రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో హస్తం హవా!

  • 3701 పంచాయతీ సమితులు (ఎంపీటీసీ) కాంగ్రెస్ కైవసం
  • 2181 సమితులతో వెనుకబడిన బీజేపీ
  •  599 జిల్లాపరిషత్ల్లో (జెడ్పీటీసీ) కాంగ్రెస్ గెలుపు
  •  301 పరిషత్లకే బీజేపీ పరిమితం

జైపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 20: రాజస్థాన్ గ్రామీణ స్థానిక సంస్థల (పంచాయతీ సమితి, జిల్లా పరిషత్) ఎన్నికల (Rajasthan Rural Elections Results) వోట్ల లెక్కింపులో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. రాష్ట్రంలోని 41 జిల్లాలకు గాను 37 జిల్లాల్లోని 7,543 పంచాయతీ సమితి వార్డులు, 1,275 జిల్లా పరిషత్ వార్డులకు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 7.43 గంటల వరకు వెలువడిన ఎన్నికల ఫలితాల ప్రకారం 3701  పంచాయతీ సమితులను (ఎంపీటీసీ) కాంగ్రెస్ కైవసం చేసుకోగా, బీజేపీ 2181 సమితుల్లో మాత్రమే విజయం సాధించింది. ఆరెల్పీ: 354, స్వతంత్రులు: 341, బీఏపీ: 136, సీపీఐ(ఎం): 40, బీఎస్పీ: 32 సమితులను గెలుచుకున్నారు. ఇక జిల్లా పరిషత్ (జెడ్పీటీసీ)స్థానాల్లో కాంగ్రెస్ 599, బీజేపీ 301, సీపీఐ(ఎం)3, ఆర్ఎల్పీ 2, స్వతంత్రులు ఒక దాన్ని కైవసం చేసుకున్నారు. జైపూర్ జిల్లా పరిషత్‌లోని 57 వార్డులకు గాను 52 వార్డుల ఫలితాలు వెలువడగా, కాంగ్రెస్ 38 వార్డుల్లో విజయం సాధించగా, బీజేపీ 12 స్థానాలకే పరిమితమైందని జీ రాజస్థాన్ పేర్కొంది.

అలాగే జిల్లాలోని 22 పంచాయతీ సమితుల్లో కాంగ్రెస్ 14 చోట్ల గెలుపొందగా, బీజేపీ చోము, సాంబార్‌లలో మాత్రమే మెజారిటీ సాధించింది. సంగనేర్‌లో ఆరెల్పీ విజయం సాధించగా, 5 సమితుల్లో హంగ్ ఏర్పడింది.చురు జిల్లా పరిషత్‌లోని మొత్తం 39 వార్డుల ఫలితాలు వెలువడగా, కాంగ్రెస్ 21 స్థానాలు గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచిందని జాగరణ్ జోష్  నివేదించింది. బీజేపీ 17 స్థానాలు, ఇతరులు 1 స్థానం దక్కించుకున్నారు. ఈ జిల్లాలో మాజీ మంత్రి రాజేంద్ర రాథోడ్ కుమారుడు పరాక్రమ్ సింగ్ రాథోడ్ (వార్డు 39), కోడలు కనికా సింగ్ (వార్డు 23) బీజేపీ తరఫున విజయం సాధించారు. జలోర్ జిల్లా పరిషత్ వార్డుల్లో కాంగ్రెస్ 31 స్థానాలు కైవసం చేసుకోగా, బీజేపీ 12 స్థానాల్లో గెలుపొందింది.  భీమ్ పంచాయతీ సమితిలోని 19 వార్డులకు గాను కాంగ్రెస్ 12, బీజేపీ 7 వార్డుల్లో విజయం సాధించాయి. సీకర్ జిల్లా అజీత్‌గఢ్ పంచాయతీ సమితి ఎన్నికల్లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఝాబర్ సింగ్ ఖర్రా భార్య శాంతి దేవి (వార్డు 17లో 57 ఓట్ల తేడాతో), కుమారుడు అజయ్ సింగ్ (వార్డు 20) ఓటమి పాలయ్యారని ఎన్‌డీటీవీ తెలిపింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మరో కుమారుడు దుర్గా సింగ్ కూడా ఓడిపోయారు.ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలోనూ కాంగ్రెస్ ఆధిక్యం కనబరిచినట్లు మీడియా వార్తలు తెలుపుతున్నాయి.

పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ సభ్యుల తుది ఫలితాలు వెలువడిన తర్వాత, గెలుపొందిన సభ్యులు పంచాయతీ సమితి అధ్యక్షులను (ప్రధాన్) మరియు జిల్లా పరిషత్ అధ్యక్షులను (జిల్లా ప్రముఖ్) ఎన్నుకుంటారు.కోట, బరన్, కరౌలి, శ్రీ గంగానగర్ జిల్లాల ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం డిసెంబర్ 22తో ముగియనున్న నేపథ్యంలో, ఆ 4 జిల్లాల ఓట్ల లెక్కింపును డిసెంబర్ 17న నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *