా తమకు నచ్చినట్లు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
జ్ఞానేశ్ కుమార్ జైలుకే..
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ద్రోహి అని, అతడు ఏ దేశంలో దాక్కున్నా వెతికి పట్టుకొచ్చి జైలులో పెట్టడం ఖాయమని హెచ్చరించారు. మోడీ చెప్పినట్లు జ్ఞానేశ్ కుమార్ పోల్ మ్యాప్ గీస్తున్నారని, బీజేపీ తన రాజకీయ స్వలాభం కోసమే ఎన్నికల మ్యాప్‌ను మారుస్తోందని ఆరోపించారు. ఓటు చోరీ అంశంపై జ్ఞానేశ్ కుమార్‌ను పలుమార్లు ప్రశ్నించినట్లు తెలిపారు.మోడీ ఫేక్ పీఎం:
2024 సార్వత్రిక ఎన్నికలు ఫేక్ ఎన్నికలని, నరేంద్ర మోడీ ఫేక్ ప్రధానమంత్రి అని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడుతోందని దేశమంతా తెలుసన్నారు. ఎన్నికల సంఘం డేటా ప్రకారం 2024 ఎన్నికలు న్యాయబద్ధంగా జరగలేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదుర్కొన్న పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ ఎలా సాధిస్తుందని ప్రశ్నించారు. తాము మహిళా రిజర్వేషన్ల అమలును వ్యతిరేకించడం లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలతోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయవచ్చని సూచించారు. అయితే సీట్ల సంఖ్యను 850కి పెంచాలన్న ప్రతిపాదన వెనుక బీజేపీ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు.
సామాజిక న్యాయానికి మరో 40 ఏళ్ల ఎదురుచూపులా?
2027 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ జనాభా పెరుగుతున్నప్పటికీ వారికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం పెరగడం లేదని అన్నారు. ప్రతిపాదిత డీలిమిటేషన్ వల్ల మరో 40 ఏళ్ల వరకు సామాజిక న్యాయం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కులగణన చేపట్టడం బీజేపీకి ఇష్టం లేదని, ఇది అంబేద్కర్ రాజ్యాంగాన్ని హత్య చేయడమేనని విమర్శించారు. దేశంలో ప్రస్తుతం నియంతృత్వ పాలన కొనసాగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోడీ, అమిత్ షా, అంబానీ, అదానీ కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుందని, ఎన్నికల సంఘం కూడా కేంద్రం చెప్పినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.





